భూమంతర్‌ ఖాళీ!

Lands for real estate business in the name of Software companies - Sakshi

     అస్మదీయులకు అడ్డగోలుగా భూములు ధారాదత్తం చేసిన ప్రభుత్వం

     సాఫ్ట్‌వేర్‌ కంపెనీల ముసుగులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి భూములు

     ధరల నిర్ణయంలో ఇష్టారాజ్యం

     ప్రైవేటు సంస్థలకు కారుచౌక, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు వాస్తవ ధర

     రూ.వేల కోట్ల విలువ చేసే సర్కారు భూములు మాయం చేసిన టీడీపీ నేతలు

సాక్షి, అమరావతి: పెద్ద చేపలు చిన్న చేపల్ని తింటుంటే తిమింగలాలు పెద్ద చేపలను మింగేస్తున్న చందంగా చంద్రబాబు సర్కారులో భూదందా విచ్చలవిడిగా కొనసాగుతోంది. చట్టాలను ఏమార్చి, నిబంధనలకు పాతరేసి తెలుగుదేశం పార్టీ ‘కీలక’ నేతలు భూములను చెరపట్టి కోట్ల రూపాయలు దండుకున్నారు. గ్రామాలు, మండల కేంద్రాల్లో అధికార పార్టీ చోటామోటా నేతలు ప్రభుత్వ భూములను కైవసం చేసుకుంటే.. పట్టణాలు, నగరాల్లో విలువైన ప్రభుత్వ భూములనే కాకుండా కొన్ని ప్రైవేటు ఆస్తులను కూడా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాహా చేశారు. గత నాలుగేళ్లలో వేల కోట్ల రూపాయల విలువైన సర్కారు భూములు మాయమయ్యాయి. దీంతోపేదలకు నివాస స్థలాలు ఇవ్వడానికి, వారి ఇళ్ల నిర్మాణానికి చాలా చోట్ల స్థలాలే లేని దుస్థితి ఏర్పడింది. 

తూర్పూరబట్టిన మాజీ సీఎస్‌లు
పేదలు, సన్న చిన్నకారు రైతుల నుంచి లాక్కున్న భూమిని అస్మదీయ పారిశ్రామికవేత్తలకు కారుచౌకగా కట్టబెట్టారు. సాఫ్ట్‌వేర్‌ సంస్థల ఏర్పాటు ముసుగులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి తెరతీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)ని భూదళారీగా మార్చేశారని తీవ్ర విమర్శలున్నాయి. ప్రభుత్వ భూములను ఏపీఐఐసీకి ఉచితంగా కేటాయించాలంటూ జారీ చేసిన ఉత్తర్వులు, కేంద్ర భూసేకరణ చట్టం–2013లోని రైతుల హక్కులను చట్టబండలుగా మార్చుతూ తెచ్చిన ఆంధ్రప్రదేశ్‌ భూసేకరణ చట్టం– 2018 ఈ విమర్శలకు బలం చేకూర్చుతుండటం గమనార్హం. చంద్రబాబు అండ్‌ కో బినామీ పేర్లతో భారీ వాటాలు పొందుతున్నారని ఆయన ప్రభుత్వంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఐవైఆర్‌ కృష్ణారావు, అజేయ కల్లం బహిరంగంగా విమర్శించడం గమనార్హం. 

ధర నిర్ణయంలో ఇష్టారాజ్యం
రాజధాని కోసమంటూ అమరావతి ప్రాంతంలో రైతుల నుంచి సేకరించిన భూమిని కొన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన ధరలో పదో వంతు కంటే తక్కువ మొత్తానికే కొన్ని ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.. జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)కి ఎకరా రూ.4 కోట్లకు ఇచ్చి గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీకి మాత్రం ఎకరా రూ.12 లక్షలతోనే 12 ఎకరాలను కేటాయించింది. విద్యార్థుల నుంచి లక్షల రూపాయల్లో వార్షిక ఫీజులు గుంజుతున్న ఎస్‌ఆర్‌ఎం, విట్, అమృత తదితర కార్పొరేట్‌ విద్యాసంస్థలకు కూడా నామమాత్రపు ధరకే భూములు ఇవ్వడం గమనార్హం. ఇలా రాజధాని ప్రాంతంలో ఇప్పటికే 46 ప్రైవేటు సంస్థలకు 1260 ఎకరాలుపైగా ప్రభుత్వం కట్టబెట్టింది. 

అంతూ పొంతూ ఏదీ?
- విశాఖ నగరంలో రూ.400 కోట్ల విలువైన భూమిని ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ సంస్థకు రూ.13 కోట్లకే ధారాదత్తం చేశారు. సినీనటుడు నందమూరి బాలకృష్ణకు బంధువైన రామారావు కుటుంబానికి చెందిన విశాఖపట్నం బాట్లింగ్‌ కంపెనీ (వీబీసీ) ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌కు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో రూ.250 కోట్ల విలువైన 498.98 ఎకరాలను రూ.4.98 కోట్లకే కట్టబెట్టారు. ఇది చాలదన్నట్లు విశాఖ జిల్లాలో యారాడ సమీపంలో అత్యంత విలువైన 34 ఎకరాల భూమిని బాలకృష్ణ చిన్నల్లుడికి చెందిన ‘గీతం యూనివర్సిటీ’కి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. 
తిరుపతి (కరకంబాడి)లో మంగళ్‌ ఇండస్ట్రీస్‌కు భూమి కేటాయించాలంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ‘గల్లా’ కుటుంబం పెట్టుకున్న అర్జీ గల్లా అరుణకుమారి మంత్రిగా ఉండగానే రెండుసార్లు తిరస్కరణకు గురైంది. ఆమె కుటుంబానికి చెందిన ‘అమరరాజా బ్యాటరీస్‌’కు సమీపంలోనే భారీగా భూములున్నందున ఇవ్వాల్సిన అవసరం లేదని కాంగ్రెస్‌ సర్కారు భావించింది. అయితే చంద్రబాబు సర్కారు రాగానే ఆగమేఘాలపై ఈ ఫైలును తెప్పించుకుని మంగళ్‌ ఇండస్ట్రీస్‌కు భూమిని కేటాయించేశారు. 
భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో ప్రభుత్వం 2600 ఎకరాలు సేకరించింది. విమానాశ్రయ నిర్మాణ టెండరు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియాకు రావడంతో వాటాలు రావనే ఉద్దేశంతో ప్రైవేటుకు కట్టబెట్టేందుకు టెండరునే రద్దు చేసింది. 
అనంతపురం – అమరావతి ఎక్స్‌ప్రెస్‌ హైవే పేరుతో 26,890 ఎకరాలను కొత్త భూసేకరణ చట్టం ద్వారా లాక్కోవాలని చూస్తున్నారు. రోడ్డుకు అవసరమైన దానికంటే చాలా ఎక్కువ భూమిని సేకరించి రోడ్డు వెంబడి విలువైన భూమిలో వాటా పొందాలన్నదే దురాలోచన.
విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో వేలాది ఎకరాలను ఫుడ్‌ పార్కులు, పారిశ్రామిక పార్కులకు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వేలాది ఎకరాలను విండ్‌పవర్‌ సంస్థలకు అడ్డగోలుగా ఇచ్చేశారు. ఎక్కడా పరిశ్రమలు వచ్చిన జాడ లేకపోయినా ఇంకా పది లక్షల ఎకరాల ల్యాండ్‌ బ్యాంకును సేకరించాలని ప్రభుత్వం తహతహలాడుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top