
ఈ ఫోటో సుమారు పదేళ్ల క్రితం నాటిది. ఈ ఫోటోలో కనిపిస్తున్న వారితో కృష్ణకు చాలా అనుబంధం ఉంది. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం.. 1973 సమయంలో సూపర్ స్టార్ కృష్ణ చెన్నైలో ఉన్నారు. తెల్లవారితో దీపావళి.. అయితే, తెలంగాణలోని మానుకోట నుంచి ఓ కుర్రాడు మద్రాసు పారిపోయాడు. కేవలం సినిమాలంటే పిచ్చితో తన ఊరి నుంచి వెళ్లిపోయాడు. ఏడో తరగతి పరీక్షలు రాసేసి.. రాత్రి సెకండ్ షో సినిమా చూసేసి మద్రాస్ రైలెక్కేశాడు. అయితే, అక్కడ పగలంతా చాలామంది సినిమా వాళ్ల ఇళ్ల చుట్టూ తిరిగేశాడు. కానీ, రాత్రి కాగానే భయంతో ఎక్కడ ఉండాలో తెలియిని పరిస్థితిలో ఉన్నాడు.

ఒక రోజు హీరో కృష్ణ ఇంటి ముందుకు చేరిన ఆ కుర్రాడు అక్కడక్కడే తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే విజయనిర్మల కంట్లో పడ్డాడు. ఇంతలోనే కృష్ణ రావడంతో ఆ కుర్రాడిని దగ్గరికి పిలిచి ఎవరు నువ్వు అంటూ వివరాలు అడిగాడు. అయితే, నేను అనాథను అని ఆ పిల్లాడు అబద్ధం చెప్పాడు. దీంతో కృష్ణకు జాలి కలిగింది. సర్లే.. ఇక్కడే ఉండు అనేసి తన కారు డ్రైవర్‌ను పిలిపించాడు. ఈ కుర్రాడికి కొత్త బట్టలు కొనివ్వమని డబ్బులు ఇచ్చేసి వెళ్లిపోయాడు. మరుసటిరోజు దీపావళి కొత్త దుస్తులతో ఉన్న ఆ పిల్లాడితో టపాకులు కూడా కృష్ణ దంపతులు కాల్పించారు. అలా అనాథ అని చెప్పి నాలుగు నెలలపాటు ఆ కుర్రాడు అక్కడే ఉన్నాడు.
అయితే, తమ కుమారుడి జాడ కోసం రాష్ట్రం మొత్తం తల్లిదండ్రులు ఎతుకుతున్నారు. పోలీసు కేసు కూడా పెట్టారు. పత్రికలలో ఫోటో కూడా ప్రచురించారు. ఫైనల్‌గా అతని జాడ కనుక్కొని కృష్ణ ఇంటికి చేరుకున్నారు. జరిగిన విషయం అంతా ఆయనతో పంచుకున్నారు. దీంతో వెంటనే ఆ కుర్రాడిని పిలిపించి తల్లిదండ్రులను బాధపెట్టకుండా బాగా చదువుకోవాలని హితవు చెప్పాడు. కావాలంటే ఆ తరువాత సినిమాల గురించి ఆలోచించాలని కోరాడు. అలా నచ్చజెప్పి వాళ్లతో పంపించేశాడు. అయితే, ఆ రోజు కృష్ణ ఇచ్చిన ఒక కీచైన్ గిఫ్టు తీసుకుని తల్లిదండ్రులతో వెళ్లిపోయాడు. ఆ తరువాత 40 ఏళ్లపాటు ఆ కుర్రాడు కృష్ణ దగ్గరకు వెళ్లలేదు. కానీ, తనను చిన్నప్పుడు చేరదీసిన కృష్ణను మరిచిపోలేదు. నాలుగు నెలలపాటు కన్నబిడ్డలా తనను చూసుకోవడంతో అభిమానం విపరీతంగా పెంచుకున్నాడు. దీంతో తన కొడుకు పేరు విమల్ కృష్ణ, కూతురు పేరు రమ్య కృష్ణ అని పెట్టుకున్నాడు. ఆ విమల్ కృష్ణనే డీజే టిల్లు సినిమా దర్శకుడు.

నాన్న ఆశయాన్ని 'డీజె టిల్లు'తో తీర్చాడు
ఏడు తరగతిలోనే పారిపోయిన ఆ కుర్రాడి పేరు శ్రవణ్ కుమార్.. బాగా చదువుకోవమని కృష్ణ ఇచ్చిన సలహాని పాటించి ఉన్నత స్థాయిలోకి వచ్చాడు. అతని కొడుకు విమల్ కృష్ణ బీటెక్ పూర్తి చేసినప్పటికీ ఉద్యోగం జోలికిపోలేదు. శ్రవణ్ మాదిరే తనకు కూడా సినిమాలంటే మక్కువే. దీంతో చాలా ప్రయత్నాలు చేసి దర్శకుడిగా డీజె టిల్లు సినిమాను తెరకెక్కించి భారీ విజయం అందుకున్నాడు. అలా తన నాన్న కోరికను విమల్ కృష్ణ పూర్తిచేశాడు. ఈ విషయం తెలిసిని వాళ్లు కృష్ణ గొప్పతనం మరిచిపోరు. అలా అనాథ అని వచ్చిన ఒక కుర్రాడిని కన్నబిడ్డలా చూసేవారు ఉంటారా.. దటీజ్ కృష్ణ.