కలుషితాహారం కాటు

Food poison in government girls hostel

82 మంది విద్యార్థినులకు అస్వస్థత

23 మంది కాకినాడ తరలింపు

స్థానిక ప్రభుత్వాస్పత్రిలో

మిగిలినవారికి వైద్యసేవలు

కలుషితాహారం ప్రభావంతో జగ్గంపేట బీసీ బాలికల హాస్టల్‌ విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వారిని హుటాహుటిన ఆస్పత్రులకు తరలించి వైద్యసేవలందించారు. దాంతో హాస్టల్‌లోని మిగిలిన విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు.

జగ్గంపేట: ఉన్న ఊరు.. కన్నవారిని విడిచి చదువులకోసం వచ్చిన నిరుపేద బాలికలు వారు. ప్రభుత్వ వసతిగృహంలో ఉంటూ చదువుకుంటున్న వారు ఒక్కసారిగా అనారోగ్యానికి గురికావడంతో ఆందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. మన జిల్లాలోని ఏజెన్సీ, మెట్ట ప్రాంతాలనుంచి, విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చిన విద్యార్థినులు జగ్గంపేటలోని వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ బాలికల వసతిగృహంలో ఉంటూ ప్రభుత్వ పాఠశాల, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో చదువుకుంటున్నారు. ఫుడ్‌ పాయిజన్‌ (కలుషిత ఆహారం)తో  82మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 23మందికి వాంతులు, విరోచనాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉందని భావించిన స్థానిక వైద్యులు 108 వాహనాలలో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జగ్గంపేట బీసీ బాలిక వసతి గృహంలో మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు 131 మంది, ఇంటర్మీయెట్, డిగ్రీ  విద్యార్థినులు 50 మంది కలిపి మొత్తం 181మంది ఉంటున్నారు. వారిలో 11 మంది ఇళ్లకు వెళ్లగా 170మంది హాస్టల్‌లో ఉన్నారు.

బిర్యానీ, ఎగ్, బంగాళ దుంప కర్రీతోనే..
హాస్టల్‌ విద్యార్థినులకు ఆదివారం మధ్యాహ్నం బిర్యానీ, గుడ్డుతో బంగాళాదుంప కూర ఆహారంగా ఇచ్చారు. రాత్రి సాంబారు అన్నం పెట్టారు. దాంతో రాత్రికే పలువురు విద్యార్థినులు జ్వరాల బారిన పడ్డారు.  సోమవారం ఉదయం వారికి అల్పాహారంగా కిచిడీ పెట్టారు. అది తిన్న తరువాత విద్యార్థినులకు వాంతులు, విరోచనాలు కాసాగాయి. దాంతో వారిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న 23 మందిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.

పలువురి పరామర్శ
డీఎం అండ్‌హెచ్‌ఓ చంద్రయ్య, బీసీ సంక్షేమాధికారి చినబాబు, ఆర్డీఓ విశ్వేశ్వరరావు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కో ఆర్డినేటర్‌ ముత్యాల శ్రీనివాస్, తహసీల్దార్‌ శివమ్మ, రైతు కూలీ సంఘ నేత కర్నాకుల వీరాంజనేయులు తదితరులు ఆస్పత్రిలో విద్యార్థినులను పరామర్శించారు.

జీజీహెచ్‌లో పలువురి పరామర్శ
కాకినాడ క్రైం: కలుషితాహారంతో అస్వస్థతకు గురై కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న జగ్గంపేట బీసీ బాలికల హాస్టల్‌ విద్యార్థినులను సోమవారం పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పరామర్శించారు. బాధితులను ఎమర్జన్సీ విభాగంలోని క్యాజువాలిటీ, పీడియాట్రిక్‌ విభాగంలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితులను జెడ్పీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, కాకినాడ ఆర్డీవో ఎల్‌.రçఘుబాబు  పరామర్శించారు.  కలుషిత ఆహారంవల్లే అస్వస్థతకు గురయ్యారని, వారి ఆరోగ్యంపై ఎటువంటి భయాందోళనకు గురికావాల్సిన పనిలేదని వైద్యులు తెలిపారు. బాలికలు అస్వస్థతకు గురైన సంఘటనపై తక్షణమే విచారణ నిర్వహించి నివేదిక అందజేయాల్సిందిగా ఎపిడమిక్‌ సెల్‌ సిబ్బందిని జగ్గంపేట హాస్టల్‌కు పంపించినట్టు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కె,చంద్రయ్య తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే తాను స్వయంగా జగ్గంపేట ఏరియా ఆస్పత్రికి వెళ్లి బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు. 71 మంది అస్వస్థతకు గురికాగా 21మందికి మరింత మెరుగైన వైద్యం అందించేందుకు కాకినాడ జీజీహెచ్‌కు 108 అంబులెన్సులో తరలించినట్టు ఆయన తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనీ లేదన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top