తిరుమలలో శనివారం భక్తులు పోటెత్తారు. దసరా, వారాంతపు సెలవులు ముగింపు దశకు చేరుకోవడంతో రద్దీ పెరిగింది.
తిరుమల : తిరుమలలో శనివారం భక్తులు పోటెత్తారు. దసరా, వారాంతపు సెలవులు ముగింపు దశకు చేరుకోవడంతో రద్దీ పెరిగింది. శనివారం వేకువజామున 4 గంటల నుంచి సాయంత్రం 6 వరకు మొత్తం 61,825 మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి 31 కంపార్ట్‌మెంట్లలో నిండిన సర్వదర్శన భక్తులు వెలుపల రెండు కిలోమీటర్ల దూరం వరకు క్యూ కట్టారు. వీరికి స్వామి దర్శనం లభించేందుకు 16 గంటల సమయం పడుతోంది.
నారాయణగిరి ఉద్యావనంలో కాలిబాట భక్తులు కిక్కిరిసి క్యూ కట్టారు. వీరికి కూడా 10 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభిస్తోంది. రద్దీ అనూహ్యంగా పెరగడంతో టీటీడీ విజిలెన్స్, పోలీసులు రంగప్రవేశం చేసి భక్తులను ఎక్కడికక్కడ నియంత్రించి క్యూల్లోకి అనుమతించారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా అదనపు క్యూలు, పక్కనే తాత్కాలిక లగేజీ కేంద్రాలు ఏర్పాటుచేశారు. గదుల కోసం భక్తులు రిసెప్షన్ కేంద్రాల వద్ద నిరీక్షించారు. తలనీలాలు తీసుకునేందుకు పడిగాపులు కాయాల్సి వచ్చింది. హుండీ కానుకలు రూ.2.08 కోట్లు వచ్చాయి.