కృష్ణానదిలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు

In the Krishna River, There is a Shaky Sand Mining - Sakshi

ప్రమాదపుటంచుల్లో  నదిలోని విద్యుత్‌ టవర్లు

పట్టించుకోని అధికారులు

సాక్షి,తాడేపల్లిరూరల్‌: ‘మళ్లీ ఎప్పుడు అవకాశం వస్తుందో.. అందినకాడికి దోచుకుందాం.. అది ప్రమాదమైతే మనకేంటి.. ప్రభుత్వాలకు, ప్రజలకు నష్టం జరిగితే మాకేంటి.. మనం సుఖంగా ఉన్నామా లేదా..’ అనే భావనతో టీడీపీలోని ప్రజాప్రతినిధులుగా గెలిచిన వారు, వారి అనుచరులు వ్యవహరిస్తున్నారు.

కృష్ణానది ఎగువ ప్రాంతంలో ఉచిత ఇసుక పేరుతో రోజూ కోట్ల రూపాయల ప్రజా సంపదను దోచుకుంటున్నారు. అంతటితో ఆగక నిషిద్ధ ప్రదేశాల్లో తవ్వకాలు నిర్వహిస్తున్నారు. అధికారులు ప్రశ్నించకపోవడంతో తవ్వకూడని ప్రదేశాల్లో కూడా తవ్వుతున్నారు. కృష్ణానది ఎగువ ప్రాంతంలో ఇబ్రహీంపట్నం వీటీపీఎస్‌ నుంచి గుంటూరు జిల్లా వైపునకు 133కె.వి. విద్యుత్‌ లైన్ల టవర్లను కృష్ణానదిలో నిర్మించారు.

ఆ టవర్లు నిర్మించిన ప్రాంతంలో ఇసుక ఎక్కువ మేట వేయడంతో అక్కడ కూడా డ్రెడ్జర్లను ఉపయోగించి భారీ స్థాయిలో ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఒక్కసారి కృష్ణానదిలో పడవకు అమర్చిన డ్రెడ్జర్‌ నుంచి ఇసుక తవ్వకాలు నిర్వహిస్తే 50 టన్నుల వరకు ఇసుక తీయవచ్చు.

అదేపనిగా కొంతమంది పడవ యజమానులు ఇసుక క్వారీ నిర్వాహకులు నాణ్యమైన ఇసుక కోసం గప్‌చుప్‌గా టవర్లకు అతి సమీపంలో ఈ తవ్వకాలు నిర్వహిస్తున్నారు. డ్రెడ్జర్‌తో ఇసుక తోడేటప్పుడు ఒకేచోట 20 నుంచి 30 అడుగుల గొయ్యి ఏర్పడుతుంది. ఇలా టవర్ల వెంబడి ఇసుక తవ్వకాలు నిర్వహించడం వల్ల వరదలు వచ్చిన సమయంలో ఇసుక తీసిన చోట ఆ గోతుల్లో పెద్ద పెద్ద సుడిగుండాలు ఏర్పడతాయి.

అలా ఏర్పడిన సమయంలో ఒక్కోసారి ఆ గొయ్యి మరింత లోతుకు వెళ్లి, విద్యుత్‌ టవర్ల కింద ఏర్పాటు చేసిన కాంక్రీట్‌ దిమ్మలను కోతలకు గురిచేయడమే కాకుండా, వాటి పునాదులు కూడా కదులుతాయి. ప్రస్తుతం కొన్ని సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన ఈ పునాదులు నీటి అడుగు భాగం నుంచి 15 నుంచి 30 అడుగుల లోపు ఏర్పాటు చేశారు.

అప్పుడు కృష్ణానది ఇసుక మట్టాన్ని బట్టి వాటిని ఏర్పాటు చేసినట్లు 133కె.వి. సెక్షన్‌లో పనిచేసే ఓ సీనియర్‌ ఇంజనీర్‌ తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి ఇసుక తవ్వకాలను నిలిపివేయకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. టవరు కనుక కుంగితే వాటికి ఏర్పాటు చేసిన విద్యుత్‌ వైర్లు సైతం తెగిపోయే అవకాశం ఉంది. అలాంటి సమయంలో ఆ వైర్లు నీటిపై పడితే చాలా ప్రమాదమని, అలాంటి చోట మైనింగ్‌శాఖ అధికారులు తవ్వకాలు నిలిపివేయడం మంచిదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top