జాగారమే.. | farmers facing problems with chaotic power supply | Sakshi
Sakshi News home page

జాగారమే..

Feb 11 2014 11:42 PM | Updated on Oct 16 2018 3:12 PM

సంగారెడ్డి,పుల్కల్,అందోల్,హత్నూర,టేక్మాల్,కొల్చారం,పాపన్నపేట,మెదక్, పెద్దశంకరంపేట, నిజామాబాద్ జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలాలకు చెందిన సుమారు 20 వేల మంది రైతులు నదిలో దిగుడు బావులు వేసుకొని వ్యవసాయం చేస్తున్నారు.

మెదక్, న్యూస్‌లైన్: మంజీర నది జిల్లాలో సుమారు 160 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. సంగారెడ్డి, పుల్కల్, అందోల్, హత్నూర, టేక్మాల్, కొల్చారం, పాపన్నపేట, మెదక్, పెద్దశంకరంపేట, నిజామాబాద్ జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలాలకు చెందిన సుమారు 20 వేల మంది రైతులు నదిలో దిగుడు బావులు వేసుకొని వ్యవసాయం చేస్తున్నారు. 7 గంటల పాటు విద్యుత్ ఇస్తామన్న ప్రభుత్వం కనీసం 5 గంట లు కూడా సరఫరా చేయకపోవడంతో అన్నదాతల కష్టాలు వర్ణనాతీతం.

బ్రేక్‌డౌన్‌లు, లోడ్ రిలీఫ్‌ల పేరిట కరెంట్ గంటపాటు కూడా నిరంతరాయంగా సరఫరా చేయలేని పరిస్థితి నెల కొంది. రెండు విడతల కరెంట్ కూడా ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి నెలకొంది. దీంతో రైతన్నలు ఇంటిల్లిపాదికి దూరంగా సాగునీరే సర్వస్వంగా పొలాల వద్ద రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తున్నారు.  

 కారుచీకట్లో..
 రాత్రివేళ కరెంట్ కోసం వేలాది మంది రైతులు మంజీర ఒడిలోనే జాగారం చేస్తున్నారు. నదీగర్భంలో ఇసుక మేటలు తవ్వి, రింగులు వేసి జలసిరిని ఒడిసిపడుతున్నారు. విద్యుత్ మోటార్లతో పంట పొలాలకు ప్రాణం పోసేందుకు నానాపాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో విద్యుత్ మోటార్ల కనెక్షన్ కోసం నేలపైనే పరిచిన కరెంట్ తీగలు పలుచోట్ల తెగిపోయి కాలనాగులై కాటేస్తున్నాయి.

కటిక చీకట్లో కనిపించక కాలు వేస్తే చాలు.. కాటికే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. నదిలో సుమారు 12 ఫీట్ల లోతున వేసిన రింగు బావుల్లోకి రైతులు అర్ధరాత్రి దిగి మోటార్ ఫుట్‌వాల్వ్‌లను సరిచేస్తున్నారు. స్టార్టర్ బాక్స్ చెడిపోయిన..ఫ్యూజ్‌వైర్ పోయినా..చిమ్మ చీకట్లోనే మరమ్మతులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రైతన్నలు రింగుబావుల్లో జారిపడి, కరెంట్ షాక్‌లకు, విషపురుగుల కాట్లకు గురై మృత్యువాత పడుతున్న సంఘటనలెన్నో ఉన్నాయి. పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లి గ్రామానికి చెందిన మంగలి శేఖర్(25) అనే కౌలురైతు 2012 ఫిబ్రవరి 3న రాత్రి రింగుబావిలోకి దిగే క్రమంలో మృత్యువాత పడ్డాడు.

గత ఏడాది సెప్టెంబర్‌లో అదే గ్రామానికి చెందిన పిల్లి వెంకటేశం అనే రైతు విద్యుత్‌షాక్‌తో మృతి చెందాడు. కొడుపాకకు చెందిన కంకణాల ప్రతాప్(36), సందిల రాములు(35), మంగళి రాములు(25) అసువులు బాశారు. అయినప్పటికీ రైతన్నలకు ఎలాంటి ఆర్థికసాయం అందలేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. వేసవికాలం వస్తే ఘనపురం ప్రాజెక్ట్ దిగువన మంజీర నదిని జల్లెడ పడుతూ రైతన్నలు నీటిబొట్టుకోసం యుద్ధం చేస్తుంటారు. 7 గంటల నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తే మాకు  ఈ పరిస్థితి ఉండదని రైతులు వాపోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement