జీడిపల్లి పునరావాసం కోసం ముందడుగు

Government Give Grant To Jeedipally Village In Anantapur - Sakshi

ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి 

తొలివిడతగా రూ. 15 కోట్లు కేటాయించిన ప్రభుత్వం

సాక్షి, అనంతపురం: బెళుగుప్ప మండలం జీడిపల్లి గ్రామ సమీపంలోని జీడిపల్లి రిజర్వాయర్‌ను 2005లో ప్రారంభించి 2012 నాటికి పూర్తి చేసి కృష్ణా జలాలతో నింపుతున్నారు. రిజర్వాయర్‌ మూలంగా కిందభాగాన ఉన్న జీడిపల్లి గ్రామస్తులు ఊటనీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం జీడిపల్లి వాసులకు ఆర్‌అండ్‌ఆర్‌ (రిహాబిలిటేషన్‌ అండ్‌ రీసెటిల్‌మెంట్‌) పథకం కింద పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చినా పట్టించుకోలేదు. ఇందుకోసం అప్పటి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఐదేళ్లూ పోరాటాలు చేశారు. గ్రామస్తులతో కలిసి జల జాగరణ చేశారు. గ్రామస్తులను అధికారుల వద్దకు పిలుచుకెళ్లారు. కలెక్టరేట్‌ ముట్టడి, ధర్నా చేశారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ ‘జీడిపల్లి పునరావాసం’పై  పలుమార్లు  గళం విప్పారు. దీంతో దిగొచ్చిన గత ప్రభుత్వం కంటితుడుపు చర్యగా జీఓ 468 విడుదల చేసి చేతులు దులుపుకుంది.

కొత్త ప్రభుత్వంలో ముందడుగు 
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి నేరుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను విన్నవించారు. ఇందులో భాగంగా జీడిపల్లి గ్రామస్తులకు పునవాసం, కమ్యూనిటీ లిఫ్ట్‌ డ్రిప్‌ ఇరిగేషన్, ఆమిద్యాల, రాకెట్ల లిఫ్ట్‌ నిర్మాణం వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి ఆయా శాఖల అధికారులను  ఆదేశించారు. ఈ క్రమంలో జీడిపల్లి గ్రామస్తుల పునరావాసానికి 2019–20 సంవత్సరంలో తొలివిడతగా రూ. 15 కోట్లు కేటాయిస్తూ ఆర్‌అండ్‌ఆర్‌ ప్రత్యేక కమిషనర్‌ రేఖారాణి గతవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో  ఆర్‌అండ్‌ఆర్‌ క్యాష్‌ బెనిఫిట్స్‌కు రూ. 10 కోట్లు, నిర్మాణాలకు రూ. 4 కోట్లు, భూ సేకరణకు రూ. 90 లక్షలు, పరిహారానికి రూ. 10 లక్షలు కేటాయించారు.

సీఎల్‌డీఐలోకి గ్రామాలు చేర్చండి 
ఉరవకొండ నియోజకవర్గంలో 20 వేల హెక్టార్లకు సాగు నీరందించడానికి రూ. 890 కోట్లతో మంజూరైన కమ్యూనిటీ లిఫ్ట్‌ డ్రిప్‌ ఇరిగేషన్‌ (సీఎల్‌డీఐ) పథకంలోకి గంగవరం, కాలువపల్లి గ్రామాలను చేర్చాలని ముఖ్యమంత్రిని విశ్వేశ్వరరెడ్డి కోరారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశాలు జారీ చేశారు. అలాగే హంద్రీ–నీవా ప్రధాన కాలువ ఉరవకొండ మండలంలో వెళ్తున్నా ఆమిద్యాల, రాకెట్ల, కౌకుంట్ల ఆయకట్టుకు డీపీఆర్‌లో నీటిని కేటాయించలేదు. ఈ విషయాన్ని అప్పట్లోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి దృష్టికి విశ్వేశ్వరరెడ్డి తీసుకెళ్లారు.

దీనికి స్పందించిన వైఎస్‌ఆర్‌ ఆమిద్యాల, రాకెట్ల, కౌకుంట్ల గ్రామాల్లోని 8 వేల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేందుకు 52వ ప్యాకేజీలో భాగంగా ‘ఆమిద్యాల, రాకెట్ల లిఫ్ట్‌’ను  మంజూరు చేశారు. టెండర్లు పూర్తయినా గత ప్రభుత్వం పనులు  చేపట్టలేదు. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని విశ్వేశ్వరరెడ్డి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. సీఎం  ఆదేశాలతో పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ చర్యల పట్ల ఉరవకొండ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top