ఏపీ అప్‌డేట్స్‌: అమరావతిలో హైటెన్షన్‌

Heavy Rains in Andhra pradesh - Sakshi

సాక్షి, అమరావతి : గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రమంతటా జనజీవనం అతలాకుతలం అవుతోంది. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. కుండపోతగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి, ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో  కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఇవి..

అమరావతిలో హైటెన్షన్‌

 • కొండవీటి వాగులో గంటగంటకు వరద ఉధృతి పెరుగుతోంది. నీరుకొండ వద్ద రాజధాని భూముల్లోకి భారీగా వరద నీరు చేరింది. పెడపరిమి వద్ద కొటేళ్ల వాగు పొంగి ప్రవహిస్తుండటంతో గుంటూరు- సచివాలయం మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మళ్లీ వర్షం పడితే చాలా గ్రామాలు నీట మునిగిపోతాయని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో పంటపొలాలు నీట మునిగాయి.

జల దిగ్బంధంలో దేవిపట్నం

 • తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో దేవిపట్నం, పోచమ్మగండి వద్ద గోదావరి నీటిమట్టం భారీగా పెరిగింది. గిరిజన గ్రామాల ప్రజలు బిక్కు బిక్కు మంటు గడుపుతున్నారు. అంగుళూరు, వీరవరంలంక గ్రామస్తులను పునరావాస కేంద్రానికి తరలించారు. సీతానగరం మండలం ములకల్లంక గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. దేవిపట్నంలో మొదటి ప్రమాద హెచ్చరికను సబ్ కలక్టర్ వినోద్ కుమార్ జారీ చేశారు. దేవిపట్నంలోని 31 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి.

తోటపల్లి బ్యారేజీకి వరద..

 • తోటపల్లి బ్యారేజీకి వరద ఉదృతి పెరుగుతోంది. ఇన్‌ఫ్లో 28 వేల క్యూసెక్కులు కాగా.. ఔట్‌ ఫ్లో 23వేల క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు నాగావళి నదిపరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

 • భారీ వర్షాలతో రాజమండ్రిలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీగా వరద నీరు వచ్చిచేరడంతో ధవళేశ్వరం బ్యారేజ్‌ నీటి మట్టం 13.75 అడుగులకు చేరింది. దీంతో ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. 13 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దాదాపు 1000 మందికి పునరావాస కేంద్రాలకు తరలించారు. 18 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి.

రాజధాని ప్రాంతంలో రెడ్‌ అలర్ట్‌

 • భారీ వర్షాలతో అమరావతిలో అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. కొండవీటి వాగు ఉప్పొంగే అవకాశం ఉండటంతో రాష్ట్ర సచివాలయానికి వరదముప్పు పొంచి ఉందని భావిస్తున్నారు. ముంపు ప్రాంతంలో తాత్కాలిక సచివాలయం ఉండటంతో ఈ విషయంలో ఏం చేయాలనే  దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కొండవీటి వాగు వరదను ఎటు మళ్లించాలనే దానిపై తర్జనభర్జన అవుతున్నారు. ప్రస్తుతం కొండవీటి వాగు వద్ద తాడికొండ పోలీసులు పహరా కాస్తున్నారు.

ఉభయ గోదావరి ,కృష్ణా జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు

 • రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్టా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో సోమవారం మూడు జిల్లాల్లోనూ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా వేలాది ఎకరాలు నీటమునిగాయి. వర్షాల కారణంగా గోదావరి జిల్లాల్లో ఇద్దరు మృతిచెందారు. కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విశాఖ అర్బన్‌లో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ప్రకాశం బ్యారేజీలో గరిష్ట స్థాయి నీటి మట్టం

 • ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరింది. బ్యారేజీ ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరగడంతో అధికారులు 70 గేట్లను ఎత్తేశారు. 65వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.

విజయవాడలో పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు

 • రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో విజయవాడలో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. అప్రమత్తమైన నగరపాలక సిబ్బంది మోటర్ల సాయంతో వర్షపు నీటిని తోడేస్తున్నారు. విజయ వాడ వన్‌టౌన్‌లో ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు వచ్చిచేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బందర్‌ రోడ్డు, ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియం, ఆర్టీసీ కాంప్లెక్స్‌, జమ్మిచెట్టు సెంటర్‌ రోడ్లన్ని జలమయమయ్యాయి.

అస్తవ్యస్తంగా మారిన గాంధీబొమ్మ సెంటర్‌ 

 • భారీ వర్షం కారణంగా విజయవాడలోని వన్‌టౌన్‌ గాంధీబొమ్మ సెంటర్‌ అస్తవ్యస్తంగా మారింది. చేపలమార్కెట్‌, ఊర్మిళనగర్‌, చిట్టనగర్‌ ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. మోకాళ్ల లోతు నీళ్లలో నడవటానికి ఇబ్బందులు పడుతున్నారు.   

మత్స్యకారులకు హెచ్చరిక

 • వాయవ్య బంగాళాఖాతంలో ఆదివారం ఏర‍్పడిక అల్పపీడనం ఇవాళ మరింత బలపడింది. దీంతో కోస్తాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తీరం అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయని ఐఎండీ తెలిపింది. సముద్రపు అలలు సాధారణం కంటే 4మీటర్ల ఎత్తుకు ఎగసిపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరిక జారీ చేశారు.

కొట్టుకు పోయిన తమ్మిలేరు కాజ్‌వే

 • కృష్ణా జిల్లా చాట్రాయి మండలం చిన్నంపేట వద్ద తమ్మిలేరు కాజ్‌వేపై వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో చాట్రాయి- చింతలపూడి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముసునూరు మండలం బలివే వద్ద వరద ఉధృతికి తమ్మిలేరు కాజ్‌వే కొట్టుకుపోయింది. కృష్ణా- పశ్చిమగోదావరి జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చాట్రాయి మండలంలో అత్యధికంగా 19.10సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నూజివీడు 11.50 సెంటిమీటర్లు, ముసునూరు మండలంలో 9.2 సెంటిమీటర్లు, ఆగిరిపల్లి మండలంలో 6సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. 
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top