పెద్ద బీట్లు..పర్యవేక్షణకు ఫీట్లు!

The Forest Beat Area Is Higher In AP Compared To Other States - Sakshi

పొరుగు రాష్ట్రాలతో పోల్చితే ఏపీలోనే అటవీ బీట్‌ విస్తీర్ణం అధికం

పునర్వ్యవస్థీరణతోనే అడవుల రక్షణ సాధ్యమంటున్న అధికారులు

సాక్షి, అమరావతి: మామిడి కాయలు ఉన్నప్పుడు తోట రక్షణ కోసం పదెకరాలకు ఒక కాపరిని నియమిస్తారు.30–40 ఎకరాలకు ఒకే కాపరిని పెడితే నిఘా లోపించి, కాయలు దొంగల పాలవుతాయి. బహిరంగ కోశాగారంగా(ఓపెన్‌ ట్రెజరీ) పేర్కొనే అడవుల పరిరక్షణ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. చిన్న చిన్న బీట్లు ఉంటేనే కట్టుదిట్టమైన పర్యవేక్షణతో అటవీ సంపదను చక్కగా కాపాడుకోవచ్చు.పొరుగు రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లోనే సుదీర్ఘమైన అటవీ బీట్లు ఉన్నాయి.

సాధారణంగా ఒక్కో బీట్‌ పర్యవేక్షణకు ఒక్కో అధికారి ఉంటారు.ఎర్రచందనం, టేక్, రోజ్‌వుడ్‌ లాంటి అత్యంత విలువైన కలప ఉన్నందున రాష్ట్రంలో బీట్ల పరిమాణాన్ని పునర్‌వ్యవస్థీకరించాలని అటవీ శాఖ దశాబ్దాలుగా కోరుతోంది.గత ప్రభుత్వాలు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. సిబ్బంది కొరత, నిఘా లోపాలతో విలువైన కలపను స్మగ్లర్లు యథేచ్ఛగా కొల్లగొడుతున్నారని అధికారుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

సగటున 24.03 చదరపు కిలోమీటర్లకు ఒక బీట్‌ 
రాష్ట్రంలో 37,258 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవి విస్తరించి ఉంది. ఈ అడవిలో అత్యంత విలువైన వృక్ష సంపద నెలకొని ఉంది. ఇక అరుదైన జీవజాతులకు కొదవే లేదు. ఏపీలో మొత్తం 1,232 అటవీ బీట్లు ఉన్నాయి. పొరుగు రాష్ట్రాలతో పోల్చితే ఏపీలోనే పెద్ద బీట్లు ఉన్నాయి.

తెలంగాణ పోల్చితే ఏపీలో బీట్‌ పరిధి మూడు రెట్లు అధికంగా ఉంది. తెలంగాణలో సగటున 8 చదరపు కిలోమీటర్లకు (800 హెక్టార్లకు) ఒక బీట్‌ ఉండగా, ఏపీలో సగటున 24.03 చదరపు కిలోమీటర్లకు (2,400కు పైగా హెక్టార్లకు) ఒక బీట్‌ ఉంది. తమిళనాడులో 5.85 చదరపు కిలోమీటర్లకు ఒక బీట్‌ ఉంది.

బీట్‌ పరిధిని 15 చదరపు కిలోమీటర్లకు కుదిస్తాం.. 
‘‘అటవీ సంపద పరిరక్షణకు పకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఇందులో భాగంగా రాష్ట్రంలో అటవీ బీట్ల పరిధిని 15 చదరపు కి.మీలకు కుదించడంతోపాటు పోలీస్‌ స్టేషన్ల తరహాలో ఫారెస్టు స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అటవీ పరిరక్షణలో ఈ స్టేషన్లు కీలకపాత్ర పోషిస్తాయి. ప్రయోగాత్మకంగా వీటిని మొదట ఎర్రచందనం ప్రాంతాల్లో నెలకొల్పేందుకు ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేశాం’’ 
– ప్రతీప్‌ కుమార్,రాష్ట్ర అటవీ దళాల అధిపతి  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top