ఏదైనా వారం తర్వాతే.. | Sakshi
Sakshi News home page

ఏదైనా వారం తర్వాతే..

Published Thu, May 9 2019 11:13 AM

Doctors And Staff Negligence on Patients - Sakshi

అనంతపురం న్యూసిటీ: వైద్యులను దేవుళ్లతో సమానంగా చూస్తారు. కానీ ప్రాణం పోయాల్సిన  వైద్యులే...రోగుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. సర్వజనాస్పత్రికొచ్చే వారికి బతికుండగానే నరకం చూపుతున్నారు. పట్టించుకోవాల్సిన ఉన్నతాధికారులు ఛాంబర్‌లతో పరిమితం కాగా..నిరుపేద రోగులు పడరాని పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా రేడియాలజీ విభాగంలోని వైద్యుల నిర్లక్ష్యం..రోగుల ప్రాణం మీదకు తెస్తోంది. ఎమర్జెన్సీ కేసులకు కూడా వాయిదా వేస్తుండటంతో... సదరు రోగిని పరీక్షించిన వైద్యులే కలుగజేసుకుని స్కాన్‌ చేసి పంపాలని బతిమాడాల్సిన పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ ‘‘ఇవాల్టికి ఇంతే.. మీరు పది రోజుల తర్వాత రండి’’ అంటూ రేడియాలజీ విభాగంలోని వైద్యులు తెగేసి చెబుతున్నారు. దీంతో అమాయక రోగులు తమ బాధను ఎవరికి చెప్పుకోలేక దేవుడా ఇదేం ఖర్మయ్యా అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. 

ఎవరు చెప్పినా పట్టించుకోరు
ఆస్పత్రిలోని రేడియాలజీ విభాగంలోని వైద్యులకు రోగుల ప్రాణాలంతే లెక్కేలేకుండా పోయింది. వారికి ఓపిక ఉంటేనే ఇక్కడ సేవలందుతాయి. మెడిసిన్, సర్జరీ, ఆర్థో, గైనిక్‌ తదితర వైద్యులు ప్రిస్కిప్షన్‌పై స్కాన్‌ చేయాలని రాసినా... వారు పట్టించుకోరు. అడ్మిషన్‌లో ఉన్న కేసులను వెనక్కి పంపుతున్నారు. దీంతో చాలా మంది రోగులు ప్రైవేటు బాట పట్టి జేబులకు చిల్లు పెట్టుకుంటున్నారు. 

ఎఫ్‌ఎస్‌ 4లో అడ్మిషన్‌లో ఉన్న 10 ఏళ్ల వసంతలక్ష్మికి వైద్యులు అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ రెఫర్‌ చేశారు. కానీ రేడియాలజిస్టు ఈ నెల 24వ తేదీ రావాలని చెప్పారు. దీంతో ఆ పాప అవ్వ ‘‘అయ్యా మీకు పుణ్యముంటుంది. ఆ పరీక్ష చేస్తే ఆపరేషన్‌ చేస్తారని డాక్టరమ్మ చెప్పింది..కొంచెం త్వరగా చూడయ్యా’’ అని సిబ్బందిని వేడుకోగా..9వ తేదీ రావాలని చెప్పారు. 10 నిమిషాల్లో చేసే పనికి కూడా 10 రోజుల తర్వాత రావాలని చెబుతుండటంతో ఆస్పత్రిలో ఉండలేక రోగులు, వారి బంధువులు ఇబ్బందులు పడుతున్నారు.

ఇక్కడ స్ట్రెచర్‌పై పడుకున్న వ్యక్తి పేరు గోపాల్‌. సీకేపల్లి మండలం ముష్టికోవెల. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలోని ఎంఎం వార్డులో చేరారు. గోపాల్‌ను పరీక్షించిన ఓ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ త్వరగా అల్ట్రాస్కౌండ్‌ స్కాన్‌ చేయించాలని.....కేస్‌ షీట్‌పై ఎమర్జెన్సీ అని రాసి పంపారు. దీంతో గోపాల్‌ కుమారులు అతన్ని అల్ట్రాసౌండ్‌ స్కాన్‌కి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు ఈ రోజు కాదని చెప్పారు. దీంతో వారు తండ్రిని తీసుకుని వార్డుకు వెళ్లగా.. అక్కడి వైద్యుడు ‘ఇది అర్జెంటయ్యా తొందరగా స్కానింగ్‌ చేయించండి’’ అని చెప్పారు. మరోసారి గోపాల్‌ను తీసుకుని వెళ్లినా.. పరిస్థితి వివరించినా రేడియాలజీ వైద్యులు పట్టించుకోలేదు. దీంతో వారు ఆర్‌ఎంఓ డాక్టర్‌ జమాల్‌బాషాకి ఫిర్యాదు చేశారు. అక్కడే ఉన్న అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వీరభద్రయ్య సైతం గోపాల్‌ పేగుకి రంధ్రం పడిందని, త్వరగా స్కాన్‌ చేయించాలని ఆర్‌ఎంఓకి చెప్పారు. చివరకు ఆర్‌ఎంఓ రేడియాలజీ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్‌ రాజేంద్రనాయుడికి ఫోన్‌ చేసి సమస్యను వివరించగా..ఆయన అప్పుడు కరుణించి అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేశారు. సర్వజనాస్పత్రిలోని రేడియాలజీలో అందుతున్న సేవలకు ఇదో ఉదాహరణ మాత్రమే.

Advertisement
Advertisement