
పచ్చతోరణం
విశాఖలో బుధవారం జరిగిన మంత్రి గంటా శ్రీనివాసరావు కుమార్తె సాయిపూజిత వివాహ వేడుక భవిష్యత్ రాజకీయ పరిణామాలను చూచాయగా వెల్లడించే వేదికైంది.
=గంటా చుట్టూ తిరిగిన టీడీపీ సమీకరణాలు
=తీరు మారని అయ్యన్న.. పెళ్లికి దూరం
=నేతల వైఖరి క ళ్లకు కట్టిన కళ్యాణ వేడుక
విశాఖలో బుధవారం జరిగిన మంత్రి గంటా శ్రీనివాసరావు కుమార్తె సాయిపూజిత వివాహ వేడుక భవిష్యత్ రాజకీయ పరిణామాలను చూచాయగా వెల్లడించే వేదికైంది. ఇది పూర్తిగా గంటా కుటుంబ కార్యక్రమం అయినా రాబోయే రోజుల్లో ఎవరెటు అనే విషయం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కళ్లకు కట్టింది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి లాంటి అనేక మంది రాజకీయ ప్రముఖులు హాజరైనా రాజకీయ వర్గాల ఊహాగానాలన్నీ చంద్రబాబు- గంటా చుట్టూనే తిరిగాయి. మంత్రి బాలరాజు సీఎం కిరణ్‌తో సహా వివాహానికి హాజరు కావడం, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుతో పాటు ఆయన మద్దతుదారులైన నాయకులు విశాఖలోనే ఉన్నా మర్యాదపూర్వకంగానైనా పెళ్లికి హాజరు కాకపోవడం ఈ మొత్తం ఎపిసోడ్‌లో హైలెట్స్.
విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి : రాష్ట్రాన్ని చీల్చాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి మిగిలిన కాంగ్రెస్ నాయకుల్లానే గంటా శ్రీనివాసరావుకు కూడా రాజకీయ జ్వరం పట్టుకుంది. దీంతో ఎటో ఒక వైపు వెళ్లడమే మంచిదనే నిర్ణయానికి వచ్చిన ఆయన కచ్చితంగా ఎటు వెళ్లాలి?, ఏ స్థానం నుంచి పోటీకి దిగాలి? అనే విషయంలో గందరగోళంలోనే ఉన్నారు. ఎన్నికల నాటికి రాజకీయం ఏ మలుపైనా తీసుకోవచ్చని, ఎవరైనా తన ను పిలిచి అవకాశం ఇవ్వొచ్చనే అంచనాతో ఉన్న ఆయన ఎక్కడికక్కడ కర్చీఫ్‌లు వేసి చోటు రిజర్వ్ చేసుకునే రాజకీయం నడుపుతున్నారు.
కొత్త పార్టీ గురించి జరుగుతున్న ఆలోచనలు కూడా ఆయన్ను ఈ రకమైన అడుగులు వేయిస్తున్నాయని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం వర్గాలు మాత్రం గంటా అండ్ గ్రూప్ తమ పార్టీలో చేరడం ఖాయమనే వాదన గట్టిగా వినిపిస్తున్నాయి. గంటాపై పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతుండడం, మరో ముఖ్యనేత బండారు సత్యనారాయణమూర్తి సానుకూలంగా ఉండడం కూడా టీడీపీలో జరగబోయే పరిణామాలను అంచనా వేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి.
గంటా రాక పట్ల తనకున్న వైఖరిని మరో సారి అధినేతకు స్పష్టం చేసేందుకే అయ్యన్న బుధవారం విశాఖలోనే ఉన్నా వివాహ వేడుకకు రాలేదు. బండారు సత్యనారాయణమూర్తితో పాటు ఆయన మద్దతుదారులైన నేతలంతా పెళ్లికి వెళ్లడం టీ డీపీలోని గ్రూపు రాజకీయాన్ని రక్తి కట్టించింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పెళ్లికి హాజరై చాలా సేపు గడపడం ద్వారా తన నిర్ణయం ఎలా ఉంటుందనే విషయాన్ని పార్టీ నేతలకు చెప్పకనే చెప్పారు. మంత్రి గంటాపై ఒంటి కాలిపై లేస్తున్న మంత్రి బాలరాజు వివాహానికి హాజరు కావడం విశేషం.
పైగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటే ఆయన వివాహ వేదిక వద్దకు రావడం చర్చనీయాంశమైంది. గంటా, కిరణ్‌లను లక్ష్యంగా చేసుకుని ఇటీవల విమర్శనాస్త్రాలు సంధిస్తున్న బాలరాజు తీరు సైతం ఆ పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంలో అసలే గందరగోళంలో ఉన్న గంటా ఈ పరిణామాలన్నింటినీ ఎలా పరిగణిస్తారు?.. భవిష్యత్‌లో ఎలాంటి రాజకీయం నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉంది.