తిప్పాలంటే అప్పు చేయాల్సిందే!

Loory Transport Owners Worry About Diesel Prices - Sakshi

లారీ పరిశ్రమను అతలాకుతలం చేస్తున్న డీజిల్‌ ధరలు

రోజు రోజుకూ పెరిగిపోతున్న ఇంధనభారం

వారం రోజులు తిప్పితే.. మిగిలేది రూ. 5వేలే..

ఫైనాన్స్‌ చెల్లించేందుకూ తప్పని అవస్థలు

బాబోయ్‌ ఇక లారీలు నడపలేమంటున్న లారీ యజమానులు

విజయనగరం, సాలూరు: రాష్ట్రంలో లారీ పరిశ్రమ మాట వినగానే ఠక్కున గుర్తుకువచ్చేది విజయవాడ, ఆ తర్వాత సాలూరే. పట్టణంలో దాదాపు 1200 లారీలు వున్నాయి. 15వేల కుటుంబాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లారీ పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. కొద్దికాలంగా పరిశ్రమ ఒడిదుడుకులకు లోనౌతుండడం లారీ యజమానులను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు. దీనికి కారణం డీజిల్‌ ధరలు రోజురోజుకూ పెరిగిపోతుండడమే. ప్రధానంగా సాలూరు లారీ పరిశ్ర మ విశాఖ నుంచి రాయపూర్‌కు సరకులను తరలిస్తూ, తీసుకురావడంపైనే ఆధారపడి వుంది. రానూపోనూ దాదాపు 1300 కిలోమీటర్ల దూరం వుంటుంది. వెళ్లి వచ్చేందుకు దగ్గరదగ్గరగా 450నుంచి 500 లీటర్ల వరకు డీజిల్‌ ఖర్చవుతుంది.

విశాఖ నుంచి రాయపూర్‌కు సరుకులను తీసుకువెళ్లి అక్కడ అన్‌లోడ్‌ చేసి, తిరిగి అక్కడి నుంచి సరుకులను లోడ్‌ చేసుకుని, మళ్లీ విశాఖ చేరుకునేందుకు వారంరోజుల సమయం పడుతుంది. డీజిల్‌ కొనుగోలుకు దాదాపు రూ. 40వేలు ఖర్చుచేయాల్సిరాగా, మరో రూ. 15వేల వరకు డ్రైవర్, క్లీనర్‌ ఖర్చులు, టోల్‌ ట్యాక్స్‌లు, ఇతర ఖర్చులు అవుతున్నట్టులారీ యజమానులు చెబుతున్నారు. ఐతే సరుకుల తరలింపువల్ల వచ్చేది రూ. 60వేల వరకు ఉండగా, ఇక మిగిలేది కేవలం రూ. 5వేలే. అందులోనే లారీ ఫైనాన్స్‌ చెల్లింపుతోపాటు టైర్ల కొనుగోలు, సిబ్బంది జీతాలు సైతం సమకూర్చాల్సివుంది. నెలకు 4 ట్రిప్పులు జరిగితే మిగిలేది రూ. 20వేలే. ఆదాయం అత్యల్పంగా వుండడంతో చేసేదిలేక అప్పులు చేయాల్సి వస్తోందని లారీ యజమానులు గగ్గోలు పెడుతున్నారు.  

డీజిల్‌ ధరే ప్రధాన భారం
డీజిల్‌ ధరే లారీ పరిశ్రమను కుంగదీస్తోందని లారీ యజమానులు చెబుతున్నారు. ఇష్టారాజ్యంగా ధరను పెంచేస్తుండడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్ర ప్రభుత్వం లీటరు డీజిల్‌పై 2రూపాయల ధరను తగ్గించడంతో లారీ యజమానులు సంబరపడిపోయారు. కానీ ఇంతలోనే ధర తారాజువ్వలా దూసుకుపోతుండడంతో లారీ యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కేవలం నెలరోజుల వ్యవధిలోనే లీటరుపై రూ. 4ల భారం(తగ్గించిన ధరలను తీసేస్తేనే) పడడంతో మిగులుతున్న రూ. 5వేలు కూడా డీజిల్‌కు అర్పించేసి... తిరిగి అప్పులపాలవ్వాల్సి వస్తోందని వాపోతున్నారు.  

పెట్రోల్‌ వినియోగదారుడిపైనా భారమే
ఇదిలావుండగా పెట్రోల్‌ వినియోగదారులపైనా భారం మరింత పెరిగింది. ఈ ఏడాది జూలై 1న లీటరు పెట్రోల్‌ రూ. 81.43లుండగా, ప్రస్తుతం రూ. 85.47లకు ఎగబాకింది.

ఇలాగైతే లారీలు నడపలేం
ఇదే పరిస్థితి కొనసాగితే రవాణారంగం స్తంభించాల్సిందే. కిరాయి రేట్లు పెంచడంలేదు. కానీ డీజిల్‌ ధరలు మాత్రం అమాంతం పెంచేస్తున్నారు. దీనివల్ల రూ. లక్షలు పోసి కొనుగోలుచేసిన లారీలను నడిపేందుకు కూడా అత్యధికంగానే ఖర్చుచేయాల్సి వస్తోంది. నెలంతా లారీ తిప్పినా డీజిల్‌ ధరల పెరుగుదల వల్ల రూపాయి కూడా మిగిలట్లేదు. ఈ విషయాన్ని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు గ్రహించాలి. డీజిల్‌ ధరల పెంపుతో వచ్చే ఆదాయంపైనే ప్రభుత్వాలు దృష్టిపెడుతున్నాయే తప్ప, దానివల్ల పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా లారీ పరిశ్రమను కాపాడి, ప్రజలపై పరోక్షంగా నెలకొంటున్న భారాన్ని తొలగించాలి.– ఇండుపూరి నారాయణరావు, సాలూరు లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top