నైటీలు.. ముఖానికి చున్నీతో బాలికల హాస్టల్లోకి..

Midnight Boys Were Entering Girls Dormitories In Bobbili - Sakshi

సాక్షి, బొబ్బిలి: మా వసతిగృహాలకు ప్రహారీ లేదు.. మేడపైకి సులువుగా ఎక్కే సన్‌షెడ్‌లు మీదుగా అర్ధరాత్రి పోకిరీలు లోనికి వచ్చేస్తున్నారు. అక్కడ మేం ఆరబెట్టుకున్న నైటీలు వేసుకుని బాలికల్లా లోనికి వచ్చేస్తున్నారు. మేం గట్టిగా కేకలు వేసేసరికి పారిపోతున్నారు. నిత్యం ఇదే యాతన... ఇప్పటికిలా ఆరుసార్లు వచ్చారు. మేం జిల్లా అధికారులు, పోలీసులకు కూడా పలుమార్లు చెప్పాం... అయినా చర్యల్లేవు. నిత్యం భయంగా వసతిగృహంలో గడుపుతున్నామని ప్రభుత్వ బీసీ కళాశాల, ప్రీమెట్రిక్‌ కళాశాల విద్యార్థినులు విలేకర్లు, విద్యార్థి సంఘాలతో చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి కూడా ఇలానే వచ్చేసరికి వారు ఎన్నాళ్లీ భయభ్రాంతులని అల్పాహారం తినకుండా నిరసన వ్యక్తం చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఎస్‌ఎఫ్‌ఐ  విద్యార్థి సంఘ నాయకులకు విషయం తెలిసి వారితో కలసి బైఠాయించారు. పట్టణ పరిధిలో ఐటీఐ కాలనీలో సమీకృత కళాశాల వసతి గృహం ఉండేది. ఇక్కడి వసతిగృహం గత ప్రభుత్వ హయాంలో విలీనం చేసి విద్యార్థులను పలు చోట్లకు తరలించారు. ఇదే వసతి గృహభవనాన్ని  ప్రీమెట్రిక్, కళాశాల విద్యార్థినుల కోసం కేటాయించారు. దీనికి ప్రహరీ లేదు.

పలుమార్లు అల్లరి మూకలు వసతిగృహంలోకి రాత్రి వేళల్లో లోనికి చొరబడుతున్నారని విద్యార్థినులు వాపోయారు. పలుమార్లు అధికారులకు కూడా తెలిపారు. శుక్రవారం కూడా ఇదే రీతిన రావడంతో వారు 100 నెంబర్‌కు కాల్‌ చేశామని చెప్పారు. మహిళా ఎస్‌ఐకు కూడా కాల్‌ చేశామన్నారు. కానీ ఎవరూ రాకపోవడంతో వేకువ జామున నాలుగు గంటల వరకూ బిక్కు బిక్కుమంటూ గడిపామన్నారు.  గడచిన ఆదివారం ఓ అగంతకుడు తాము ఆరబెట్టుకున్న నైటీని ధరించి లోనికి వచ్చేశాడన్నారు. ముఖానికి చున్నీ వేసుకుని ఉన్నాడనీ, అయితే ఆ చున్నీ ఊడిపోవడంతో మీసాలు చూసి పెద్దగా కేకలు వేశామని విద్యార్థినులు చెప్పారు. వసతిగృహంలో జరిగిన ఘటనకు వార్డెన్, విద్యార్థినులు కన్నీరు మున్నీరుగా విలపించారు. 120 మంది కళాశాల విద్యార్థినులు, మరో 60 మంది స్కూలు పిల్లలు ఉన్న ఈ వసతి గృహంలో నిత్యం ఏడు గంటలకు అల్పాహారం తినే విద్యార్థినులు ఈ ఘటనతో శనివారం టిఫిన్‌ చేయడం మానేశారు.

మహిళా ఎస్‌ఐ కేటీఆర్‌ లక్ష్మీ, మహిళా రక్షక్‌ కోఆర్డినేటర్‌ మంగమ్మ వచ్చి విద్యార్థినులకు కౌన్సెలింగ్‌ చేశారు.  అనంతరం   టిఫిన్లు చేశారు.  ఈ సందర్భంగా ఎస్‌ఐ విలేకర్లతో మాట్లాడుతూ తమకు ఫోన్లు రాలేదన్నారు. సీఐ మాట్లాడుతూ 100కు డయల్‌ చేసినపుడు ఏ నంబరయినా రికార్డు అవుతుందనీ, కాల్‌ లిస్ట్‌ పరిశీలిస్తామని చెప్పారు. అనంతరం అక్కడకు వచ్చిన ఏఎస్‌ఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘ నాయకులను సీఐ కేశవరావు పిలిచి మాట్లాడారు. విద్యార్థినులు చేసిన నిరసనకు సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ మద్దతుగా నిలిచారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top