మేడారం పనుల్లో టెండ‘రింగ్’ | In the midst of debt tender 'Ring' | Sakshi
Sakshi News home page

మేడారం పనుల్లో టెండ‘రింగ్’

Dec 10 2013 2:20 AM | Updated on Sep 2 2017 1:25 AM

మేడారం సమక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ద్వారా చేపట్టే 24పనుల కో సం

=పనులన్నింటికీ ఎక్సెస్‌తో దాఖలు
 =ప్రభుత్వంపై రూ. 8లక్షల అదనపు భారం

 
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్: మేడారం సమక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ద్వారా చేపట్టే 24పనుల కో సం నిర్వహించిన టెండర్లలో కాంట్రాక్టర్లు రింగ్ అయ్యారు. తాగునీటి పైప్‌లైన్ల నిర్మాణం, మరుగుదొడ్ల వద్ద నీటి సౌకర్యంతో పాటు జా తర సమయంలో వీటి నిర్వహణ చూసేందుకు రూ. 211లక్షల వ్యయంతో 24పనులు చేపట్టనున్నారు. వీటి కోసం నిర్వహించిన టెండర్ల ప్రక్రియ సోమవారం ముగిసింది.

ఈ పనులు దక్కించుకునేందుకు 163 షెడ్యూళ్లను కాంట్రాక్టర్లు కొనుగోలు చేశారు. మొత్తం 24 పనులకు 69 షెడ్యూళ్లు మాత్రమే దాఖలయ్యాయి. ఒక్కొక్క పనికి రెండు, మూడు చొప్పున టెండ ర్లు దాఖలయ్యాయి. టెండర్లు తెరిచిన వాటిలో 3.5 నుంచి 4.5శాతం ఎక్కువతో వేసిన వారికి టెండర్లు దక్కినట్లు హన్మకొండ డివిజన్ ఈఈ శ్రీనివాస్ తెలిపారు. ఎక్సెస్ టెండర్లతో 24పనులకు సుమారు రూ.8 లక్షల వరకు అదనపు భారం ప్రభుత్వంపై పడుతుంది.
 
చక్రం తిప్పిన నాయకులు...
 
ఆర్‌డబ్ల్యూఎస్ టెండర్లు వేసేందుకు ముందు గా షెడ్యూళ్లను పొందేందుకు చోటామోటా కాంట్రాక్టర్లు సుమారు 600కు పైగా డీడీలు తీసినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న తాడ్వాయి మండలానికి చెందిన రాజకీయ నేతలు స్థానికులకు అవకాశం ఇవ్వాలని హుకుం జారీ చేశారు. దీంతో కాంట్రాక్టర్లు, నాయకుల మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. ఇందులో షెడ్యూల్ కోసం తీసిన డీడీలను సేకరించి ఒకరి వద్ద పెట్టారు. ప్రతి షెడ్యూల్‌కు గుడ్‌విల్ చెల్లించేందుకు సుమారు రూ.20లక్షల వరకు పనులు చేసే కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసినట్లు సమాచారం. ఇందులో షెడ్యూల్ ఒక్కంటికి రూ.1500ల చొప్పున గుడ్‌విల్ చెల్లించి పనులన్నీ కాంట్రాక్టర్లకు అప్పగించినట్లు తెలిసింది. గుడ్‌విల్ కింద రూ.10లక్ష లు, మిగిలిన డబ్బులు నేతలు పార్టీల వారీగా పంపకాలు చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
 
వారంలో పనులు ప్రారంభిస్తాం..

టెండర్ల ప్రక్రియ పూర్తయినందున ఎక్సెస్ వేసిన కాంట్రాక్టర్లతో చర్చించి వారం రోజుల్లో పనులు ఫైనల్ చేస్తామని ఈఈ శ్రీనివాసరావు తెలిపారు. మేడారం పరిసర ప్రాంతాల్లో వరి పంట ఉన్నందున కోతలు పూర్తయిన తర్వాత మరుగుదొడ్లు, పైపులైన్ల నిర్మాణం చేపట్టే అవకాశాలున్నాయన్నారు. ఈలోగా జంపన్నవాగులో ఉన్న 9 ఇన్‌ఫిల్లరేషన్ బావుల్లో పూడిక తీత చేపట్టనున్నట్లు తెలిపారు. గత జాతర వరకు సుమారు 250 బోర్లు ఉన్నట్లు రికార్డుల్లో ఉన్నదని, వాటిని గుర్తించి మరమ్మతులు చేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ జాతర సందర్భంగా నిర్మించే మరుగుదొడ్ల వివరాలు, వేసే బోర్లను గూగుల్‌లో గుర్తించే విధంగా అన్‌లైన్ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement