రైతులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు పెట్టింది. ఇప్పటి వరకు అనధికారికంగా కోతలు విధిస్తున్న సర్కారు ఇక అధికారికంగానే ఆ పని చేయనున్నట్లు ప్రకటించింది. వ్యవసాయానికి ఇకపై ఏడు గంటలకు బదులు ఆరు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అందనున్నది.
కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: రైతులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు పెట్టింది. ఇప్పటి వరకు అనధికారికంగా కోతలు విధిస్తున్న సర్కారు ఇక అధికారికంగానే ఆ పని చేయనున్నట్లు ప్రకటించింది. వ్యవసాయానికి ఇకపై ఏడు గంటలకు బదులు ఆరు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అందనున్నది. పగలు మూడు గంటలు, రాత్రి మూడు గంటల చొప్పున రెండు విడతల్లో సరఫరా చేయనున్నారు.
ఆదివారం నుంచే ఈ విధానం అమలు కానుంది. చాలినంత సమయం కరెంట్ అందకపోనుండటంతో వ్యవసాయం ఇక రైతులకు భారం కానుంది. బావి, బోర్ల కింద సాగు ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ రబీలో పంటలు సాగు చేసిన రైతులకు మరిన్ని ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. మంత్రులు, ప్రజాప్రతినిధులకు రైతుల సమస్యలు పట్టడం లేదని, దీనిపై మౌసం వీడి విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.
నీరుగారిన ఉచిత విద్యుత్ హామీ:
రైతుల సంక్షేమం కోసం వ్యవసాయానికి 7గంటల పాటు ఉచిత విద్యుత్ అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అప్పట్లో తెలుగుదేశంపాటు ఇతర పార్టీలు సాధ్యం కాదని చెప్పినా 2004లో ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ ఫైలుపైనే తొలి సంతకం చేసి సాహసోపేతంగా ఆచరణలో పెట్టారు. అప్పటివరకు జిల్లాలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న రైతుల కోసం 5,085 కనెక్షన్లు మంజూరు చేసి వీటి కోసం రూ..39.74 కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుతం జిల్లాలో ఉచిత విద్యుత్ కనెక్షన్ల సంఖ్య లక్షకు పైగా ఉంది. కొంత కాలంగా థర్మల్ పవర్ ప్లాంట్లలో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణాలతో విద్యుత్ ఉత్పత్తి బాగా పడిపోయింది.
దీంతో జిల్లాలో అనధికారికంగా విద్యుత్ కోతలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రభావం వ్యవసాయ విద్యుత్‌పై కూడా తీవ్రంగా పడింది. ఇకపై ఏడు గంటల్లో గంట సేపు కోత పెట్టి ఆరు గంటలే ఇవ్వనున్నారు. ప్రకటించిన ఆరు గంటలు కూడా అమలు చేయడం ప్రశ్నార్థకమేనని, అందులో అనధికారికంగా కూడా కోతలు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఉచిత విద్యుత్ రైతులతోపాటు తాత్కాల్, రెగ్యులర్ కనెక్షన్లపై ప్రభావం చూపనుంది.