ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల తరలింపు, పిల్లల స్థానికత అంశంపై రాష్ట్ర సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సమీక్ష నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల తరలింపు, పిల్లల స్థానికత అంశంపై రాష్ట్ర సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఉద్యోగుల పిల్లల స్థానికతకు సంబంధించి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఏకాభిప్రాయ కుదరనందున కేంద్రానికి లేఖ రాయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగుల పిల్లల స్థానికత వివాదంపై అడ్వకేట్ జనరల్ నుంచి అందిన నివేదికపై సీఎస్ సమీక్ష జరుపుతున్నారు.
ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగుల విభజన జనాభా ప్రాతిపదికన జరగాలని, అలా జరగని పక్షంలో పంపిణీ సంస్థలపై ఆర్థిక భారం మూసివేతకు దారి తీయవచ్చని ఏపీ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఆస్తుల, అప్పుల విభజన, ఉద్యోగుల విభజన కలిపి ఒకేసారి చేయాలని, పునర్విభజన చట్టం ప్రకారం ఉద్యోగుల విభజన పరస్పర చర్చల ద్వారానే జరగాలి తప్ప, ఏకపక్షంగా కాదని.. తెలంగాణ ప్రభుత్వం చేసిన ఉద్యోగుల విభజన తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని బుధవారం హైకోర్టులో జరిగిన వాదనల సందర్భంగా ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.