ఉత్సవ విగ్రహాలు

ఉత్సవ విగ్రహాలు

 • అధికారాలు, విధులు లేవు

 •  ఎంపీపీ, జెడ్పీ చైర్మన్లను ఎన్నుకోవడానికే

 •  సమావేశాల కోసమే ఎంపీటీసీ, జెడ్పీటీసీలు

 • గ్రామీణాభివృద్ధిలో వీరి పాత్ర నామమాత్రం. చేతికి ఆరోవేలు వంటివారు. అధికారాలు, బాధ్యతలు, విధులు లేని పదవులు ఇవి.  కేవలం ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్‌లను ఎన్నుకోవడం, మండల, జెడ్పీ సమావేశాలకు హాజరు కావడం మినహా అధికారికంగా నిర్వహించే విధులేమిటో చట్టంలో పేర్కొనలేదు. మండల, జిల్లా పరిషత్ విధుల్లోనూ వీరికి కనీసం పర్యవేక్షణ అవకాశం కూడా లేదు. కార్యాలయాల్లో కూర్చోవడానికి కనీసం కుర్చీ కూడా లేదు. కోటి ఆశలతో కోట్లు వెచ్చించి గెలిచిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ప్రస్తుతం ఉత్సవ విగ్రహాల్లా మారారు.

   

  విశాఖ రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏవేవో వాగ్ధానాలు చేశారు. ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేసి గెలిచారు. రెట్టింపు సంపాదించవచ్చని భావించారు. గెలిచాక చేతిలో చిల్లిగవ్వ లేదు. జిల్లా పరిషత్‌లో ఉన్న నిధుల గురించి తెలిశాక వారికి కంటిమీద కునుకులేదు. హామీల మేరకు మండలాల్లో ఏ పనులు చేపట్టాలో తెలియక జిల్లాలోని 39 జెడ్పీటీసీ, 656 ఎంపీటీసీ సభ్యుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిం ది. వీరి కంటే సర్పంచ్‌ల పరిస్థితే నయం.  పంచాయతీ కార్యాలయం,నిధులు, అధికారాలు ఇలా అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. కానీ జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు అవేవి లేక ఉత్సవ విగ్రహాల్లా మారారు. జెడ్పీలో కోట్లకు కోట్లు బడ్జెట్ ఉంటుందని ఆశించిన జెడ్పీటీసీలు అభివృద్ధి కార్యక్రమాలకే సరిపడని నిధులున్నట్లు తెలుసుకొని విస్తుపోతున్నారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చాలో తెలి యక, ప్రజల మధ్యకు వెళ్లలేక కిందామీదా పడుతున్నారు.  అధికారదాహంతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎంపీటీసీల పరిస్థి తి మరింత దయనీయంగా మారింది. అటువంటి వారిపై అనర్హత వేటుపడడం ఉన్న పదవీ పోయి.. ఎన్నికల్లో చేసిన ఖర్చు తిరిగి సంపాదించుకునే అవకాశం లేక.. దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అధికార పార్టీ సభ్యులుసైతం వారిని పట్టించుకోకపోవడంతో రెంటికీ చెడ్డ రేవడిలా మారారు.

   

  జెడ్పీలో రూ.12 కోట్లు నిధులు

   

  జిల్లా పరిషత్‌లో ప్రస్తుతం రూ.12 కోట్లు నిధులున్నాయి. 13వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.4.5 కోట్లు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రూ.1.5 కోట్లు, సాధారణ నిధులు రూ.5 కోట్లు ఇటీవలే విడుదలయ్యాయి. వీటితో పాటు తలసరి నిధుల కింద మరో రూ.కోటి వరకు వ చ్చింది. ఇంతకు మించి జిల్లా పరిషత్‌కు ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు వచ్చే అవకాశాలు లేవు. వీటిలో రూ.కోటి వరకు గ్రామీణప్రాంతాల్లో తాగునీటి సరఫరా కోసం వినియోగిస్తున్నారు.

   

  ఆందోళనలో సభ్యులు

   

  జెడ్పీటీసీ సభ్యుడు నిర్వహించే విధులు, బాధ్యతలు స్పష్టం చేయలేదు. మండల పరిషత్‌లలో వీరికి స్థానమే లేదు. ఎంపీపీకి ఓ కార్యాలయం ఉంటుంది. ప్రజల ఓట్లతో నేరుగా ఎన్నికయ్యే జెడ్పీటీసీలకు ఎటువంటి కార్యాలయం ఉండదు. ఎంపీపీ, జెడ్పీటీసీలు వేర్వేరు పార్టీలకు చెందిన వారైనప్పుడు ప్రొటోకాల్ వివాదాలు ఉంటాయి. ఒకప్పుడు జిల్లా ప్రణాళిక కమిటీలు ఉండేవి. వాటిల్లో జెడ్పీటీసీలు సభ్యులుగా ఉండేవారు. నిధుల వ్యయం, తదితర అంశాలపై కొంత అజమాయిషీ సాగేది. ఇప్పుడు ఈ కమిటీలను పూర్తిగా నిర్వీర్యం చేసి జిల్లాఅభివృద్ధి సమీక్ష మండలి(డీడీఆర్‌సీ)తో పెత్తనం కొనసాగిస్తున్నారు. మండల స్థాయిలోనూ ఎమ్మెల్యేల హవా ఎక్కువగా ఉంటోంది. ఇటు అధికారాలు లేక.. సంపాదించుకొనే మార్గాలు కానరాక జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు బొమ్మలుగా మారిపోయారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top