నేలతల్లి ఒడిలోనే.. 

Farmer Died Heart Attack In Kurnool - Sakshi

ఆత్మకూరు రూరల్‌: పగలనక రేయనక శ్రమజల్లులు కురిపించి.. కండలు కరిగించి, బతుకు పంటలు పండించి.. కాలమంతా కాడిపైనే గడిపిన ఓ మట్టి మనిషి ఆ నేలతల్లి ఒడిలోనే ఐక్యమయ్యాడు. ఆకుపచ్చని పొలంలో కాడిని ముద్దాడుతూనే కాలం తీరిపోయాడు. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం నల్లకాల్వ గ్రామంలో బుధవారం సాయంత్రం పెద్ద హుసేన్‌(70) అనే రైతు తన పొలంలో సేద్యం చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. హృదయ విదారకరమైన ఈ ఘటన గ్రామస్తులను కలచివేసింది. హుసేన్‌ గ్రామానికి సమీపంలోని పొలంలో మొక్కజొన్న సాగు చేశాడు.

బుధవారం తన భార్య రహమత్‌బీతో కలసి  పొలానికి వెళ్లారు. అక్కడ మొక్క జొన్న చేలో ఎద్దులతో అంతర్గత సేద్యానికి ఉపక్రమించారు. ఇంకో రెండు మొలకలు తిరిగితే పని పూర్తవుతుందనుకుంటుండగా ఎద్దులను అదిలిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తన కళ్లముందే భర్త కుప్పకూలడంతో రహమత్‌బీ సాయం కోసం పెద్దగా కేకలు వేస్తూ గుండెలవిసేలా రోదించింది. పక్క పొలాల్లోని వారు పరుగున అక్కడికొచ్చి చూసేలోపే ప్రాణం విడిచాడు. ఎప్పుడూ పొలం పని తప్ప ఇతర విషయాలేవీ పట్టించుకోని రైతు హుసేన్‌ హఠాన్మరణం గ్రామంలో విషాదం నింపింది. ఈయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top