మావోయిస్టుల నిరసన వారోత్సవాలు తొలిరోజు ప్రశాంతం

Maoists Protest Compleat First Day in AOB - Sakshi

విశాఖపట్నం , అరకులోయ : కేంద్ర ప్రభుత్వం ఆమలుజేస్తున్న సమాధాన్‌కు నిరసనగా మావోయిస్టులు చేపట్టిన నిరసన వారోత్సవాల తొలిరోజు శుక్రవారం ప్రశాంతంగానే ఉంది. ఈ వారోత్సవాలతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఏవోబీ వ్యాప్తంగా పోలీసులు తనిఖీలను విస్తృతం చేశారు. ప్రధాన రోడ్లలో వాహనాల తనిఖీలను చేపడుతూ ప్రయాణికుల లగేజీ బ్యాగులను సోదాలు చేస్తున్నారు. పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లోని మారుమూల ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వాహనాలపై పోలీసులు మరింత నిఘా ఉంచారు. పాడేరు నుంచి అరకులోయ పోయే వాహనాలతో పాటు, సరిహద్దులో ఉన్న ఒడిశా గ్రామాల నుంచి కామయ్యపేట మీదుగా రాకపోకలు సాగిస్తున్న వాహనాలను హుకుంపేట వద్ద ఎస్‌ఐ నాగకార్తీక్‌  తనిఖీలు చేశారు. అనుమానిత వ్యక్తుల సమాచారం సేకరించారు. అరకు సంతలోనూ తనిఖీలు చేపట్టారు. ఏజెన్సీలోని రూడకోట, నుర్మతి అవుట్‌ పోస్టుల పరిధిలోని ప్రత్యేక పోలీసు పార్టీలు డేగకన్నుతో వ్యవహరిస్తున్నాయి. 

పాడేరులో తనిఖీలు
పాడేరు : సమాధాన్‌ కార్యక్రమానికి వ్యతిరేకంగా సీపీఐ మావోయిస్టులు ఈ నెల 25 నుంచి 31 వరకు నిరసన వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. పాడేరు పట్టణం నలుమూలల పోలీసులు శుక్రవారం ముమ్మరంగా నిఘా చర్యలు చేపట్టారు. పట్టణం వెలుపల జి.మాడుగుల వైపు, పెదబయలు వైపు వెళ్లే ప్రధాన రహదారుల్లో వాహన తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని బక్కలపనుకు ఏరియాలో పోలీసులు గృహ తనిఖీలు నిర్వహించారు. కూడలి ప్రాంతాలు, ఆర్టీసీ కాంప్లెక్సు తదితర చోట్ల తనిఖీలు చేపట్టారు.  సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ అప్పలనాయుడు, ఎస్‌ఐ రామారావు పర్యవేక్షణలో పోలీసు బృందాలు నిఘా చేపట్టాయి. 

కూంబింగ్‌ ఉధృతం
కొయ్యూరు :  కొన్ని వారాలుగా మావోయిస్టుల పలకజీడి వారపు సంతల్లో కరపత్రాలు వేస్తున్నారు. దీంతో పోలీసులు ఆటువైపుగా కూంబింగ్‌ను ఉధృతం చేశారు. టీడీపీ, బీజేపీ నేతలను లక్ష్యంగా చేస్తూ మావోయిస్టులు కరపత్రాలు, పత్రికాప్రకటనలు చేయడంతో ఆ పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

కరపత్రాలు వెదజల్లిన మావోయిస్టులు
చింతపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న ఆపరేషన్‌ సమాధాన్‌ దాడిని ఓడించాలని సీపీఐ మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈమేరకు పలుగ్రామాల్లో కరపత్రాలు వెదజల్లారు. సమాధాన్‌  పేరుతో కొనసాగిస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా 30 వరకు నిరసనలు తెలియజేయాలని, 31న భారత్‌ బంద్‌ పాటించాలని కరపత్రాల్లో పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top