
న్యాయం చేయలేకపోతే వదిలేయండి: జగన్
రాష్ట్ర ప్రజలకు సమ న్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా వదిలేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి వైఎస్ జగన్మోహన రెడ్డి, ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు విజయమ్మ కోరారు.
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు సమ న్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా వదిలేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి వైఎస్ జగన్మోహన రెడ్డి, ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు విజయమ్మ కోరారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా వీరిద్దరూ తమ పదవులకు ఈరోజు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రజలకు ఆరు పేజీల బహిరంగ లేఖ రాశారు.
రాజకీయ కోణాలతో విభజన చేయొద్దని వారు కోరారు. అడ్డగోలు విభజన జరిగితే ఫలితాలు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. రాజీనామాలతోనైనా ఓ తండ్రిలా జరగబోయే నష్టాన్ని ఆపాలన్నారు. కాంగ్రెస్ నిర్లక్ష్య ధోరణికి నిరసనగానే తాము రాజీ నామాలు చేసినట్లు జగన్, విజయమ్మ వివరించారు.
రాష్ట్ర విభజనకు సంబంధించి నియమించిన ఆంటోని కమిటీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందేనని వైఎస్ఆర్ సిపి పేర్కొంది. అందరికీ న్యాయం చేయాలన్నదే తమ పార్టీ కోరికని తెలిపింది. తెలంగాణ ప్రజలపై తమకు గౌరవం ఉందని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీకి చేతనైతే సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని కోరింది.