లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా సన్నివేశాలను ఎన్నికల అధికారికి వివరించాం

Laxmis NTR Movie scenes are explained to the election officer - Sakshi

చిత్ర నిర్మాత రాకేష్‌రెడ్డి వెల్లడి

సాక్షి, అమరావతి: లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాలోని సన్నివేశాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి వివరించినట్లు చిత్ర నిర్మాత రాకేష్‌ రెడ్డి తెలిపారు. ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా సినిమా ఉందంటూ ఫిర్యాదులు అందటంతో ఎన్నికల కమిషన్‌ ముందు హాజరై వివరణ ఇవ్వాలని రాకేష్‌ రెడ్డికి నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల అధికారికి వివరణ ఇచ్చేందుకుగాను రాకేష్‌రెడ్డి సోమవారం సచివాలయం వచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక పార్టీ పరంగా...ఒక వ్యక్తి గురించి పర్సనల్‌గా టార్గెట్‌ చేశారా అని ఎన్నికల సంఘం తనని అడిగిందని చెప్పారు. సినిమాలో పసుపు జెండాలు వాడాము తప్ప.. ఎక్కడా పార్టీ గుర్తులు వాడలేదని తాను బదులిచ్చినట్లు వివరించారు.

తన వివరణపై ఎన్నికల అధికారి ద్వివేది సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాలో సంఘటనలు అడిగి తెలుసుకున్న అనంతరం విడుదలకు ఈసీ పచ్చజెండా ఊపినట్లు తెలిపారు. రిలీజ్‌ తర్వాత కూడా ఏవైనా అభ్యంతరాలు ఉంటే వివరణ ఇస్తామని కూడా చెప్పామన్నారు. 29న సినిమా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. వైఎస్‌ జగన్‌కు, మాకు బంధుత్వం లేదని ఆయన మా పార్టీ అధినేత మాత్రమే అని స్పష్టం చేశారు. లక్ష్మీపార్వతి రాసిన పుస్తకం ఆధారంగా సినిమా నిర్మించామని తెలిపారు. కాగా, సినిమా విడుదలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, న్యాయ సలహా తీసుకుని తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఎన్నికల అధికారి ద్వివేది తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top