సీటొదల! | Illegal income | Sakshi
Sakshi News home page

సీటొదల!

Oct 19 2014 2:44 AM | Updated on Sep 27 2018 4:42 PM

అక్రమ ఆదాయం దండిగా వచ్చే పోస్టుల కోసం వాణిజ్య పన్నుల శాఖలో కొందరు అధికారులు పోరాటం చేస్తున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో....

విజయవాడ : అక్రమ ఆదాయం దండిగా వచ్చే పోస్టుల కోసం వాణిజ్య పన్నుల శాఖలో కొందరు అధికారులు పోరాటం చేస్తున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో నగరంలో తమ ఆధిపత్యం కొందరు ఆధికారులు  జోరుగా పైరవీలు చేస్తున్నారు.  తమకు కావాల్సిన కుర్చీలపై గురిపెట్టి వాటి కోసం ఆరాటపడుతున్నారు. లక్షల్లో డబ్బు ముట్టజెప్పి నగరాన్ని వదలకుండా ఉండేందుకు కొందరు సీటీవోలు, డీసీటీవోలు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఈ నెలాఖరుకు బదిలీ ఉత్తర్వులు రానుండడంతో వాణిజ్య పన్నుల శాఖ అధికారుల పైరవీలు ఊపందుకున్నాయి.

విజయవాడ-1, 2 డివిజన్లలో పనిచేసే సీటీవోలు, డిప్యూటీ సీటీవోల్లో బదిలీల ఫీవర్ నెలకొంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అసిస్టెంట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను జీరో సర్వీసు కింద బదిలీ చేస్తారు. ఏడాది సర్వీసు పూర్తి చేసిన సీటీవోలు, డీసీటీవోలను కూడా బదిలీ చేస్తారు. ఈ క్రమంలో డీసీలు, ఏసీలు, సీటీవోలను రాష్ట్ర వ్యాప్తంగా బదిలీ చేస్తారు. డీసీటీవోలను మాత్రమ జోన్‌లో.. అంటే తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలో బదిలీ చేస్తారు.

ఈ నేపథ్యంలో జిల్లాలో జోన్ స్థాయిలో బదిలీ కావాల్సిన 60 మంది డీసీటీవోలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మూకుమ్మడి బదిలీ తప్పదని భావిస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న 20 మంది సీటీవోలు రాష్ట్ర వ్యాప్తంగా బదిలీ అవుతారు. జిల్లాలో ఉన్న  నలుగురు అసిస్టెంట్ కమిషనర్లు, ముగ్గురు డిప్యూటీ కమిషనర్లు కూడా బదిలీల జాబితాలో ఉన్నారు. వీరంతా నెల రోజులుగా హైదరాబాద్‌కు, అధికార పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొందరు అధికారులు తాము కోరుకున్న సీటిస్తే దక్షిణ కూడా సమర్పించేందుకు బేరసారాలు చేస్తున్నట్లు సమాచారం.
 
పాతుకుపోయిన అధికారులు

విజయవాడ-1, 2 డివిజన్లలోని సీటీవోలు, డీసీటీవోలు దాదాపు ఆరు నుంచి ఎనిమిదేళ్లుగా ఇక్కడే పాతుకుపోయి ఉన్నారు. రకరకాల సాకులతో కదలకుండా తిష్ట వేశారు. ఎనిమిదేళ్లుగా ఈ రెండు డివిజన్లలోనే అటూ ఇటూ మారుతూ కాలక్షేపం చేస్తున్నారు. కొందరైతే ఒకే డివిజన్లో సీట్లు మారుతున్నారు. ప్రస్తుతం కౌన్సెలింగ్ లేకుండా ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన బదిలీల్లో జీరో సర్వీసు నిబంధనలు వణుకు పుట్టిస్తున్నాయి. ప్రభుత్వం కూడా తమకు కావాల్సిన వారిని అవసరమైన చోటుకు తెచ్చుకునేందుకు కౌన్సెలింగ్ ప్రక్రియకు తిలోదకాలిచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో కొందరు నాయకులు పోస్టింగ్‌లకు కౌంటర్లు తెరిచినట్లు పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది. కొందరు నాయకత్వం ముసుగులో బదిలీలపై అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం.
 

Advertisement
 
Advertisement
Advertisement