తొలి రోజు హాజరైన ఫిషరీస్‌ అసిస్టెంట్‌ పోస్టు అభ్యర్థులు

First Day Certification Verification Held To Fishering Assistance Posts - Sakshi

సాక్షి, అనంతపురం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అర్హులైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన సోమవారం నుంచి ప్రారంభమైంది. తొలి రోజు షిఫరీస్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధువ్రీకరణ పత్రాలను అధికారులు పరిశీలించారు. జిల్లాలో 19 పోస్టులు భర్తీ కావాల్సి ఉండగా.. 834 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాతపరీక్షల్లో 65 మంది అర్హత సాధింంచారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రూల్‌ ఆఫ్‌ రోస్టర్‌లో 12 మంది అభ్యర్థులు మెరిట్‌ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వీరి ధ్రువీకరణ పత్రాలను జేసీ–2 సుబ్బరాజు, జెడ్పీ సీఈఓ శోభాస్వరూపరాణి, మత్య్స శాఖ డీడీ హీరా నాయక్‌ పర్యవేక్షణలో అధికారులు పరిశీలన చేశారు. భర్తీ కావాల్సిన మరో ఏడు పోస్టులకు సంబంధించి రెండో జాబితా విడుదల చేస్తారా? లేదా మరో నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారా తేలాల్సి ఉంది. కాగా, సాంకేతిక సమస్యల వల్ల సర్టిఫికెట్ల పరిశీలనలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది.
 
సమాచారం ఉన్న వారికే అనుమతి 
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు అర్హత సాధించినట్లు సంబంధిత శాఖల నుంచి ఎస్‌ఎంఎస్‌ లేదా ఈ–మెయిల్‌ అందుకున్న వారు మాత్రమే ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంది. ఈ విషయంపై ఇప్పటికే అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థి ఏ సెంటర్‌కు హాజరు కావాలి, ఎన్ని గంటలకు అనే సమాచారం వారి మొబైల్‌ ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ చేశారు. దీని ఆధారంగా అభ్యర్థులు తాము ఆన్‌లైన్‌లో ఇప్పటికే అప్‌లోడ్‌ చేసిన సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల నకళ్లను తీసుకుని హాజరు కావాల్సి ఉంటుంది.  

నేడు పరిశీలన జరిగే అవకాశమున్న శాఖలు 
మంగళవారం హార్టికల్చర్, సెరికల్చర్, అగ్రికల్చర్, అనిమల్‌ అస్బెండరీ, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలన జరిగే అవకాశం ఉంది. ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం అందుకున్న అభ్యర్థులు ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాలలో సర్టిఫికెట్లు పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది.   

అభ్యర్థులు ఆందోళన చెందవద్దు 
గ్రామ, వార్డు సచివాలయ పోస్టులు అర్హత సాధించిన అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలన విషయంగా ఆందోళన పడరాదు. కొన్ని అనివార్య కారణాల వల్ల నెట్‌వర్క్‌ సమస్యలు తలెత్తడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సోమవారం ఫిషరీస్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలన నిర్వహించాం. అలాగే ఇతర శాఖల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఎస్‌ఎంఎస్, మెయిల్‌ ద్వారా సమాచారం అందజేశాం. సమాచారం అందుకున్న వారు మాత్రమే సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియలోఎక్కడా ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. వదంతులు నమ్మరాదని అభ్యర్థులకు సూచిస్తున్నాం.    
– శోభాస్వరూపరాణి, సీఈఓ, జిల్లా పరిషత్‌  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top