‘మీ గొట్టాలు నాకేం చేయవ్..సమాజాన్ని మీడియా పక్కదారి పట్టిస్తోంది’’ అని కేంద్ర మంత్రి కావూరి సాంబశిరావు మీడియాపై చిందులు తొక్కారు.
మీడియాపై కావూరి కస్సుబుస్సు
ముదినేపల్లి, న్యూస్‌లైన్: ‘‘మీ గొట్టాలు నాకేం చేయవ్..సమాజాన్ని మీడియా పక్కదారి పట్టిస్తోంది’’ అని కేంద్ర మంత్రి కావూరి సాంబశిరావు మీడియాపై చిందులు తొక్కారు. శనివారం కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెనుమల్లిలో పీసీసీ సంయుక్త కార్యదర్శి బొర్రా చలమయ్య గెస్ట్‌హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పలు ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ఆయన మీడియా ప్రతినిధులపై ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. మంత్రి పదవి రాకముందు సమైక్యాంధ్ర సింహం లా గర్జించిన మీరు ఇప్పుడెందుకు మిన్నకుండి పోయారంటూ అడిగిన ప్రశ్నకు కావూరి ఆగ్రహోదగ్రులయ్యారు.
ప్రజలకెలాంటి బాధలేనప్పటికీ కొంతమంది నేతల దుష్ర్పచారంతో పాటు ఇందుకు మీడియా వంత పాడుతూ ప్రజల మధ్య చీలికలు తెస్తున్నట్లు ఆరోపించారు. కాంగ్రెస్ వ్యతిరేక వార్తలకు ప్రాధన్యం ఇస్తూ గందరగోళానికి గురి చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర జౌళిశాఖ మంత్రిగా తెలంగాణలోని సిరిసిల్లకు టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు చేసిన కృషి సీమాంధ్ర లో ఎందుకు కృషి చేయలేదని ప్రశ్నించగా మిన్నకుండిపోయారు.