దశలవారీగా సమస్యలు పరిష్కరిస్తాం: కలెక్టర్ శ్రీధర్ | Sakshi
Sakshi News home page

దశలవారీగా సమస్యలు పరిష్కరిస్తాం: కలెక్టర్ శ్రీధర్

Published Tue, Nov 26 2013 5:00 AM

Governement will solve people's problems Step wise, says collector sridhar

 ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: ప్రజలు ప్రస్తావించే అన్ని సమస్యలూ ఒకేసారి పరిష్కరించడం సాధ్యం కాదని, దశలవారిగా వాటి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ అన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు సంబంధించి రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు తదితర ప్రధాన సమస్యలు ఉన్నాయని చెప్పారు. జిల్లాలో కొత్తగా 30వేల రేషన్‌కార్డులు, 15వేల ఇళ్లు మంజూరయ్యాయన్నారు. 29 శాతం వైకల్యం ఉన్న వికలాంగులకు కూడా పెన్షన్ సౌకర్యాన్ని వర్తింపజేశామని ఆయన అన్నారు. కొత్త రేషన్ కార్డులు తీసుకున్న వారికి డిసెంబర్ నెల నుంచి బియ్యం, పెన్షన్లు మంజూరైన వారికి నవంబర్ నుంచి పెన్షన్ అందుతుందని కలెక్టర్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎస్సీలకు లక్ష రూపాయలు, ఎస్టీలకు లక్షా ఐదు వేలను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. ఇళ్లు మంజూరైన వారు వెంటనే ఇళ్లను కట్టుకోవాలని కోరారు.
 
 ఇళ్లు కట్టుకోవడానికి స్థలాలు లేనివారికి(గతంలో మంజూరైన వారికి) స్థలాలను కేటాయించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఓఆర్‌ఆర్ పరిధి లోపల ఉన్న వారికి నిబంధనల ప్రకారం ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇస్తుందని కలెక్టర్ చెప్పారు. అంతకు ముందు సర్పంచ్‌లు లేవనెత్తిన వివిధ సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని ఆయన హామీనిచ్చారు. డ్రైనేజీ, రోడ్లు వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తామని, 13వ ఫైనాన్స్ నిధులతో అభివృద్ధి పనులను చేపడతామన్నారు. వివిధ అభివృద్ధి పనుల గురించి నెలకోసారి సర్పంచ్‌లతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ఎంపీడీఓలకు సూచించారు.
 
 కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి పనుల అమలుకు నిధులు లేవని, నిధుల మంజూరుకు కలెక్టర్ చొరవ తీసుకోవాలని కోరారు. పట్నం నగరపంచాయతీ పరిధిలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఆంక్షలను ఎత్తివేయాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ వరప్రసాద్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి నారాయణరెడ్డి, ఎంపీడీఓ అనిల్‌కుమార్, సర్పంచ్‌లు ఏనుగు శ్రీనివాస్‌రెడ్డి, పాశం అశోక్‌గౌడ్, బొడ్డు నిర్మల, పోరెడ్డి సుమతి, రచ్చబండ మండల కమిటీ సభ్యుడు కొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కంబాలపల్లి హన్మంత్‌రెడ్డి, మండల సీపీఎం కార్యదర్శి సామెల్ తదితరులు మాట్లాడారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement