ఉల్లి ధర ఢమాల్‌..రైతు ఫైర్‌ 

Farmers Protest For Onion Prices Decreased In Kurnool - Sakshi

వ్యాపారుల సిండికేట్‌ 

అమాంతం పడిపోయిన ఉల్లి ధరలు

ఆందోళనకు దిగిన రైతులు

సాక్షి, కర్నూలు : ధర క్రమేణా పెరుగుతుండడంతో సంతోషంగా ఉన్న ఉల్లి రైతులకు బుధవారం ఒక్కసారిగా షాక్‌ తగిలింది. వ్యాపారులు సిండికేట్‌ అయ్యి ఊహించని విధంగా ధర తగ్గించేయడంతో రైతులు భగ్గుమన్నారు. దేశం మొత్తమ్మీద ఉల్లి ధరలు పెరుగుతుండగా... కర్నూలు మార్కెట్‌లో మాత్రం తగ్గడానికి వ్యాపారులు సిండికేట్‌ కావడమే కారణమంటూ మూకుమ్మడిగా ఆందోళనకు దిగారు. రైతులు రెండు గ్రూపులుగా విడిపోయి ఆందోళన చేపట్టారు. కొందరు మార్కెట్‌ కమిటీ సెక్రటరీ కార్యాలయాన్ని ముట్టడించగా... మరికొందరు మార్కెట్‌ యార్డు ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపై పడుకోవడంతో పాటు బైఠాయించడంతో దాదాపు మూడు గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.  
ఉన్నట్టుండి తగ్గించేశారు! 
కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మంగళవారం ఉల్లి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.4,500 ధర పలికింది. దీంతో బుధవారం ఈ ఏడాది ఇంతవరకు లేని విధంగా మార్కెట్‌కు ఉల్లి పోటెత్తింది. దాదాపు 50 వేల ప్యాకెట్లు వచ్చింది. వ్యాపారులు ఉదయం 11 గంటలకు వేలం పాట మొదలు పెట్టారు. రూ.500తో ప్రారంభించి.. రూ.1,500తో ముగించారు. దాదాపు 20 లాట్లకు ఈ ప్రకారమే ధర పలికింది. ఒక్కసారిగా ధర పతనం కావడానికి వ్యాపారులు సిండికేట్‌ కావడమే కారణమని గుర్తించిన రైతులు వేలంపాటను బంద్‌ చేయించి ఆందోళనకు దిగారు. వందలాది మంది రైతులు రోడ్డెక్కడంతో ట్రాఫిక్‌  స్తంభించి పోయింది.

ఈ ఆందోళనకు జిల్లా రైతుసంఘం కార్యదర్శి జగన్నాథం మద్దతు ప్రకటించారు. నాల్గవ పట్టణ పోలీసులు వచ్చి సర్దిచెప్పినా రైతులు శాంతించలేదు. ‘గత ఏడాది వరకు రూ.400, రూ.500 ధరతో అమ్ముకుని నష్టాలను మూటగట్టుకున్నాం. అయితే.. నిన్నటి వరకు ధరలు మెరుగ్గా ఉండడంతో ఊరట చెందాం. ఈరోజు ఉన్నట్టుండి ధర పడిపోవడం తీవ్రంగా కలచివేసింది. వ్యాపారుల వైఖరే ఇందుకు కారణం’ అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

అధికారుల జోక్యం..వేలం పునఃప్రారంభం 
పోలీసులు జోక్యం చేసుకుని రైతులను మార్కెట్‌ కమిటీ సెక్రటరీ కార్యాలయానికి తీసుకెళ్లారు. మార్కెట్‌ కమిటీ సెక్రటరీ, పోలీసు అధికారులు కలిసి వ్యాపారులతో చర్చించారు. మార్కెట్‌ ధరలకు అనుగుణంగా కొనుగోలు చేస్తున్నామని వ్యాపారులు చెప్పారు. అయితే..రైతుల శ్రేయస్సును కూడా దృష్టిలో ఉంచుకోవాలని అధికారులు సూచించారు.  మధ్యాహ్నం మూడు గంటలకు వేలం పునః ప్రారంభమైంది. క్వింటాల్‌కు గరిష్టంగా రూ.3,460 వరకు ధర లభించింది. అయినప్పటికీ మంగళవారంతో పోలిస్తే రూ.1000కి పైగా ధర తగ్గింది.  

మిగిలిన యార్డుల్లోనూ ధర తగ్గింది 
తాడేపల్లిగూడెం, హైదరాబాద్‌ మార్కెట్లలో కూడా ఉల్లి ధర పడిపోయినట్లు కర్నూలు మార్కెట్‌ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. అక్కడ రూ.3,200 నుంచి రూ.3,300 వరకు గరిష్ట ధర ఉందని, ఇక్కడా దాదాపు అదే విధంగా పలికినట్లు చెప్పారు. వర్షాలు పడుతుండటంతో ఉల్లిలో తేమ శాతం ఎక్కువ కావడం వల్ల ధరలు తగ్గిపోయాయని, మళ్లీ పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఉల్లి ధరలపై రైతులు సంయమనం పాటించాలని సూచించారు.
చదవండి : భర్త హత్యకు భార్య కుట్ర 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top