హుద్‌హుద్ పేరుతో రూ.2 కోట్లు హాంఫట్?


దెబ్బతినని పామాయిల్ తోటలకు పరిహారం పొందిన వైనం

 సర్పంచ్ స.హ. చట్టం దరఖాస్తుతో వెలుగులోకి..


 

గుడివాడ (రావికమతం): హుద్‌హుద్ తుఫాన్‌ను కూడా కొందరు లాభసాటిగా మార్చుకున్నారు.  అసలైన బాధితులు ఒక్క రూపాయి  కూడా అందకుండా అలమటిస్తుంటే, మరికొందరు మాత్రం ఇదే అదనుగా  లక్షలాది రూపాయలు కైంకర్యం చేస్తున్నారు.   గుడివాడ రెవెన్యూ పరిధిలో ఏ మాత్రం నష్టపోని 20 మంది రైతులకు రూ.2 కోట్లు పరిహారంగా మంజూరైన సంఘటన ఆశ్చర్యానికి గురిచేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన  ఆ గ్రామ సర్పంచ్ ఫిర్యాదుతో ఇది వెలుగు చూసింది. ఆ పంచాయతీకి సమీపంలోని 60 ఎకరాల్లో  ఇతర జిల్లాలకు చెందిన పి.లక్ష్మినారాయణ, జి.రామచందర్రాజు, సీతాదేవి, జగన్నాథరాజు, రమాదేవి, పి.వెంకటనరసింహ, గంగాకుమారి, ఎస్.కన్నారావు, టి.వసంత తదితర 20 మంది పామాయిల్ తోటలు వేశారు.  హుద్‌హుద్ గాలులకు తోటలు ఏమాత్రం దెబ్బతినకపోయినా తీవ్రంగా ధ్వంసమైనట్టుగా అధికారులతో కుమ్మక్కై నమోదుచేయించారు. అక్కడ మొత్తం 60 ఎకరాల్లో ఉన్న తోట మొత్తాన్ని గుర్తించి ఆన్‌లైన్‌లో పంపారు. అయితే 60 ఎకరాలకు బదులుగా 600 ఎకరాలుగా నమోదవడంతో ఆ తోట యజమానులు ఒకొక్కరికి రూ.15 లక్షలు,  రూ.12 లక్షలు, రూ.11 లక్షలు, రూ.9 లక్షల చొప్పున రెండు కోట్లు మేర పరిహారం వారి ఖాతాలకు జమైంది. ఈ తతంగం ఆనోటా ఈనోటా బయటకు పొక్కడంతో   గ్రామ సర్పంచ్ తలారి గణేష్ సమాచార ఉక్కు చట్టం ద్వారా దరఖాస్తుచేసి వివరాలు రాబట్టారు. వాస్తవంగా దెబ్బతిన్న రైతులను  గ్రామంలో ఎందరినో చూపినా అధికారులు ఏకపక్షంగా వ్యవహరించి వారిని గుర్తించకుండా,  ఏమాత్రం నష్టం జరగని  తోటలకు ఎలా నస్టపరిహారం ఇచ్చారని స్థానిక అధికారులను నిలదీశాడు. ఎవరూ స్పందించకపోవడంతో జిల్లా కలెక్టర్‌కు గురువారం ఫిర్యాదు చేసి ఆ ప్రతిని స్థానిక విలే కర్లకు అందించాడు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై స్థానిక ఉద్యానవన శాఖాధికారి డి.వి.రమణను సంప్రదించగా, ఆ సర్పంచ్‌కు అందిన కాపీలో వివరాలు తప్పుగా నమోదయ్యాయని, వాస్తవంగా వారికి రూ.18 లక్షలు నష్ట పరిహారం అందిందని చెప్పారు. అయితే ఏమాత్రం దెబ్బతినని తోటలకు అంతపెద్ద మొత్తం నస్టపరిహారం ఎలా మంజూరైందని అడగ్గా సమాధానం దాటవేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top