ఉద్యమంలో కేసీఆరే హీరో: దిలీప్‌కుమార్

ఉద్యమంలో కేసీఆరే హీరో: దిలీప్‌కుమార్ - Sakshi


సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో 13 ఏళ్లపాటు శ్రమించి అన్నిదశల్లో క్రియాశీలకంగా ఉన్న టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావే హీరో అని తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ (టఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ అన్నారు. విధానాలపరంగా కేసీఆర్‌తో విభేదిస్తాను తప్ప... వ్యక్తిగతంగా ద్వేషం లేదన్నారు. ఇందిరాపార్కు సమీపంలోని ఎస్సెమ్మెస్ మీడియా సెంటర్‌లో ఆదివారం జరిగిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో దిలీప్‌కుమార్ మాట్లాడారు. ఎస్‌ఎంఎస్ మీడియా సెంటర్ అధినేత యనమల రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో దిలీప్‌కుమార్ మాట్లాడారు.

 

 తెలంగాణ ఉద్యమంలో సీమాంధ్ర నాయకుల ఆస్తుల మూలాలను దెబ్బకొట్టాలనే అభిప్రాయానికి కేసీఆర్ వ్యతిరేకమన్నారు. తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో సీమాంధ్ర నాయకుల ఆస్తులపై దాడి చేసిన పిదపనే కేంద్రంలో తెలంగాణ నిర్ణయంలో కదలిక వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎల్‌డీ పార్టీ కొనసాగుతుందని ప్రకటించారు. తెలంగాణ పునర్:నిర్మాణ లక్ష్య సాధనకు లక్ష మంది మిలిటెంట్ కార్యకర్తలను తయారు చేస్తున్నామన్నారు. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో తెలంగాణపై కేంద్రం నిర్ణయం మారితే మిలిటెంట్ పోరాటాలు కూడా నిర్వహిస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసి ఆ పార్టీని విచ్ఛిన్నం చేయాలనే కుట్ర పూరిత ఆలోచనలు తనకు లేవన్నారు. ఢిల్లీలో తనకు మంచి సంబంధాలు ఉన్న కారణంగా టీఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు నాయకులు దిగ్విజయ్‌సింగ్‌తో కలిపించాలని కోరడంతోనే వారిని కలిపించానన్నారు. అలాగే, మరో 8 మంది టీఆర్‌ఎస్ నేతలు కూడా కాంగ్రెస్‌లో కలిసేందుకు తనతో టచ్‌లో ఉన్నట్లు తెలిపారు. అయితే, వారి పేర్లు మాత్రం తాను వెల్లడించలేనన్నారు.

 

 ఇక తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ గల్లీలోనే హీరో... కానీ ఢిల్లీలో కాదన్నారు. టీఆర్‌ఎస్ వలసల పార్టీ అని వ్యాఖ్యలు చేశారు.  అందులో వివిధపార్టీల నుంచి వలస వచ్చిన వారే అధికంగా ఉన్నారన్నారు. ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలస వచ్చే నాయకులను ప్రోత్సహిస్తే మరి టీఆర్‌ఎస్ పుట్టినప్పటి నుంచి ఉన్న వారి సంగతేంటని ప్రశ్నించారు. పార్టీలో ముందు నుంచీ ఉండి కష్టపడ్డవారికి టిక్కెట్లు ఇవ్వాలన్నారు. అలాంటి భరోసా లేకపోవడంతో కొంతమంది అభద్రతా భావానికి గురవుతున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు ఉండడం సరైందేననీ, ఈ విషయాన్ని కేసీఆర్ కూడా ఒప్పుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

 

 ఉద్యోగులకు కచ్చితంగా ఆప్షన్లు ఉంటాయన్నారు. వాస్తవానికి ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతానికి వెళ్తారు. అవసరమైతే సూపర్‌న్యూమరీ పోస్టులను అక్కడి ప్రభుత్వం తయారు చేస్తోందన్నారు. ఒకవేళ వారు ఇక్కడే ఉండాలనుకుంటే ఉండొచ్చన్నారు. సీమాంధ్రలో చేస్తున్న ఉద్యమం కేవలం పెట్టుబడిదారుల ఉద్యమమేనని విమర్శించారు. డబ్బు, మీడియాను అడ్డం పెట్టుకొని సీమాంధ్ర ఉద్యమం నడుస్తోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం జరిగిపోయిందని, ప్రక్రియ జరుగుతుందని దిగ్విజయ్‌సింగ్ చెప్పారన్నారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యే వరకూ తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు సంయమనం పాటించాలని దిలీప్‌కుమార్ కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top