మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య కన్నుమూత

Former MP Chennupati Vidya passes away - Sakshi

రెండుసార్లు లోక్‌సభకు ఎంపిక

లబ్బీపేట (విజయవాడతూర్పు): మాజీ ఎంపీ, సంఘ సేవకురాలు, వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు చెన్నుపాటి విద్య (84) విజయవాడలోని ఆమె నివాసంలో శనివారం తెల్లవారు జామున  తుదిశ్వాస విడిచారు. ఆమె రెండుసార్లు విజయవాడ పార్లమెంటు సభ్యురాలిగా గెలుపొందారు. వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలిగా ఉన్న ఆమె పలు సంఘ సేవా కార్యక్రమాలను విస్తృతం గా నిర్వహించేవారు. అదే క్రమంలో మదర్‌థెరిస్సాను సైతం కలుసుకున్నారు. నాస్తికులైన గోరా, సరస్వతి గోరా దంపతులకు 1934లో జన్మించిన చెన్నుపాటి విద్య ఆరేళ్ల వయస్సులో 1940లో గాంధీజీ ఆశ్రమం సేవాగ్రమ్‌లో ఒకరోజు ఉన్నారు. ఆ సమయంలో జాతీయస్ఫూర్తిని అల వర్చుకున్న విద్య 1949లో కులాంతర వివాహం చేసుకుని సమాజంలో కుల నిర్మూలనకు శ్రీకారం చుట్టారు. 

రాజకీయ ప్రస్థానం 
చెన్నుపాటి విద్య తొలిసారిగా 1962లో గొల్లపూడి పంచాయతీ కో–ఆప్టెడ్‌ సభ్యురా లిగా నియమితులయ్యారు. అనంతరం 1967లో కృష్ణాజిల్లా పరిషత్‌ కో–ఆప్టెడ్‌ సభ్యురాలిగా పనిచేసిన ఆమె 1980–84, 1989–91 కాలంలో రెండుసార్లు పార్లమెంటు సభ్యురాలిగా పనిచేశారు. 

వాసవ్య మహిళా మండలితో..
సమాజంలో అసమానతలు రూపుమాపి, ఆర్థికాభివృద్ధి చెందేలా కృషి చేసేందుకు  1969లో గోరా, సరస్వతి గోరా వాసవ్య మహిళా మండలిని నాన్‌ గవర్నమెంట్‌ ఆర్గనైజేషన్‌గా రిజిస్ట్రేషన్‌ చేశారు. దానికి అధ్యక్షురాలిగా ఉన్న చెన్నుపాటి విద్య లెప్రసీ, క్షయ, ఎయిడ్స్‌ వంటి వ్యాధులపై  అవగాహన  కల్పిం చారు. గర్భనిర్ధారణ పరీక్షల నిర్మూలన, చైల్డ్‌ అండ్‌ ఉమెన్‌ అక్రమ తరలింపునకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ తుదిశ్వాస విడిచే వరకూ కృషిచేశారు. మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు సెల్ఫ్‌ డిఫెన్స్‌ మెథడ్స్‌పై శిక్షణ ఇచ్చేవారు. విద్య అంత్యక్రియలు సోమవారం నిర్వహిం చనున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top