కృష్ణా మహోగ్రం: కృష్ణా, గుంటూరు జిల్లాల్లో హైఅలర్ట్‌

Krishna Flood Flow at Prakasam Barrage - Sakshi

ప్రకాశం బ్యారేజీ వద్ద పోటెత్తిన కృష్ణవేణి

శుక్రవారం సాయంత్రం 7.76 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

70 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

వరదను అంచనా వేసి ప్రజలను రక్షించేందుకు డ్రోన్‌లను వినియోగిస్తున్న జలవనరుల శాఖ

వరద నీటిలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం

అక్రమ కట్టడాలను ముంచెత్తిన కృష్ణమ్మ

అమరావతి – విజయవాడ మధ్య నిలిచిపోయిన రాకపోకలు

జలదిగ్బంధంలో చిక్కుకున్న పలు రాజధాని గ్రామాలు

నీట మునిగిన పంటలు..

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో హైఅలర్ట్‌ ప్రకటించిన అధికారులు

సాక్షి, అమరావతి/సాక్షి, నెట్‌వర్క్‌: దుర్గమ్మ చెంతన కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీలోకి వస్తున్న వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు బ్యారేజీలోకి 7.76 లక్షల క్యూసెక్కుల (67.05 టీఎంసీల) ప్రవాహం రావడంతో అంతే స్థాయిలో వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. రాత్రికి బ్యారేజీలోకి 8 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. ఎగువ నుంచి వస్తున్న వరదను ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రజలు ముంపు బారిన పడకుండా రక్షించేందుకు కృష్ణా నదిపై జలవనరుల శాఖ డ్రోన్‌లను మోహరించింది. వరదను ఎప్పటికప్పుడు విశ్లేషించడానికి డ్రోన్‌లను వినియోగిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి ప్రవాహం 3.99 లక్షల క్యూసెక్కులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. శుక్రవారం సాయంత్రం ప్రవాహం 5.66 లక్షల క్యూసెక్కులను దాటడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఎగుర వేశారు. 

వరదలో చంద్రబాబు నివాసం 
కృష్ణా నదీ గర్భంలో మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడాన్ని వరద చుట్టుముట్టింది. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు హై సెక్యూరిటీ జోన్‌లోని తన ఇంటిపై డ్రోన్‌లతో నిఘా వేశారంటూ చంద్రబాబు ట్వీట్‌లపై ట్వీట్‌లు చేశారు. రాజకీయ లబ్ధి కోసం టీడీపీ నేతలు రాద్ధాంతం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్‌పై ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. సెక్రటేరియట్, హైకోర్టుకు వెళ్లేవారు కనకదుర్గ వారధి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. పవిత్ర సంగమం వద్ద హారతి కార్యక్రమాన్ని వరద కారణంగా తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.  

అక్రమ కట్టడాలను చుట్టుముట్టిన ప్రవాహం
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద అంతకంతకు పెరుగుతుండడంతో ఎగువన కృష్ణా కరకట్ట ప్రాంతంలో గురువారం ఉదయమే అక్రమ కట్టడాల్లోకి వరద నీరు ప్రవహించింది. దీన్ని అడ్డుకునేందుకు అక్రమ నిర్మాణదారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వరద గ్రౌండ్‌ ఫ్లోర్లను ముంచెత్తడంతో పాటు భవనాల చుట్టూ నీరు చేరడంతో గోడలు బీటలు వారుతున్నాయి. దిగువ ప్రాంతంలో 10.537 మీటర్ల (దాదాపు 33 అడుగులు) ఎత్తులో నీరు ప్రవహించడంతో కృష్ణా గర్భంలో నిర్మించుకున్న ఇళ్లలోకి నీరు చేరింది. కొన్నిచోట్ల ఇళ్లు పూర్తిగా మునిగాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి మహానాడు వెళ్లే రోడ్డులో నీళ్లు ప్రవహిస్తాయని అంచనా వేస్తున్నారు. అధికారులు నిరంతరం వరద ఉధృతిని పర్యవేక్షిస్తున్నారు. 

