బొగ్గు గనుల్లో మేత! | Sakshi
Sakshi News home page

బొగ్గు గనుల్లో మేత!

Published Wed, May 2 2018 4:13 AM

Govt officials Planing to Scam in Coal mines - Sakshi

సాక్షి, అమరావతి: ఒక పని కోసం టెండర్లు ఆహ్వానించే ఏ సంస్థ అయినా ఎక్కువమంది పోటీదారులు పాల్గొనాలని, తక్కువ మొత్తానికే బిడ్లు దాఖలవ్వాలని కోరుకుంటుంది. ఈ లక్ష్యంతోనే అత్యధికులు టెండర్లలో పాల్గొనేందుకు వీలుగా అర్హత నిబంధనలు నిర్దేశిస్తుంది. బహిరంగ (ఓపెన్‌) టెండర్ల నిర్వహణ ప్రాథమిక ఉద్దేశం కూడా ఇదే. అయితే బొగ్గు గనుల అభివృద్ధి, నిర్వహణ(ఎండీవో) కాంట్రాక్టర్‌ ఎంపిక కోసం ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) రూపొందించిన నిబంధనలు ఈ ప్రాథమిక సూత్రానికి విరుద్ధంగా ఉన్నాయి. పోటీని పరిమితం చేసి, ప్రభుత్వ పెద్దలకు నచ్చిన సంస్థకే కాంట్రాక్టు కట్టబెట్టాలనే రహస్య ఎజెండాతోనే ఇలాంటి షరతులు పెట్టిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దేశంలోని ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ఇదే తరహా పనుల నిర్వహణ కోసం నిర్వహించిన టెండర్లలో అనుసరించిన నిబంధనలకు భిన్నంగా ఏపీఎండీసీ టెండర్‌ షరతులు ఉండడం గమనార్హం. ఈ షరతుల్లో మార్పులు చేయాలని, తమకు ఈ టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించాలని పలు సంస్థలు కోరుతున్నా ఏపీఎండీసీ లెక్కచేయడం లేదు. 

గోల్‌మాల్‌ నిబంధనలు 
ఛత్తీస్‌గఢ్‌లోని మదన్‌పూర్‌ దక్షిణం, మధ్యప్రదేశ్‌లోని సులియారీ బొగ్గు గనుల అభివృద్ధి, నిర్వహణకు సంస్థను ఎంపిక చేసేందుకు మెటల్‌ స్క్రాప్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ (ఎంఎస్‌టీసీ) ద్వారా ఏపీఎండీసీ ఈ–టెండర్లు(ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు) ఆహ్వానించింది. మార్చి 19న టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. బొగ్గు గనుల అభివృద్ధి, తవ్వకం, నిర్వహణలో అనుభవం ఉన్న సంస్థల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు పేర్కొంది. గని అభివృద్ధి, నిర్వహణకు సొంత ఆర్థిక వనరులతో ప్రణాళిక రూపొందించుకుని అవసరమైన నిర్మాణాలు, ఇంజనీరింగ్‌ కార్యక్రమాలతో సహా మొత్తం వ్యవహారాలు ఎండీవో కాంట్రాక్టరే చూసుకోవాల్సి ఉంటుందని టెండర్‌ నోటిషికేషన్‌లో వివరించింది. ఈ నెల 18వ తేదీ వరకూ దరఖాస్తుల సమర్పణకు గడువు ఇచ్చింది. ఇంతవరకూ బాగానే ఉన్నా టెండర్‌ నిబంధనలే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.  

