ఇంగ్లీషు మాధ్యమానికి జై

High Percent Parents Voted For The English Medium - Sakshi

తమ పిల్లలకు ఇంగ్లీషు మీడియమే కావాలన్న 96.17శాతం పేరెంట్స్‌

ప్రభుత్వానికి తమ అంగీకారాన్ని లిఖిత పూర్వకంగా తెలిపిన తల్లిదండ్రులు

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమం ప్రవేశపెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి తల్లిదండ్రులు జై కొట్టారు. ఈ మేరకు తమ ఐఛ్చికాన్ని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి తమ అంగీకారాన్ని తెలియజేశారు. 96.17శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీషు మాధ్యమమే కావాలంటూ స్పష్టంచేశారు. విద్యారంగంలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంట్లో భాగంగా నాడు – నేడు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను గణనీయ స్థాయిలో అభివృద్ధిచేయడానికి కార్యక్రమాలు ప్రారంభించింది.

ప్రపంచస్థాయి పరిజ్ఞానాన్ని అందించడానికి, అంతర్జాతీయంగా ఉన్న పోటీ వాతావరణాన్ని తట్టుకుని నిలబడి ఉన్నతస్థాయి చేరుకోవడానికి పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇటీవల హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రస్తుత 2019 – 2020 విద్యాసంవత్సరంలో 1 నుంచి 5వ తరగతి వరకూ చదువుతున్న తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకునేందుకుగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయిలో వారి అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తీసుకుంది. 3 ఆప్షన్లతో కూడిన ప్రత్యేక ఫార్మాట్‌ను వాలంటీర్ల ద్వారా తల్లిదండ్రులకు చేరవేశారు.

1. ఇంగ్లిషు మీడియంలో బోధిస్తూ, తెలుగు తప్పనిసరి సబ్జెక్టు
2. తెలుగు మీడియం
3. ఇతర భాషా మీడియం
ఈ మూడు ఆప్షన్లపై తల్లిదండ్రులు, స్వేచ్ఛగా టిక్‌చేసి, సంతకాలు చేసి ప్రభుత్వానికి పంపించారు. 

ఈ విద్యా సంవత్సరంలో 1 నుంచి 5వ తరగతి వరకూ 17,87,035 మంది విద్యార్థులు ఉంటే.. 17,85,669 మంది తమ ఐచ్ఛికాన్ని తెలియజేస్తూ సంతకాలు చేసి ప్రభుత్వానికి పంపారు. ఇందులో మొదటి ఐచ్ఛికాన్ని టిక్‌ చేస్తూ, తమ అంగీకారం తెలుపుతూ 96.17శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియంలో బోధనకే ఓటు వేశారు. తెలుగు మీడియంను కోరుకున్నవారు 3.05 శాతం మంది. ఇతర భాషా మీడియం కోరుకున్న వారు 0.78 శాతం. ఏప్రిల్‌ 29 వరకు వచ్చిన వివరాల ప్రకారం ఈ గణాంకాలు నమోదయ్యాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top