దేవుడు కరుణించినా.. పూజారి వరమివ్వని చందంగా మారింది రైతుల పరిస్థితి. జిల్లాలో రెండు రోజుల క్రితం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
సాక్షి ప్రతినిధి, కర్నూలు: దేవుడు కరుణించినా.. పూజారి వరమివ్వని చందంగా మారింది రైతుల పరిస్థితి. జిల్లాలో రెండు రోజుల క్రితం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇప్పటికే వేసిన పైర్లు దెబ్బతినగా కొత్తగా విత్తనం వేయాలనుకునే వారికి రుణ సమస్య అడ్డువస్తోంది. రుణమాఫీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఏ విషయం తేల్చలేదు. కమిటీలంటూ కాలయాపన చేస్తూ వస్తున్నారు. దీంతో రైతులకు ఖరీఫ్ రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదు.
గత శనివారం కర్నూలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సైతం రుణమాఫీపై స్పష్టత ఇవ్వలేకపోయారు. రైతులకు ఆమోదయోగ్యంగా కొంత వరకు మాఫీ ఉంటుందని ప్రభుత్వ పెద్దల ఆలోచనను బయటపెట్టారు. వర్షాలు రానందున ఖరీఫ్ రుణాలు ఇవ్వలేదని, వానలు పడితే ఇప్పించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో పలు మండలాల్లో 6,7 తేదీల్లో వర్షాలు కురిశాయి.. అయితే ప్రభుత్వం నుంచి రుణాల పంపిణీపై ఎటువంటి ప్రకటన రాలేదు.
హామీ ఇచ్చిన మంత్రి కూడా దీనిపై నోరు మెదపడంలేదు. జూలై మొదటి వారానికే జిల్లాలో పొలాలన్నీ పచ్చని పైర్లతో కళకళలాడాల్సి ఉంది. ఈ సారి వర్షాభావ పరిస్థితులతో చేలన్నీ బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం వానలు పడటంతో వ్యవసాయ పనుల్లో రైతులు బిజీ అయ్యారు. ఈ పరిస్థితుల్లో రైతులకు అండగా ఉండి బ్యాంకుల చేత విరివిగా రుణాలు ఇప్పించాల్సిన ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది. రుణాలు మాఫీ కాక, అప్పులు దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుని సాగుకు సమాయత్తం అవుతున్నారు.
అస్తులు జప్తు చేస్తాం..
జిల్లాలో 6,32,902 మంది రైతులు ఉన్నారు. ఇందులో గతేడాది 4 లక్షల మంది రైతులు బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందారు. మరో 1.20 లక్షల మంది రైతులు బ్యాంకుల్లో బంగారం పెట్టి వ్యవసాయ రుణాలు తీసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ అమలు అవుతుందనే ఉద్దేశంతో రైతులెవ్వరు రుణాలను చెల్లించలేదు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై నెలరోజులవుతున్నా రుణాలపై స్పష్టత లేదు.
రుణాలకు సంబంధించి నోటీసులు ఇవ్వొద్దని ప్రభుత్వం చెపుతున్నా.. బ్యాంకర్లు మాత్రం తమపని తాము చేసుకొని వెళ్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలంలో 450 మంది రైతులకు బ్యాంకర్లు నోటీసులు జారీ చేశారు. వెంటనే తీసుకున్న బకాయిలను చెల్లించాలని ఒత్తిళ్లు తెస్తున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరు, కోడుమూరు తదితర ప్రాంతాల్లో రైతులకు ఫోన్లు చేసి రుణాలు చెల్లించాలని బ్యాంకర్లు ఒత్తిడి తెస్తున్నారు. ‘రుణమాఫీ కాదు. రీషెడ్యులు చేస్తే అప్పు భారం పెరుగుతుంది. వెంటనే తీసుకున్న అప్పు చెల్లించండి. లేకపోతే అపరాధ రుసుం, చక్రవడ్డీ వేస్తాం. అవసరమైతే ఆస్తులు జప్తు చేస్తాం’ అంటూ భయపెడుతున్నట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు.