
రాజధానిగా విజయవాడ సురక్షితమేనా!
ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఎంపిక చేసిన విజయవాడ ప్రాంతం శాస్త్రీయ ప్రమాణాల దృష్ట్యా ఎంత సురక్షితం?
* ప్రకృతి విపత్తులైన వరదల్ని, తుపానుల్ని తట్టుకోగలదా?
* కృష్ణా నదిపై ఇప్పటికే ఆరు ఆనకట్టలున్నాయి
* మరో ఆరు నిర్మిస్తామంటున్నారు
* విజయవాడ భూకంపాల కేంద్రమని భూగర్భ శాఖ చెబుతోంది
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఎంపిక చేసిన విజయవాడ ప్రాంతం శాస్త్రీయ ప్రమాణాల దృష్ట్యా ఎంత సురక్షితం? ప్రకృతి విపత్తులైన వరదలు, తుపానులు, భూకంపాల్లాంటివి వస్తే తట్టుకోగలిగిన ప్రాంతమేనా? ప్రస్తుతం భూగర్భ, భూకంపాల విభాగం శాస్త్రవేత్తల్ని, పర్యావరణ వేత్తల్ని తొలిచివేస్తున్న ప్రశ్నలివి. పాత అనుభవాలు గానీ, భూగర్భ పరిశోధక శాఖ 2009-10, 2010-11 సంవత్సరపు నివేదికలు గానీ ఇందుకు సానుకూలంగా లేవు.
భారతీయ జియోలాజికల్ సర్వే ప్రకారం విజయవాడ, పరిసర ప్రాంతాలు భూకంపాల ప్రాంతం. ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకున్నట్టు కనిపించడం లేదు. నీటి లభ్యత, రవాణా అనుసంధానం కారణంగా విజయవాడ ప్రాంతాన్ని రాజధానికి ఎంపిక చేశామని ప్రభుత్వం చెబుతోంది. కృష్ణా నదిపై ఇప్పటికే ఆరు వంతెనలున్నాయి. మరో ఆరు నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అదే జరిగితే 1978లో ఢిల్లీ వరదల అనుభవం పునరావృతమైనా ఆశ్చర్యం లేదు. ఏదైనా ఓ కొత్త రాజధానిని నిర్మించేటప్పడు కనీసం వందేళ్ల దూరదృష్టితో మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారు.
1951లో విజయవాడ జనాభా 1,61,198 కాగా 2014కి 17 లక్షలు దాటింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పూర్తి భద్రతతో రాజధానిని నిర్మించాలి. ఏటా వరదలు, సముద్రంలో ఏర్పడే వాయుగుండాలు, అల్పపీడనాలు, రుతుపవనాల కాలంలో వచ్చే తుపానులు, పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా రాజధాని నిర్మా ణం జరగాలే తప్ప వాస్తు కోసమనో, రియల్టర్ల కోసమో నిర్మిస్తే భావితరాల అగచాట్లు చెప్పనలవి కావు.
103 అక్కడ, 63 గ్రామాలు ఇక్కడ..
కృష్ణా నదిపై ఉన్న చివరి డ్యాం నాగార్జున సాగర్ అయితే చివరి ఆనకట్ట ప్రకాశం బ్యారేజీ. 1990నాటి విపత్తుల నివారణ సంస్థ నివేదిక ప్రకారం కృష్ణా బేసిన్‌లో వరద ప్రమాదం ఎక్కువుండే ప్రాంతం కూడా ఇదే. సాగర్ డ్యాం నుంచి భారీ వరద వచ్చి కృష్ణాబ్యారేజీకి జరగరానిదేదైనా జరిగితే గుంటూరు జిల్లాలో 13, కృష్ణా జిల్లాలో 16 మండలాలు ముంపునకు గురవుతాయి. గుంటూరు జిల్లాలో 103, కృష్ణా జిల్లాలో 63 గ్రామాలు తీవ్రంగా దెబ్బతింటాయి. 2009లో కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాలను ముంచెత్తిన వరదలే ఇందుకు రుజువు. ఆ ఏడాది సాగర్‌లో నీళ్లు లేకపోబట్టి సరిపోయింది గానీ అందులో నీరుండి, సాగర్ నుంచి 12 లక్షల క్యూసెక్కుల నీరు వదిలితే గుంటూరు, కృష్ణా జిల్లాలు దెబ్బతిని ఉండేవి.
వరద ప్రభావిత మండలాలు...
కృష్ణా జిల్లా: చందర్లపాడు, ఘంటశాల, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, కోడూరు, పమిడిముక్కల, నాగాయలంక, మోపిదేవి, చల్లపల్లి, అవనిగడ్డ, జగ్గయ్యపేట,బెజవాడ రూరల్, తోట్లవల్లూరు, పెనమలూరు.
గుంటూరు జిల్లా
దాచేపల్లి, మాచవరం, అచ్చంపేట, మంగళగిరి, తాడేపల్లి, భట్టిప్రోలు, కొల్లూరు, కొల్లిపర, మాచర్ల, గురజాల, రేపల్లె, బెల్లంకొండ, దుగ్గిరాల, తుళ్లూరు, అమరావతి.