
తాడు సహాయంతో నక్కా రామును వంతెనపైకి లాగుతున్న అగ్నిమాపక దళం
వ్యక్తిని కాపాడిన అగ్నిమాపక దళం
పశ్చిమగోదావరి ,భీమవరం టౌన్: ఉధృతంగా ప్రవహిస్తున్న యనమదుర్రు డ్రెయిన్‌లోకి భీమవరంలోని చిన్నవంతెన పైనుంచి మద్యం మత్తులో నక్కా రాము అనే వ్యక్తి ఆదివారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో దూకేశాడు. ఇది చూసిన స్థానికులు వెంటనే అగ్నిమాపక దళ కేంద్రానికి సమాచారం అందించారు. ఫైర్ ఆఫీసర్ ఎస్‌కే జాన్‌అహ్మద్ ఆధ్వర్యంలో సిబ్బంది బాల ఏసు, సుబ్బారావు, వెంకటరత్నం, వై.సుబ్బరాజు అక్కడికి చేరుకున్నారు.
తాడు సహాయంతో రామును బయటకు తీసుకువచ్చేందుకు శ్రమించారు. మద్యం మత్తులో ఉన్న అతను తాడును పట్టుకుని కొంతమేర పైకి లాగిన తర్వాత వదిలేయడంతో మళ్లీ అతన్ని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది చెమటోడ్చారు. ఎట్టకేలకు రక్షించగలిగారు. డీఎన్నార్ కాలువగట్టు సమీపంలో నివశిస్తున్న అతను తనకు ఏవో కష్టాలు ఉన్నాయని మద్యం మత్తులో ఉండి చెబుతున్నాడు. చివరకు అతన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి ఊపిరి పీల్చుకున్నారు.