ఓ మంచి ఆర్గానిక్‌ కాఫీ..!

GCC Open Organic Coffee Shop in Visakhapatnam - Sakshi

బీచ్‌రోడ్డులో జీసీసీ ఆధ్వర్యంలో కాఫీ షాప్‌

అన్ని రకాల కాఫీ రుచులతో ప్రారంభానికి సిద్ధం

సాక్షి, విశాఖపట్నం: ఫిల్టర్‌ కాఫీ... కోల్డ్‌ కాఫీ... గ్రీన్‌ కాఫీ... ఇలా పేరు ఏదైనా భిన్నమైన రుచుల్లో ఒక మంచి ఆర్గానిక్‌ కాఫీని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) రుచి చూపించనుంది. ఇప్పటివరకూ ఆర్గానిక్‌ కాఫీ పొడిని మాత్రమే వినియోగదారులకు అందించిన జీసీసీ... ఇప్పుడు చక్కని ఆర్గానిక్‌ కాఫీని అందించనుంది. ఇందుకోసం బీచ్‌రోడ్డులోనున్న కేంద్ర కార్యాలయం పక్కనే కాఫీ షాప్‌ను ఏర్పాటు చేశారు. ఇది కేవలం షాప్‌ మాత్రమే కాదు ట్రైనింగ్‌ సెంటర్‌గానూ, భిన్నమైన కాఫీ రుచులకు డెమో కేంద్రంగానూ పనిచేయనుంది. భవిష్యత్తులో ఇతర ప్రాంతాల్లోనూ జీసీసీ ఏర్పాటు చేయనున్న కాఫీ షాపులను నిర్వహించడానికి అవసరమైన శిక్షణనూ యువతకు ఇక్కడ ఇవ్వనున్నారు. ఇక్కడికొచ్చే కాఫీ ప్రియుల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. ఇంకెలాంటి రుచులు కావాలి? ఎలాంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది? తదితర విషయాలన్నీ ఇక్కడ సిబ్బంది అడిగి తెలుసుకుంటున్నారు. ఇది క్వాలిటీ కంట్రోల్‌ సెంటర్‌గానూ పనిచేయనుంది. ఈ కాఫీ షాప్‌ ఏర్పాటు, నిర్వహణలో టెనేగర్‌ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ సహకారం అందిస్తోంది.

అరకు వ్యాలీలోనూ మరొకటి...
జీసీసీ కేంద్ర కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన కాఫీ షాప్‌ ఒక బ్రాండింగ్‌ మోడల్‌గా ఏర్పాటు చేస్తున్నాం. ఇదే మాదిరిగా పర్యాటక కేంద్రమైన అరకువ్యాలీలోనూ మరో షాప్‌ ఏర్పాటు చేయనున్నాం. ఈ కాఫీని అందించే అరబికా మొక్క పేరునే ఈ షాప్‌కు పెట్టాం. గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా హట్‌ పేరును, రాష్ట్ర పర్యాటక రంగానికే తలమానికంగానే గాక కాఫీ సాగుకు కేంద్రంగా ఉన్న అరకువ్యాలీ పేరును జోడించాం. జీసీసీ ప్రతిష్టను పెంచడంతో పాటు గిరిజన యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ఈ షాప్‌ను నిర్వహించనున్నాం.
– టి.బాబూరావునాయుడు, జీసీసీ వైస్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top