లోపాల్లో దిట్ట..పాపాల పుట్ట!

Milk distribution Delayed In Anganwadi Centres Krishna - Sakshi

ప్రతి నెలా సరఫరా కాని పాలు

ఒకే సారి నిల్వతో పాడవుతున్న పాలు

కొన్ని చోట్ల అరకొర సరఫరాతో సరి

పాలు తాగలేక      పడేస్తున్న గర్భిణులు, బాలింతలు

పౌష్టికాహార పంపిణీలో భాగంగా ప్రభుత్వం అంగన్‌వాడీ  కేంద్రాల్లో గర్భిణులు, చిన్నారులు, బాలింతలకు సరఫరా చేస్తున్న పాలు తాగేందుకు పనికిరావడం లేదు. పాలు దుర్వాసన వస్తున్నాయని చెబుతున్నారు. తప్పని పరిస్థితుల్లో తాగినా గొంతులో మంట, కడుపు నొప్పి వస్తుందని అంటున్నారు. కనీసం టీ కాచుకొని తాగడానికి సైతం పనికి రావడం లేదంటున్నారు. ప్యాకెట్‌ పాలు రుచించకపోవడంతో అనేక అంగన్‌వాడీ కేంద్రాలలో ప్యాకెట్లు మూలనపడుతున్నాయి. సరఫరా దారుల ఇష్టారాజ్యంగా మారింది.

సాక్షి, అమరావతిబ్యూరో : అంగన్‌వాడీల్లో  పోషకాహారం అందిస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను మాత్రం పట్టించుకోవడం లేదు. పాల పంపిణీలో అనేక లోపాలున్నా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే పాలు దుర్వాసన వస్తుండడంతో తీసుకొనేందుకు గర్భిణులు, బాలింతలు ఇష్టపడటం లేదు. బాలామృతం , కోడిగుడ్లు, భోజనంతో పాటు కేంద్రాల్లో పాలు కూడా ఇస్తారు. గర్భిణులు, బాలింతలకు రోజుకు 200 మిల్లీ లీటర్లు, (అంటే ఒక్కొక్కరికీ ఐదు రోజులకు ఓ లీటర్‌) చొప్పున, ఎత్తుకు తగిన బరువు, బరువుకు తగిన ఎత్తుగానీ లేని పిల్లలకు నిత్యం 200 మిల్లీ లీటర్లు చొప్పున పాలు ఇవ్వాలన్న నిబంధన  ఉంది. జిల్లాలో 3,812 అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రతి నెలా పాలు సరఫరా కావాలి. గతంలో అంగన్‌వాడీ  కార్యకర్తలు స్థానికంగా ఏ రోజుకు ఆ రోజు పాలు కొనుగోలు చేసి వాటిని మరిగించి ఇచ్చేవారు. ఈ తరహాలో అక్రమాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో పాల ప్యాకెట్ల సరఫరా ప్రారంభించారు.

జిల్లాలో పరిస్థితి ఇదీ...
 విజయ డెయిరీ ద్వారా రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు పాలు సరఫరా అవుతున్నాయి. విజయ డెయిరీ వీటిని కర్ణాటకలోని కొని ప్యాకింగ్‌ చేయించి సరఫరా చేస్తుంది. ఇందుకు లీటర్‌కు రూ.45 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రతినెలా అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు తీసుకొచ్చి సరఫరా చేసేలా ఒప్పందం ఉంది. ఇలా సరఫరా చేసే కాంట్రాక్టర్‌లకు రవాణా చార్జీలకు విజయ డెయిరీయే చెల్లిస్తుంది. జిల్లాలో  3,812 అంగన్‌వాడీ కేంద్రాలకు గాను గర్భిణులు, బాలింతలు 54,620 మంది ఉన్నారు. 2,62,640 చిన్నారులు ఉంటే అందులో 2,29,616 మంది కేంద్రాలకు వస్తున్నారు. వారిలో సుమారు లక్షా80 వేల మంది చిన్నారుల బరువు తూచితే  దాదాపు 30 వేల మంది చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యంగా లేని వారు ఉన్నారు. వీరందరికి సగటున 2 నుంచి 2.5 లక్షల లీటర్ల వరకు పాలు సరఫరా కావాలి. ఒక నెలలో సరఫరా చేసిన పాలు మిగిలిపోతే , మరుసటి నెలలో వాటిని తగ్గించి , మిగిలినవి సరఫరా చేయాలి. సరఫరా చేసిన పాల ప్యాకెట్లలో చెడిపోయినవి ఉంటే , వాటిని విజయ డెయిరీ వెనక్కి తీసుకునేలా నిబంధనలున్నాయి.

అధికారులతో లాలూచీ...
అంగన్‌వాడీ కేంద్రాలకు పాల సరఫరాపై నిబంధనలన్నీ కచ్చితంగా ఉన్పప్పటికీ ..చాలా చోట్ల క్షేత్ర స్థాయిలో ఇవి పక్కాగా అమలు కావటం లేదు. సరఫరా దారుడు ప్రతి నెలా అన్ని కేంద్రాలకు సరఫరా చేయటం లేదన్న ఆరోపణలున్నాయి. అ«ధికారులతో లాలూచి పడి సర్ధుబాటు చేసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. గర్భిణులుగా కేంద్రాలలో పేరు నమోదు చేసుకున్న నుంచి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత  6 నెలల వరకు రోజుకు 200 మిల్లీలీటర్ల చొప్పున వీటిని పంపిణి చేస్తున్నారు. ఒక్కో ప్యాకెట్‌ 500 మిల్లీలీటర్లు ఉంది. 5 రోజులకు కలిపి రెండు ప్యాకెట్లను గర్భిణులు, బాలింతలకు పంపిణీ చేస్తున్నారు.

ప్రభుత్వం పట్టించుకోదా
నిల్వ పాలు ప్రజల ఆరోగ్యాలపై ప్రభావం చూపుతున్నాయి. కేంద్రాలలో అందిస్తున్న పాల ఫ్యాకెట్లు ఏ మాత్రం బాగుంటం లేదు. ఒక్కోసారి ఉబ్బిన ప్యాకెట్లు వస్తున్నాయి. తెలియక వాటిని తీసుకెళుతున్నాం. వాసన రావడంతో పడవేయాల్సి వస్తుంది. ప్రభుత్వ నిధులు వృథా అవుతున్నాయి. స్థానికంగా గేదె పాలను ఆ రోజుకారోజు అందిస్తే ఉపయోగం.– దేవబత్తుల నాగమణి, మిలిట్రిపేట, కలిదిండి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top