పులివెందులలోని రవీంద్రనాథ పాఠశాల హెడ్మాస్టర్ కృష్ణానాయక్ సార్ మా కొద్దంటూ బుధవారం విద్యార్థులు తరగతులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు.
‘విద్యాబుద్ధులు నేర్పించాల్సిన హెడ్మాస్టర్ విలువలు మరచి ప్రవరిస్తున్నారు. పవిత్రమైన
ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెస్తున్నారు. మేము ఆడపిల్లలమే కాని ఆటబొమ్మలం కాము. మాతో అసభ్యంగా ప్రవరిస్తున్నారు. పాఠశాలకు రావాలంటేనే భయమేస్తోంది. ఈ హెచ్‌ఎం మాకొద్దు. ఆయన ఉంటే పాఠశాలకు రాం.’పులివెందులలోని రవీంద్రనగర్ పాఠశాల విద్యార్థినుల ఆవేదన ఇది.
పులివెందుల టౌన్: పులివెందులలోని రవీంద్రనాథ పాఠశాల హెడ్మాస్టర్ కృష్ణానాయక్ సార్ మా కొద్దంటూ బుధవారం విద్యార్థులు తరగతులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. విద్యార్థులతో అసభ్యంగా మాట్లాడుతున్న హెడ్మాస్టర్‌ను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. వివరాల్లోకెళితే.. పులివెందుల పట్టణంలోని న్యాక్ బిల్డింగ్ వద్ద ఉన్న రవీంద్రనాథ పాఠశాల హెడ్మాస్టర్‌గా కృష్ణానాయక్ ఈ ఏడాది మే 24న బాధ్యతలు స్వీకరించారు.
గతంలో ఈయన చక్రాయపేట మండలం మహదేవపల్లి జెడ్పీ పాఠశాలలో పలు ఆరోపణలతో సస్పెండయ్యారు. అనంతరం కలెక్టర్, డీఈఓ ఆదేశాల మేరకు ఈయన ర వీంద్రనాథ పాఠశాలకు హెడ్మాస్టర్‌గా వచ్చారు. ఆయన తీరులో ఏమాత్రం మార్పులేదని.. తమను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని.. తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. తమ తల్లిదండ్రులు వచ్చి హెడ్మాస్టర్‌ను అడిగినా ఫలితం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము నిత్యం నరకం అనుభవించలేక ఆందోళనకు దిగామని వారు చెప్పారు. హెడ్మాస్టర్ డౌన్ డౌన్.. ఈ హెడ్మాస్టర్ మాకొద్దు..ఆయన ఉంటే పాఠశాలకు రామంటూ ఫ్లకార్డులు చేతబట్టుకుని నినాదాలు చేశారు.
ఎంఈవో విలియం రాజు విచారణ :
హెడ్మాస్టర్ కృష్ణానాయక్ తీరుకు నిరసనగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న ఎంఈఓ విలియం రాజు పాఠశాలకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. ఈ హెడ్మాస్టర్ ఉంటే తాము పాఠశాలకు రామని విద్యార్థులు తెగేసి చెప్పారు. దీంతో ఆయన ఈ విషయాన్ని డీఈఓకు ఫోన్ ద్వారా వివరించారు.
హెడ్మాస్టర్‌ను వివరణ కోరగా తనకెలాంటి పాపం తెలియదన్నారు. కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు కూడా హెడ్మాస్టర్ మానసిక పరిస్థితి సరిగా లేదని చెప్పారు. అలాగే రాయచోటి అసిస్టెంట్ డీఈఓ రంగారెడ్డి కూడా బుధవారం మధ్యాహ్నం పాఠశాలకు చేరుకుని విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
ఆడపిల్లలమా..
ఆటబొమ్మలమా
పాఠశాలకు చదువుకొనేందుకు వస్తున్నాము, మా హెడ్మాస్టర్ మాతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. మేము ఆడపిల్లలమా లేక ఆటబొమ్మలం అనుకున్నారా. గురువంటే తండ్రితో సమానం. ఇలాంటి వారు పాఠశాలలో ఉంటే మే ము ఎట్లా చదువుకోవాలి..మాకు పాఠశాలకు రావాలంటేనే భయంగా ఉంది. ఈ హెడ్మాస్టర్‌ను ఇక్కడి నుంచి పంపిం చాల్సిందేనని విద్యార్థులు తమ ఆవేదనను అధికారుల ఎదుట వ్యక్తం చేశారు.