దారి దోపిడీకి రహస్య ఒప్పందం

Karnataka Travel Busses Running in Andhra Pradesh Border - Sakshi

ఏపీ సరిహద్దులో యథేచ్ఛగా కర్ణాటక ప్రైవేట్‌ బస్సులు

పన్నులు చెల్లించకుండా రెండేళ్లుగా రాకపోకలు

ప్రభుత్వ ఆదాయానికి దాదాపు రూ.8 కోట్ల మేర గండి

మూడు నెలలకు ఒక్కసారి రూ.15 లక్షలు ‘రహస్య ఒప్పందం’

ఆర్టీఏలో కీలక అధికారి అండదండలతో తతంగం  

కర్ణాటక ప్రైవేట్‌ బస్సులు ఆంధ్రా సరిహద్దు ప్రాంతమైన డీ.హీరేహాళ్‌ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. గుంతకల్లు ఆర్టీఏ కార్యాలయంలోని ఓ అధికారి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నిర్వాహకులతో కుమ్మక్కయ్యారు. ‘దారి దోపిడీ’కి రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ తతంగానికి ఆర్టీఏలోని జిల్లాస్థాయి కీలక అధికారి కూడా సహకరిస్తున్నట్లు తెలిసింది.

అనంతపురం టవర్‌క్లాక్‌: కర్ణాటకలో బళ్లారి జిల్లా నుంచి ఆంధ్ర సరిహద్దు ప్రాంతమై డీ.హీరేహాళ్‌ మండలంలో దాదాపు 11 కిలో మీటర్ల మేర కర్ణాటక ప్రైవేట్‌ బస్సులు యథేచ్ఛగా ప్రయాణం చేస్తున్నాయి. కొందరు ఆర్టీఏ అధికారులు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు. పన్ను చెల్లించకుండా పర్మిట్‌ తీసుకోకుండా ప్రతి రోజూ కర్ణాటక ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు ఆంధ్రా సరిహద్దులో నుంచి వెళ్తున్నా పట్టించుకోవడం లేదు. ప్రతి మూడు నెలలకు ఒక్కసారి రూ.లక్ష ఒక్కో బస్సుకు పర్మిట్‌ తీసుకోవాలి అంటే పన్ను కట్టాలి. అలా కర్ణాటకకు చెందిన దాదాపు 100 ప్రైవేట్‌ బస్సులకు మూడు నెలలకు ఒకసారి రూ.కోటి ప్రభుత్వానికి రావాల్సి ఉంది. గుంతకల్లు ఆర్టీఏ కార్యాలయంలో ఓ అధికారి రహస్య ఒప్పందం కుదుర్చుకుని మూడు నెలలకు ఒకసారి దాదాపు రూ.15 లక్షలు మామూళ్లు తీసుకుంటున్నట్లు సమాచారం. అందులో కొంత మొత్తం జిల్లా ఆర్టీఏ కార్యాలయంలో పని చేసే ఓ కీలక అధికారికి అందుతున్నట్లు సమాచారం. ఈయన అండదండలతో రెండేళ్లుగా దారి దోపిడీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల రెండేళ్లకు దాదాపు రూ.8 కోట్లు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. 

ఆ బస్సులను సీజ్‌ చేయొద్దంటూ ఆదేశాలు!
జిల్లా ఆర్టీఏ కార్యాలయంలో ఒక అధికారి కర్ణాటక ప్రైవేట్‌ బస్సులను సీజ్‌ చేయడానికి వెళ్తే కీలక అధికారి రంగం ప్రవేశం చేసి.. వాటి పై చర్యలు తీసుకోవద్దని ఆదేశించినట్లు తెలుస్తోంది. గతంలో కూడా కర్ణాటక బస్సులు ఆంధ్ర సరిహద్దులో ప్రయాణిస్తుంటే చర్యలు తీసుకున్నట్లు సమాచారం. మళ్లీ రెండేళ్లగా గుంతకల్లు ఆర్టీఏ కార్యాలయంలోని ఓ అధికారి రహస్య ఒప్పందంతో ఆంధ్ర సరిహద్దుల్లో కర్ణాటక ప్రైవేట్‌ బస్సులు తిరిగేలా చేసినట్లు సమాచారం.

రాత్రి వేళలో ప్రయాణం
కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి తుమకూరు, హరియాన్, చెళ్లికెర, డీ.హీరేహాళ్‌ సమీపంలోని హైవే మీదుగా బళ్లారి – హోస్పెట్, రాయచూర్, బీదర్‌ మీదుగా హైదారాబాద్‌కు కర్ణాటక ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు ప్రయాణిస్తుంటాయి. డీ.హీరేహాళ్‌ సమీపంలోని ఓఎంసీ మైన్స్‌ గేటు వద్ద హైవే నుంచి ఆంధ్ర సరిహద్దు ప్రారంభం అవుతుంది. అక్కడ నుంచి లింగనహళ్లి, బస్టాప్‌ వరకు సుమారు దాదాపు 11 కిలో మీటర్లు మేరకు ఆంధ్రా పరిసరాలల్లోని హైవేలోకి ప్రయాణం చేస్తాయి. ఆ తర్వాత తిరిగి కర్ణాటక సరిహద్దులోకి వస్తాయి. నిబంధనల మేరకు ఆంధ్రా సరిహద్దులోకి ప్రవేశించి ప్రయాణం చేసే ఇతర రాష్ట్రాల ప్రైవేట్‌ బస్సులు తప్పని సరిగా పన్ను కట్టాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలు అక్కడ అమలు కావడం లేదు. దీని ఆసరాగా తీసుకొని గుంతకల్లు ఆర్టీఏ కార్యాలయం అధికారులు మామూళ్లకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 

చర్యలు తీసుకుంటాం
డీ.హీరేహాళ్‌ వద్ద ఆంధ్రా సరిహద్దులో కర్ణాటక ప్రైవేట్‌ బస్సులు ప్రయాణం చేస్తున్నాయని, ఆ బస్సుల నిర్వాహకులు ఎటువంటి పన్నులు, పర్మిషన్‌ తీసుకోలేదని మా దృష్టి వచ్చింది. వీటిపై గుంతకల్లు ఆర్టీఏ అధికారులు కర్ణాటక ప్రైవేట్‌ బస్సులపై నిఘా వేసి చర్యలు తీసుకునే విధంగా సూచించాం. పన్నులు చెల్లించకుండా ఆంధ్రాలో కర్ణాటక ప్రైవేట్‌ బస్సులు ప్రయాణం చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.  – సుందర్‌ వద్దీ, డీటీసీ,

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top