మొత్తం ఖనిజాన్ని వెలికితీసే వరకూ ఈ గనులు ఎండీవో కాంట్రాక్టర్‌ నిర్వహణలోనే ఉంటాయి. ఏపీఎండీకి చెందిన మదన్‌పూర్‌ గనిలో దాదాపు 187 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉంది. ఇందులో 137 మిలియన్‌ టన్నుల బొగ్గును తవ్వొచ్చని అంచనా. సులియారీలోని గనిలో 147 మిలియన్‌ టన్నుల ఖనిజం ఉండగా, ఇందులో 109 మిలియన్‌ టన్నుల బొగ్గు తవ్వొచ్చని అంచనా. గని నిర్వహణతోపాటు తవ్వకాలు జరిపి ఓవర్‌ బర్డెన్‌(వృథా మట్టి)ని తొలగించి, అమ్మకానికి పనికొచ్చే బొగ్గును ఏపీఎండీసీకి అప్పగించాల్సి ఉంటుంది. 

ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులట! 
ఏ సంస్థ అయినా టెండర్‌ నోటిషికేషన్‌ జారీ చేస్తే దాన్ని ఎవరైనా ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకుని అందులో పాల్గొనేందుకు అర్హతలు, నిబంధనలు, చేయాల్సిన పనులు లాంటి వివరాలన్నీ తెలుసుకోవచ్చు. అయితే, ఏపీఎండీసీ ఈ బొగ్గు గనుల ఎండీవో కాంట్రాక్టర్‌ ఎంపిక టెండర్ల విషయంలో ఈ నిబంధనలను గాలికొదిలేసింది. సంస్థ వెబ్‌సైట్‌లో పెట్టిన టెండర్‌ ప్రకటనలో కేవలం ఎండీవో కాంట్రాక్టర్‌ ఎంపిక కోసం ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మాత్రమే ఉంది. ఇతర అంశాలేమీ లేవు. ఆసక్తిగల వారు ఎంఎస్‌టీసీలో పేర్లు నమోదు చేసుకుని, దరఖాస్తు రుసుం రూ.50 వేలు చెల్లించి, నిబంధనలు తెలుసుకోవచ్చని పేర్కొంది. నిబంధనలు, పని వివరాలు తెలుసుకోవడానికే రూ.50 వేలు చెల్లించాలనడం గమనార్హం. ఏపీఎండీసీ గతంలో బెరైటీస్‌ ఖనిజం తవ్వకాలకు ఎంఎస్‌టీసీ ద్వారానే ఈ–టెండర్లు పిలిచింది. అప్పుడు టెండర్‌ నోటిఫికేషన్‌లోనే అన్ని నిబంధనలను పేర్కొంది. బొగ్గు గనుల ఎండీవో కాంట్రాక్టర్‌ ఎంపిక టెండర్ల విషయంలో మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించింది. 

