కాటేసిన కరెంటు తీగ

Farmer Death With Power Wire West Godavari - Sakshi

విద్యుదాఘాతంతో రైతు మృతి

అంకాలంపాడులో ఘటన

పశ్చిమగోదావరి, కామవరపుకోట (చింతలపూడి): కరెంట్‌ తీగలకు మరో రైతు బలయ్యాడు. పశువులకు  మేత వేసి పాలు తీసుకురావడానికి  వెళ్లిన వ్యక్తిని విద్యుత్‌ తీగ మృత్యురూపంలో కబళించింది. కామవరపుకోట మండలం అంకాలంపాడు గ్రామానికి చెం దిన దొప్పసాని నాగేశ్వరరావు (42) అనే రైతు తన ఎకరాన్నర ఆయిల్‌పామ్‌ తోటలో గేదెలకు దాణా పెట్టి పాలు తీసుకురావడానికి బుధవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లాడు. తోట సమీపంలో అతడిపై 11 కేవీ విద్యుత్‌ కండక్టర్‌ వైరు తెగి పడటంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. శరీరం కాలిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. సమీప పొలంలో ఉన్న నాగేశ్వరరావు అన్న పగిడియ్య తమ్ముడి కేకలు విని వచ్చేసరికి ప్రమాదం జరిగిపోయింది.

విషయం తెలిసిన కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతునికి భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. నాగేశ్వరరావు మృతితో వా రంతా అనాథలయ్యా రు. నాగేశ్వరరావు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త కావడంతో పార్టీ నాయకులు పలువురు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మృతుని భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తడికలపూడి ఏఎస్సై సత్యనారాయణ తెలిపారు.

వైఎస్సార్‌ సీపీ నాయకుల పరామర్శ
సంఘటనా స్థలానికి చేరుకున్న వైఎస్సార్‌ సీపీ ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్‌ మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుని కుటుంబసభ్యులకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందించారు. పార్టీలో నిబద్ధత గల కార్యకర్తగా నాగేశ్వరరావు పనిచేశాడన్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యంతోనే..
నాగేశ్వరరావు మృతదేహాన్ని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘంటా మురళీరామకృష్ణ సందర్శించి నివాళులర్పించారు. మృతుని ఇద్దరు పిల్లలను ప్రభుత్వమే చదివించి, భార్యకు అంగన్‌వాడీ టీచర్‌ పోస్టు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యం వల్ల ఏటా రైతులు విద్యుత్‌ ప్రమాదాల్లో మృతి చెందుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. శిథిలావస్థకు చేరుకున్న విద్యుత్‌ కండక్టర్‌ తీగలను వెంటనే తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top