రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలని అధికార కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై సీమాంధ్ర ప్రాంతం గత నలబై రోజులుగా రగిలిపోతూ ఉంటే..
-
సన్నిహితులతో సీఎం మంతనాలు
-
ఏం ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తాం: మంత్రులు
-
రాష్ట్రాన్ని విభజిస్తోంది కాంగ్రెస్సే అన్న భావన ప్రజల్లో ఉంది
-
విభజనకు కాంగ్రెస్ కారణం కాదని చెబితే నమ్మే స్థితిలో లేరు
-
సీఎంగా ఉంటూ యాత్ర చేస్తే ఆగ్రహం చవిచూడాల్సి వస్తుంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలని అధికార కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై సీమాంధ్ర ప్రాంతం గత నలబై రోజులుగా రగిలిపోతూ ఉంటే.. ఇంతకాలం ఇంటికీ, ఆఫీసుకు, ఢిల్లీ పర్యటనలకే పరిమితమైన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి.. ఇలా ఎంత కాలం ఉంటామనే భావనతో ఇప్పుడు సీమాంధ్రలో పర్యటించే విషయమై తర్జనభర్జన పడుతున్నట్లు తెలిసింది. ఇదే విషయాన్ని ఆయన తన సన్నిహితుల వద్ద పేర్కొనగా.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రాన్ని విభజిస్తోందనే భావన ప్రజల్లో పాతుకుపోయిందని.. ఈ పరిస్థితుల్లో ఏ ముఖం పెట్టుకుని ప్రజల ముందుకు వెళ్తామని పలువురు నాయకులు వ్యాఖ్యానించినట్లు సమాచారం.
రాష్ట్ర విభజనకు అంగీకారం తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు యాత్రను ప్రజలు పట్టించుకోవటం లేదని.. ఇప్పుడు సీఎం కిరణ్ పదవిలో ఉండి యాత్రలకు వెళితే ప్రజలు ఆదరించే అవకాశం లేదని వారు చెప్తున్నట్లు తెలిసింది. ‘విభజనకు కాంగ్రెస్సే కారణమంటూ సీమాంధ్ర ప్రజలు లక్షలాదిగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్న తరుణంలో.. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా యాత్ర నిర్వహించటం చాలా కష్టం. ప్రజల్లోకి వెళితే చేదు అనుభవాలను ఎదుర్కోక తప్పదు. ప్రజల నుంచి ఆగ్రహం చవిచూడాల్సి వస్తుంది’ అని కిరణ్ సన్నిహితులు హెచ్చరించినట్లు సమాచారం. సమైక్య నినాదంతో శంఖారావం పూరించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సభలకు భారీ ఎత్తున జనం హాజరవుతున్న సంగతిని వారు ఉదహరిస్తున్నారు. అయితే.. ఇవన్నీ పట్టించుకోని ముఖ్యమంత్రి యాత్రకే సిద్ధమవుతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్పాయి. విభజనకు అనుకూలంగా పలుమార్లు లేఖలు ఇచ్చిన చంద్రబాబు సీమాంధ్రలో పర్యటించగా లేనిది తాను వెళితే తప్పేమిటని సీఎం ప్రశ్నిస్తున్నట్లు చెప్తున్నాయి. ఒకవేళ యాత్రంటూ చేస్తే ఎక్కడి నుంచి యాత్రను ప్రారంభిస్తే బాగుంటుందని కూడా ఆయన మంత్రుల అభిప్రాయాన్ని కోరుతున్నట్లు తెలిసింది. మంత్రులు మాత్రం యాత్రపై పెద్దగా ఆసక్తి చూపటం లేదని సమాచారం. శనివారం సీఎంను కలిసి వచ్చిన మంత్రి ఒకరు మాట్లాడుతూ ‘మేం ఎంత చెప్పినా సీఎం వినే పరిస్థితుల్లో లేరు.
సీమాంధ్రలో పర్యటించాలనే భావిస్తున్నారు. అయితే తేదీ ఇంకా ఖరారు కాలేదు. బహుశా అక్టోబర్‌లో యాత్ర చేసేలా ప్రణాళిక రూపొందించుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. ‘అధికారంలో ఉంటూ విభజనకు కాంగ్రెస్ కారణం కాదని చెబితే జనం నమ్మటానికి సిద్ధంగా లేరు. విభజన నిర్ణయం వెనక్కు తీసుకోకుండా యాత్రలు నిర్వహిస్తే సీమాంధ్ర ప్రజల చేతిలో తీవ్ర అవమానాలు ఎదురైనా ఆశ్చర్యపోనక్కర్లేదు’ అని గోదావరి జిల్లాలకు చెందిన మంత్రి ఒకరు అభిప్రాయపడ్డారు. మరో మంత్రి మాట్లాడుతూ ‘ప్రజలంతా పదవులకు రాజీనామా చేయాలంటూ ఒత్తిడి తెస్తుంటే సీఎం గారు పదవిలో ఉంటూ యాత్రలు చేస్తానంటే ఎవరు నమ్ముతారు? ఆయన వాలకం చూస్తుంటే చివరి క్షణం వరకు సీఎం పదవిలో కొనసాగాలనే తాపత్రయమే కన్పిస్తోంది. సీమాంధ్ర లో పరిస్థితి ఎలా ఉందంటే.. పదవులే కాదు, కాంగ్రెస్ నుంచి బయటకు వస్తే కానీ ప్రజలు మమ్మల్ని ఆదరించే పరిస్థితి లేదు. ఏం చేయాలో అర్ధం కావటం లేదు’ అంటూ వాపోయారు.