ప్రభుత్వ పెద్దలకు వాటాలు 
ఒక ఆర్థిక సంవత్సరంలో 20 మిలియన్‌ టన్నుల బొగ్గు తవ్విన అనుభవం ఉన్న సంస్థలకే ఈ టెండర్లలో పొల్గొనేందుకు అర్హత ఉంటుందని ఏపీఎండీసీ స్పష్టం చేసింది. ఎక్కువ సంస్థలు పోటీకి రాకుండా నివారించడంతోపాటు నచ్చిన వారికి కాంట్రాక్టు కట్టబెట్టడం కోసమే ఇలాంటి షరతులు పెట్టినట్లు స్పష్టమవుతోంది. ‘‘టైలర్‌ మేడ్‌ నిబంధనలు పెడితే తక్కువ సంస్థలు పోటీలో ఉంటాయి. వాటి మధ్య రాజీ కుదిర్చి నచ్చిన సంస్థకు బొగ్గు గనులను కట్టబెట్టవచ్చు. తద్వారా ప్రభుత్వ పెద్దలు భారీగా వాటాలు పంచుకోవచ్చు. ఈ ఉద్దేశంతోనే ఏపీఎండీసీతో ఈ తరహా షరతులు విధించింది’’ అని ప్రముఖ కాంట్రాక్టర్‌ ఒకరు చెప్పారు. గతంలో ఏపీఎండీసీ మంగంపేటలోని గనుల్లో బెరైటీస్‌ తవ్వకం కాంట్రాక్టును కూడా ఇలాగే టైలర్‌ మేడ్‌ నిబంధనల ద్వారా చెన్నైకి చెందిన సంస్థకు కట్టబెట్టింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలు భారీగా లబ్ధి పొందిన వైనాన్ని ‘సాక్షి’ బయటపెట్టింది. 
- మదన్‌పూర్‌ దక్షిణ బ్లాకులో ఏటా 38.12 మిలియన్‌ టన్నుల (బొగ్గు, ఓవర్‌ బర్డెన్‌) తవ్వకం కోసం ఎండీవో కాంట్రాక్టర్‌ ఎంపికకు ఏపీఎండీసీ ప్రస్తుతం టెండర్లు స్వీకరిస్తోంది. ఇందులో పాల్గొనాలంటే ఒక ఆర్థిక సంవత్సరంలో సింగల్‌ ఓపెన్‌కాస్ట్‌ మైన్‌లో 20 మిలియన్‌ టన్నుల బీసీఎం తవ్వి ఉండాలని, ఇందులో 2.70 మిలియన్‌ టన్నుల బొగ్గు/ లిగ్నైట్‌ ఉండాలని పేర్కొంది. 
సులియారీ బ్లాక్‌లో ఏటా 41.8 టన్నుల బొగ్గు, ఓవర్‌ బర్డెన్‌ తవ్వకం కోసం ఎండీవో కాంట్రాక్టర్‌ ఎంపికకు ఏపీఎండీసీ బిడ్లు స్వీకరిస్తోంది. ఇందులో పాల్గొనాలంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఏదైనా ఓపెన్‌కాస్ట్‌ మైన్‌లో 20 మిలియన్‌ టన్నుల బీసీఎం తవ్వి ఉండాలని, ఇందులో 2.70 టన్నుల బొగ్గు, లిగ్నైట్‌ ఉండాలని షరతు విధించింది. 
తలైపల్లి బొగ్గు బ్లాకులో ఏటా 104 మిలియన్‌ టన్నుల తవ్వకానికి గతంలో ఎన్‌టీపీసీ టెండర్లు ఆహ్వానించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో 15 మిలియన్‌ బీసీఎం తవ్విన సంస్థకు టెండర్లలో పాల్గొనేందుకు అర్హత కల్పించింది. ఏపీఎండీసీ మాత్రం ఏటా కేవలం 38.12 టన్నుల తవ్వకం కోసం 20 బీసీఎంను అర్హతగా నిర్దేశించడం గమనార్హం. 

రివర్స్‌ వేలం ద్వారా తుది నిర్ణయం 
బొగ్గు గనుల తవ్వకం విషయంలో ఇలాంటి షరతులు పెట్టడానికి కారణం ఏమిటని ఏపీఎండీసీ అధికారులను ప్రశ్నించగా... తమ బొగ్గు గనుల్లో స్ట్రైకింగ్‌ రేషియో ఎక్కువగా ఉన్నందున ఇలా పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. స్ట్రైకింగ్‌ రేషియోను గతంలో టెండర్లు నిర్వహించిన సంస్థలు కూడా పరిగణనలోకి తీసుకున్నాయి. ‘‘రెండు గనులకు ఎండీవో కాంట్రాక్టర్ల ఎంపిక కోసం మొదట ఈ నెల 18న ఈ–వేలం నిర్వహిస్తాం. ఇందులో తక్కువ మొత్తానికి వచ్చిన బిడ్‌ ఆధారంగా రివర్స్‌ వేలం నిర్వహిస్తాం. ఈ–టెండర్లలో వచ్చిన బిడ్‌ కంటే తక్కువ మొత్తానికే రివర్స్‌ వేలంలో కోట్‌ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ–టెండర్లలో పాల్గొన్న సంస్థలకే రివర్స్‌ వేలంలో పాల్గొనడానికి అర్హత ఉంటుంది’’ అని అధికార వర్గాలు తెలిపాయి.  

Advertisement
Advertisement