నీరసంగా గర్జన | Dull void | Sakshi
Sakshi News home page

నీరసంగా గర్జన

Mar 13 2014 3:18 AM | Updated on Sep 2 2017 4:38 AM

నీరసంగా గర్జన

నీరసంగా గర్జన

లక్షల మందితో జరుగుతుందనుకున్న తెలుగుదేశం ప్రజా గర్జన తుస్సుమనిపించింది.

 విశాఖపట్నం:  లక్షల మందితో జరుగుతుందనుకున్న తెలుగుదేశం ప్రజా గర్జన తుస్సుమనిపించింది. జన స్పందన లేని చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం బోరు కొట్టించింది. గంటా బృందం చేరికను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్న అయ్యన్న పాత్రుడి ‘పంచ్’ల ప్రసంగం పార్టీ పెద్దలకు చెమటలు పట్టించింది. ముచ్చటగా మూడోసారి మారిన వేదికపై మూడున్నర లక్షల మందితో భారీగా జరుగుతుందని చెప్పిన ప్రజాగర్జనకు ముప్పైవేల మంది కూడా హాజరుకాకపోవడంతో తెలుగుదేశం నేతలు నిరుత్సాహపడ్డారు.

తొలుత ఏయూ మైదానంలో ఆ తర్వాత బీచ్‌రోడ్‌లో మూడున్నర లక్షల మందితో భారీగా జరుపతలపెట్టిన సభను వన్‌టౌన్ మున్సిపల్ స్డేడియానికి మార్చిన సంగతి తెలిసిందే. మున్సిపల్ స్డేడి యం చిన్నదైనందున గర్జన సభకు తరలివచ్చే మూడున్నల లక్షల మంది అందులో పట్టరన్న కారణంగా బయట ఎల్‌సీడీ స్క్రీన్‌లను ఏర్పా టు చేస్తున్నట్లు పార్టీ నేత గరికపాటి మోహనరావు మంగళవారం   సాయంత్రం విలేకరుల సమావేశంలో చెప్పారు. సభా వేదిక బయట ఎల్‌సీడీల ఏర్పాటు చేయకపోగా, సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎల్‌సీడీలను తిలకించేంత జనం రాకపోవడం గమనార్హం.

30 వేల మంది పట్టే స్డేడియం సగం ఖాళీగా కనిపించింది. 22 వేల సామర్థ్యం ఉన్న గ్యాలరీల్లో సగం ఖాళీగా కనిపించాయి. చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగంతో బోరు కొట్టించారు. ఆయన ప్రసంగానికి కార్యకర్తల నుంచి స్పందన కరువైంది. ఆయన ప్రసంగం ప్రారంభించగానే మహిళలు వెళ్లిపోవడం కనిపించింది. పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గంటా బృందాన్ని చేర్చుకొనేందుకు ఏర్పాటు చేసిన ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ ఐదు సంవత్సరాల్లో కాంగ్రెస్ అధినేత్రి అవినీతి కొండలను పెంచి పోషించిందని వ్యాఖ్యానించి వీరికే షాక్ ఇచ్చారు.

మొదటి నుంచి గంటా బృందానికి చుక్కలు చూపిస్తున్న అయ్యన్న తన ప్రసంగంతో చంద్రబాబుకే చెమటలు పట్టించారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వెంట ఉన్న కార్యకర్తలను ఎన్నికల సమయంలో విస్మరిస్తే పార్టీకి  భవిష్యత్ ఉండదని, ఇప్పుడు పార్టీలో చేరే నేతలు ఐదేళ్లపాటు పార్టీలో ఉండాలని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయ్యన్న ప్రసంగిస్తుండగా గంటా హడావుడిగా గరికపాటి వద్దకు వెళ్లి మంతనాలు జరిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement