యంగ్‌ సైంటిస్టు మేఘన

International Young Scientist Award For Meghana - Sakshi

అమెరికన్‌ ఫోర్బ్స్‌ మేగజీన్‌లో స్థానం

పశ్చిమగోదావరి, అత్తిలి: అమెరికాలో ఇంటెల్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన సైన్స్‌ఫేర్‌ పోటీలలో ఇంటర్నేషనల్‌ యంగ్‌సైంటిస్టు అవార్డు అందుకుని అమెరికన్‌ ఫోర్బ్స్‌ మేగజీన్‌లో చోటు సంపాదించుకుంది అత్తిలి మండలం ఉనికిలి గ్రామానికి చెందిన బొల్లింపల్లి మేఘన. ఐసెఫ్‌ 2018 మే నెలలో మేఘన అవార్డు సాధించి ప్రతిభావంతురాలిగా నిలిచింది. అమెరికన్‌ ఫోర్బ్స్‌ మేగజీన్‌లో 2018–19 ఏడాదికి సంబంధించి అండర్‌–30 శాస్త్రవేత్తల విభాగంలో మేఘన చోటు దక్కించుకుంది.  ప్రపంచస్థాయిలో ఐసెఫ్‌ సంస్థ నిర్వహించిన సైన్స్‌ఫేర్‌ పోటీలలో 82 దేశాలతో పోటీపడి ఎలక్ట్రోడ్‌ మేడ్‌ విత్‌ ప్లాటినమ్‌ అనే సైన్స్‌ సూపర్‌ కెపాసిటర్‌ ప్రయోగానికి ప్రథమస్థానంలో నిలిచి ఐసెఫ్‌ ప్రకటించిన యంగ్‌ సైంటిస్టు అవార్డు సాధించింది.

అవార్డుతో పాటు 50 వేల డాలర్ల బహుమతిని పొందిందని  మేఘన తాతయ్య వట్టికూటి సూర్యనారాయణ తెలిపారు. మేఘన తల్లిదండ్రులు బల్లింపల్లి వెంకటేశ్వరరావు, మాధవి. తండ్రి వెంకటేశ్వరరావు తొలుత లెక్చరర్‌గా, అనంతరం సత్యం కంప్యూటర్‌లో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తూ, అక్కడ నుంచి కంపెనీ తరపున 2004లో అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. వీరు అమెరికాలో ఆర్క్‌నెస్‌ రాష్ట్రంలో లిటిల్‌రాక్‌లో నివసిస్తున్నారు. మేఘన సెంట్రల్‌ ఉన్నత పాఠశాలలో 12వ గ్రేడు చదువుతోంది. తమ కుమార్తె 5వ గ్రేడు నుంచి అద్భుతమైన మేధాశక్తిని కలిగిఉందని, తానే సొంతంగా ఇంటర్‌నెట్‌ ద్వారా అనేక కొత్త విషయాలను తెలుసుకుని అనేక ప్రయోగాలు చేస్తుందని మేఘన తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, మాధవి శుక్రవారం రాత్రి ‘సాక్షి’కి ఫోన్‌లో తెలిపారు.

అక్కడ నిర్వహించే పలు సెమినార్లలో మేఘన పాల్గొని అనేక అవార్డులు సాధించిందని చెప్పారు. వెంకటేశ్వరరావు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మేఘన రెండున్నరేళ్ల వయస్సు ఉండగానే దేశాల రాజధానులను అనర్గళంగా చెప్పేదని, అప్పట్లో మాటీవీ కార్యక్రమంలో పాల్గొని ప్రశంసలు అందుకుందన్నారు. అక్కడ పలు డ్యాన్స్‌ పోటీలలో కూడా పాల్గొని ప్రశంసలు పొందుతోందన్నారు.  మేఘన సోదరి శ్రీహిత కూడా స్పెల్‌బీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిందని వెల్లడించారు. మేఘన కవల సోదరులు సుభాష్, అభిలాష్‌ ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు. తమ నలుగురు మనుమలు విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చడం తమకు చాలా ఆనందంగా ఉందని తాతయ్య, అమ్మమ్మలు వట్టికూటి సూర్యనారాయణ, లక్ష్మీతులసి తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top