అక్రమ భవనం.. అధికార కేంద్రం

ఉండవల్లిలోని కృష్ణానది ఒడ్డున సీఎం చంద్రబాబు నివాసం - Sakshi

- ‘కృష్ణా’లో అక్రమ నివాసంపై నోరు విప్పని బాబు 

నాడు కూల్చివేత అంటూనే నేడు నివాసం 

గతంలో అధికారులు నోటీసులిచ్చినా స్పందన శూన్యం

పైగా నదీ పరిరక్షణ అంటూ సూక్తుల వల్లింపు

తాజాగా హైకోర్టు నోటీసులతో అధికారుల్లో కలవరం

 

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి : కృష్ణా నదిలో, కరకట్ట (గట్టు) లోపల అక్రమ నిర్మాణాలు సరికాదని, వాటిని అనుమతించడం వల్ల భవిష్యత్తులో ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉన్నందున కూల్చి వేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఉమ్మడి హైకోర్టు విచారణకు స్వీకరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉంటున్న నివాసం విషయంలో అధికారులు తలపట్టుకుంటున్నారు. ఈ విషయమై ఎలా ముందుకు వెళతారు.. న్యాయస్థానానికి ఏం సమాధానం చెబుతారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.



నదీ పరిరక్షణ చట్టం(ఆర్‌సీ యాక్టు) ప్రకారం నీటి ప్రవాహానికి అడ్డు తగిలే ఎలాంటి నిర్మాణాలను నదిలో అనుమతించకూడదు. చివరకు ఏపుగా పెరిగే చెట్లను కూడా నాటడానికి వీల్లేదు. కరకట్ట లోపల ఉన్న నిర్మాణాలు అక్రమమని గతంలో తాడేపల్లి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసిన జాబితాలో ప్రస్తుతం ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న లింగమనేని ఎస్టేట్‌ (ఉండవల్లిలో)కు చెం దిన నిర్మాణం కూడా ఉంది. దీంతోపాటు బీజేపీకి చెందిన నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, చందన బ్రదర్స్, ముక్కాల అప్పారావు, చిగురు ఆశ్రమం, గణపతి సచ్చి దానంద ఆశ్రమం... తదితర అక్రమ నిర్మాణాలు ఉన్నాయని గతంలోనే జలవనరుల శాఖ, రెవెన్యూ అధికారులు గుర్తించి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

 

నాడు రచ్చ చేసిందీ టీడీపీ నేతలే...

కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో 2014కు ముందు పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ చైర్మన్‌ రేవూరి ప్రకాశ్‌రెడ్డి నేతృత్వంలో విజయవాడలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అందులో సభ్యులైన ప్రస్తుత జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే బాలవర్ధనరావు తదితరులు కృష్ణా నదిలో ఆక్రమణల గురించి అప్పటి కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లను, నీటిపారుదల శాఖ అధికారులను పెద్ద ఎత్తున నిలదీశారు. ఆక్రమణదారులకు తక్షణం నోటీసులు జారీ చేసి, వాటిని పూర్తి స్థాయిలో తొలగించేలా చర్యలు తీసుకోవాలని, నివేదిక కూడా సమర్పించాలని హుకుం జారీ చేశారు.



2014 డిసెంబర్‌ 31న జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణా నదిలో పరిశీలనకు బోటులో వెళ్లి.. నదికి ఇరువైపులా కరకట్టల లోపల ఆక్రమణలు ఉన్నాయని, చివరకు కృష్ణమ్మను కూడా వదల్లేదని, ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉంటుందా అని మీడియా ఎదుట తారస్థాయిలో ఏకరువు పెట్టారు. ఆ మరుసటి రోజు (2015 జనవరి 1న) ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. కృష్ణా నదిలో ఆక్రమణలు దారుణమని, కాంగ్రెస్‌ వాళ్లు దేన్నీ వదిలిపెట్టరని, ఆక్రమణదారులను తాను  వదిలిపెట్టే ప్రసక్తే లేదని తీవ్రంగా హెచ్చరించారు. ఇక అంతే.. ఆ తర్వాత అదే అక్రమ నిర్మాణంలో నివాసం ఏర్పరచుకోవడం చంద్రబాబునాయుడుకు మాత్రమే సాధ్యమైంది. 

 

పరిరక్షణంటూ తాజాగా ఉపన్యాసాలు

నదీ పరిరక్షణ చట్టానికి భిన్నంగా కృష్ణా నది గర్భంలో నివాసం ఉంటున్న ముఖ్యమంత్రి.. నదులను ççపరిరక్షిస్తానంటూ తాజాగా సుదీర్ఘ ఉపన్యాసాలు ఇస్తుండటంపై పర్యావరణవేత్తలతో పాటు జలవనరుల రంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు నదీ పరిరక్షణ చట్టాలపై ఏ మాత్రం గౌరవం ఉన్నా, ఆక్రమణల తొలగింపు విషయంలో చిత్తశుద్ధి ఉన్నా.. తక్షణం తన అక్రమ నివాసాన్ని ఖాళీ చేయాలని పర్యావరణ వేత్తలు డిమాండ్‌ చేసినా చెవికెక్కించుకోలేదు. నదుల అనుసంధానం కేవలం తాత్కాలిక చర్య అని, నదుల పరిరక్షణ శాశ్వత చర్య అంటూ సీఎం చెప్పుకొచ్చారు.



అయితే కృష్ణా, గోదావరి, పెన్నా నదులతో పాటు రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్లోనూ ఇసుకను ఇష్టానుసారంగా తన పార్టీ నేతలు తోడిపోస్తున్నా చర్యలు శూన్యం అయ్యాయి. పర్యావరణానికి తీవ్ర విఘాతమని పర్యావరణ వేత్తలు నిత్యం ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. నదులను పరిరక్షించుకోవాల్సిన బా«ధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పర్యావరణ వేత్తలు మేథాపాట్కర్, రాజేంద్రసింగ్‌ తదితరులు ఎంతగా చెబుతున్నా చంద్రబాబు సర్కారుకు పట్టడం లేదు.

 

తాజాగా నిర్మాణాలు... 

లింగమనేని అతిథి గృహాన్ని సీఎం అ«ధికారిక నివాసంగా మార్చుకోవడంతో పాటు ప్రత్యేకంగా రహదారిని సైతం నిర్మించుకున్నారు. హెలిప్యాడ్‌ సౌకర్యంతో పాటు ఇతర నిర్మాణాలనూ చేపట్టారు. రక్షణ సిబ్బందికి ప్రత్యేకంగా గదులు, ప్రహరీని నిర్మింపజేస్తున్నారు. రూ.4.12 కోట్లతో ప్రత్యేకంగా సందర్శకుల కోసం భవన నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా ఆక్రమణలపై పిల్‌ను ఉమ్మడి హైకోర్టు విచారణకు స్వీకరించి.. నోటీసులు జారీ చేయడంతో ప్రభుత్వం తప్పు ఒప్పుకుని తప్పుకుంటుందా.. లేక ఏమని సమాధానం చెబుతుందో వేచి చూడాలి. 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top