ప్రేమ పేరుతో మోసం

Love Cheating Issue In Spandana Programme At Nellore - Sakshi

వజ్రాల ఉంగరాలు, రూ.10 లక్షలు నగదుతో ఉడాయింపు

స్పందనలో డీఎస్పీకి యువతి ఫిర్యాదు

సాక్షి, కావలి: మూడేళ్లపాటు ప్రేమించి, పెళ్లి చేసుకొంటానని చెప్పి తన వద్ద నుంచి మూడు వజ్రాల ఉంగరాలు, రూ.40,000 విలువ చేసే టచ్‌ స్క్రీన్‌ ఫోన్, రూ.10 లక్షలు నగదు కాజేసిన ప్రియుడు తనను పెళ్లి చేసుకోనంటున్నాడని భాధిత యువతి సోమవారం కావలి డీఎస్పీ కార్యాలయంలో జరిగిన ‘స్పందన’ కార్యక్రమంలో ఫిర్యాదు అందజేశారు.  ఫిర్యాధుపై అప్పటికప్పుడు భాధిత యువతి, ఆమె తల్లి, వారికి అండగా ఉన్న మహిళా సంఘం నాయకురాలు చాకలికొండ శారదలతో డీఎస్పీ ప్రత్యేకంగా మాట్లాడారు. ఈసందర్భంగా క్రిస్టియన్‌పేటలోని 2వ లైన్‌లో నివాసం ఉంటున్న స్థానిక జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలైన శెట్టిపల్లి సునీత సెలీనా మూడో కుమారుడైన ప్రేమ్‌ రంజన్‌తో స్థానిక కో ఆపరేటీవ్‌ కాలనీకి చెందిన యువతి ప్రేమించుకొన్నారు.

మూడేళ్ల ప్రేమాయణంలో ప్రేమ్‌ రంజన్‌ ఎటూ మనం పెళ్లి చేసుకొంటున్నామని, తాను ఐఏఎస్‌ సాధించడానికి ప్రిపేర్‌ అవుతున్నానని యువతిని నమ్మబలికాడు. అందుకే పెళ్లి తర్వాత నాకు ఇచ్చే డబ్బును ఇప్పుడే ఇస్తే నేను స్థిరపడటానికి ఉపయోగపడుతుందని ఆశలు కల్పించాడు. దీంతో యువతి పెళ్లి కోసం ఆమె తండ్రి బ్యాంక్‌లో భద్రపరచిన నగదు వివరాలను తెలుసుకొని, ఆమెపై ఒత్తిడి చేసి రూ.10 లక్షలు నగదును తీసుకొని జల్సాలు చేసుకొన్నాడు. అలాగే ప్రేమ కానుకగా వస్తువులు తీసుకొన్నాడు. ఇటీవల యువతి పెళ్లి చేసుకోమని కోరడంతో ప్రియుడు కులాల పేరుతో వివాదాన్ని రేకిత్తించాడు. యువతి గిరిజన సామాజిక వర్గాన్ని ఉద్ధేశించి చులకనగా మాట్లాడి దుర్భాషలాడాడు. ఈ విషయంలో టూటౌన్‌ సీఐకు న్యాయం చేయమని కోరి ఫిర్యాదు చేస్తే, మోసం చేసిన ప్రియుడుకు సంబంధించిన దళారులను కూర్చొపెట్టుకొని తమ పట్ల హేళనగా మాట్లాడుతున్నాడని డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన జీవితాన్ని నాశనం చేసిన ప్రేమ్‌ రంజన్, అతని కుటుంబసభ్యులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు.

సబ్‌ కలెక్టర్, తహసీల్దార్‌లకు అర్జీలు
కావలి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన ‘స్పందన’ కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అలాగే కావలి తహసీల్దార్‌ కార్యాలయంలో జరిగిన ‘స్పందన’లో తహశీల్దార్‌ రామకృష్ణ ప్రజల సమస్యలను తెలసుకొన్నారు. కాగా బీజేపీ నాయకులు కందుకూరి సత్యనారాయన ఆధ్వర్యంలో కొందరు రోజుల బిడ్డను తీసుకొచ్చి తహసీల్దార్‌ ఎదుట ఉన్న టేబుల్‌పై పడుకోబెట్టి, బాలకృష్ణారెడ్డి నగర్‌ వివాదంలో తాము చెప్పినవి పరిష్కరించాలని కోరితే ఎందుకు చేయలేదని నిలదీశారు. ఈ హఠాత్పరిణామంతో ఉలిక్కిపడిన తహసీల్దార్‌ వెంటనే తేరుకొని బాలకృష్ణారెడ్డి నగర్‌ వివాదానికి, టేబుల్‌పై పసి బిడ్డను పడుకోబెట్టడానికి సంబంధం ఏమిటని ప్రశ్నించి, బిడ్డను తీయమని చెప్పారు.

బీజేపీ నాయకులు అలాగే మాట్లాడతుండటంతో తహశీల్దార్‌ పోలీసులకు ఫోన్‌ చేసి అర్జెంట్‌గా తన కార్యాలయానికి రావాలని చెప్పారు. దీంతో బీజేపీ నాయకులు తాము అడిగిన దానికి సమాధానం చెప్పకుండా పోలీసులకు ఫోన్‌ చేయడమేమిటని తహసీల్దార్‌ను అడిగారు. ఇక పోలీసులు వచ్చేస్తారేమోనని బీజేపీ నాయకులు తమ వెంట ఉన్న వ్యక్తులను తీసుకొని తహశీల్దార్‌ కార్యాలయంలో నుంచి బయటకు వచ్చేశారు. కాగా టీడీపీ నాయకుడు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ వద్ద ర్యాలీ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఏసీటీ కేబుల్‌ కనెక్షన్లను ప్రజలు రద్దు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top