జలదిగ్బంధంలో రాజధాని గ్రామాలు..
కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చడంతో లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అమరావతి మండలం పెదమద్దూరు గ్రామంలోకి నీరు చేరింది. విజయవాడ– అమరావతి మధ్య రాకపోకలు స్తంభించాయి. అమరావతి–క్రోసూరు మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలంలోని పలు లంక గ్రామాలు నీట మునిగాయి. కొల్లూరు మండలం పెసర్లంక–అరవింద వారధి సమీపంలో గండి పడటంతో రోడ్డు కోతకు గురైంది. అరవిందవారిపాలెంలో గండి పడటంలో పలు గ్రామాల్లోకి నీరు చొచ్చుకొచ్చింది. చిలుమూరు లంక , సుగ్గులంక,ఈపూరి లంక, చింతర్లక, పెసరలంక, పెద లంక, ఆవులవారిపాలెం, గాజుల్లంక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పొతార్లంక, తిప్పలకట్ట, తోకల వారిపాలెం,కిష్కింద పాలెం, జువ్వలపాలెంలో పంట పొలాల్లోకి నీరు చేరాయి. 

6,180 ఎకరాల్లో  పంట నష్టం
గుంటూరు జిల్లాలో 6,180 ఎకరాల్లో  పంటలు నీట మునిగాయి. 8,200 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. పసుపు, కంద, అరటి, కూరగాయలు, బొప్పాయి, నిమ్మ రైతులు తీవ్రంగా నష్టపోయారు. దాచేపల్లి, అచ్చంపేట, అమరావతి మండలాలో పత్తి, మిరప నీట మునిగాయి. దుగ్గిరాల మండలం  వీర్లపాలెం, పెదకొండూరు, గొడవర్రు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి.

కృష్ణాలో 12 గ్రామాలు మునక
కృష్ణా జిల్లాలో వరదల కారణంగా 12 గ్రామాలు ముంపునకు గురయ్యాయని, ప్రాణ నష్టం జరగకుండా యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టామని కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ మీడియాకు తెలిపారు. వరదలపై సమాచారం, సహాయం కోసం టోల్‌ఫ్రీ నెంబర్‌ 1077, కంట్రోల్‌ రూం ఫోన్‌ నెం. 08672–252847 (మచిలీపట్నం), 0866–2574454 (విజయవాడ), పైర్‌ కంట్రోల్‌ రూం 9100108101 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటిదాకా 2,939 హెక్టార్లలో వరి, 1,398 హెక్టార్లలో ఉద్యానవన పంటలు, 20 హెక్టార్లలో సెరీకల్చర్‌ పంటలకు నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. సందర్శకులు ప్రకాశం బ్యారేజీ వద్ద అప్రమత్తంగా ఉండాలని విజయవాడ నగర పోలీసు కమీషనర్‌ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు సూచించారు. వరదల కారణంగా ఎక్కడైనా సమస్యలు తలెత్తితే 100 లేదా 0866 – 2579999 నంబర్లలో సంప్రదించాలని, 7323909090 నంబర్‌కు వాటప్స్‌  చేయాలని సూచించారు. 

ఎగువన ప్రవాహం తగ్గుముఖం
పశ్చిమ కనుమల్లో వర్షాలు తెరిపి ఇవ్వడంతో ఆల్మట్టి, నారాయణపూర్‌లలోకి వస్తున్న వరద ప్రవాహం శుక్రవారం సాయంత్రానికి కాస్త తగ్గింది. ఆల్మట్టిలోకి 4.5 లక్షల క్యూసెక్కులు వస్తుండగా అంతేస్థాయిలో దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్‌లోకి 4.8 లక్షల క్యూసెక్కులు వస్తుండగా అంతే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా, తుంగభద్ర నుంచి శ్రీశైలంలోకి 8.05 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 8.18 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. 

సాగర్‌ గేట్లన్నీ ఎత్తివేత 
నాగార్జున సాగర్‌లోకి 6.32 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రాగా  7.12 లక్షల క్యూసెక్కులను 26 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. గత ఐదు రోజులుగా నాగార్జునసాగర్‌ 26 గేట్లను ఎత్తి ఉంచడం గమనార్హం. పులిచింతల ప్రాజెక్టులోకి 6.77 లక్షల క్యూసెక్కులు రాగా దిగువకు 7.52 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలో నీటి నిల్వ గరిష్ట స్థాయి కంటే 1.01 టీఎంసీలు అధికంగా అంటే 4.08 టీఎంసీలకు చేరుకుంది. దీంతో 70 గేట్లను పూర్తిగా ఎత్తివేసి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి ఆదివారం నాటికి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top