కృష్ణా నీటి పంపకాల్లో తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ... మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. ఆ తీర్పులోని చాలా అంశాలు మనకు తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నా.. న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించలేదు.
‘బ్రిజేశ్ తీర్పు’ నష్టాలపై నిర్లక్ష్యం వీడని సర్కారు
గతంలోని స్టే ఎత్తివేత పిటిషన్‌కు ఎగువ రాష్ట్రాలు సిద్ధం
స్టే ఎత్తివేస్తే వెంటనే అమల్లోకి బ్రిజేష్ ట్రిబ్యునల్ అవార్డు
స్టే కొనసాగించాలని సుప్రీంను కోరే అవకాశమున్నా.. పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
అఖిలపక్షం, ప్రధానికి వినతిపత్రంతోనే సరి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నీటి పంపకాల్లో తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ... మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. ఆ తీర్పులోని చాలా అంశాలు మనకు తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నా.. న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించలేదు. కనీసం తీర్పు అమలును నిలిపివేసేలా ఆదేశించాలని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ అయినా వేయలేదు. మరోవైపు బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు వెంటనే అమలయ్యేందుకు వీలుగా ఎగువ రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. కొద్దిరోజుల్లోనే సుప్రీంలో పిటిషన్ వేయనున్నట్లు సమాచారం. ఒకవేళ బ్రిజేశ్ తీర్పు అమలైతే.. రాష్ట్రంలో నీటికి కటకట తప్పదు. ఇంత ముఖ్యమైన విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మీనమేషాలు లెక్కిస్తూనే ఉండడం ఆందోళనకరమైన అంశం. కృష్ణా జలాల పంపకంపై ఇటీవల బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తన తుది తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. అందులో చాలా అంశాలు మన రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ఉన్నాయి.
ముఖ్యంగా మనకే కేటాయించాల్సి ఉన్న మిగులు జలాలను ఎగువ రాష్ట్రాలకు పంపిణీ చేయడం... నీటి లభ్యత అంచనా కోసం పరిగణనలోకి తీసుకున్న 65 శాతం డిపెండబులిటీ, కర్నాటక నిర్మించిన ఆలమట్టి డ్యాం ఎత్తును పెంచడం వంటి అంశాలు మనకు వ్యతిరేకంగా ఉన్నాయి. దాంతోపాటు తీవ్ర కరువు పరిస్థితిని ఎదుర్కొంటున్న ప్రాంతాలకు నీటిని అందించడానికి ఉద్దేశించిన కల్వకుర్తి, నెట్టెంపాడు, ఏఎమ్మార్పీ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలిగొండ వంటి ప్రాజెక్టులకు చుక్క నీటిని కూడా కేటాయించలేదు. మొత్తంగా ఈ తుది తీర్పు అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం వాటిల్లనుంది. అయితే, ఈ విషయాన్ని మధ్యంతర తీర్పు (2010 డిసెంబర్ 30) సమయంలోనే పసిగట్టి సుప్రీంకోర్టులో స్టే తీసుకువచ్చారు. కానీ, ఆ స్టే తుది తీర్పు వెలువడే వరకే అమల్లో ఉంటుంది. ప్రస్తుతం తుది తీర్పు వెలువడినందున.. దాని అమలుకు వీలుగా స్టే ఎత్తివేయాల్సిందిగా కోరుతూ ఎగువ రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇటీవలి సెలవుల అనంతరం సుప్రీంకోర్టు కార్యకలాపాలు మొదలయ్యాయి. దాంతో బ్రిజేశ్ తీర్పు అమలుకు చర్యలు తీసుకోవాలంటూ ఏ రోజైనా కర్నాటక, మహారాష్ట్ర సుప్రీంకోర్టును కోరే అవకాశం ఉంది.
అంతులేని నిర్లక్ష్యం..
ఎగువ రాష్ట్రాలు తమ ప్రయోజనాల కోసం వేగంగా స్పందిస్తుంటే.. మరోవైపు మన రాష్ట్రం మాత్రం ఇంకా మొద్దునిద్ర వీడడం లేదు. ఆ తీర్పు వచ్చిన వెంటనే అమలుకాకుండా ఉండడం కోసం సుప్రీంకు వెళ్లాల్సిన మన రాష్ర్టం.. నెల రోజులు దాటిపోయినా ఇంకా కదలడం లేదు. కేవలం ముఖ్యమంత్రి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించడం, ప్రధాన మంత్రిని కలవడం వంటి చర్యలతోనే సరిపెట్టింది. న్యాయపరమైన పోరాటానికి సంబంధించి ఇంకా స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోయింది. అసలు ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రాకుండా ఉండాలంటే.. మిగతా రాష్ట్రాలకన్నా ముందుగా మనమే సుప్రీంలో పిటిషన్‌ను దాఖలు చేయాల్సి ఉంది. తీర్పు మనకు వ్యతిరేకంగా ఉన్నందున అదే విషయాన్ని ప్రస్తావిస్తూ... అందులోని పలు అంశాలను సవరించాలని, అంతవరకూ ప్రస్తుత స్టేను కొనసాగించాలని కోరాలి. ఈ విషయంలో మన రాష్ట్ర అధికారులు కొంత కసరత్తు చేశారు. కానీ, దీనిపై ముఖ్యమంత్రి స్థాయిలో విధాన నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంది. ఆ తర్వాతే న్యాయవాదులు సుప్రీంలో పిటిషన్‌ను దాఖలు చేయడానికి అవకాశం ఉంటుంది.