వ్యవసాయమెలా?! | crop loans in the wake of the announcement of its renewal | Sakshi
Sakshi News home page

వ్యవసాయమెలా?!

May 22 2014 1:56 AM | Updated on Jul 28 2018 6:33 PM

చంద్రబాబు రుణమాఫీ ప్రకటన నేపథ్యంలో పంట రుణాల రెన్యువల్, కొత్త రుణాల పంపిణీకి బ్రేక్ పడింది. మరోవైపు విత్తన పంపిణీపై స్పష్టమైన వైఖరి తేలకపోవడంతో ‘అనంత’ రైతన్నలు అడకత్తెరలో చిక్కుకున్నారు. ముఖ్యంగా రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు.

 అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ :  చంద్రబాబు రుణమాఫీ ప్రకటన నేపథ్యంలో పంట రుణాల రెన్యువల్, కొత్త రుణాల పంపిణీకి బ్రేక్ పడింది. మరోవైపు విత్తన పంపిణీపై స్పష్టమైన వైఖరి తేలకపోవడంతో ‘అనంత’ రైతన్నలు అడకత్తెరలో చిక్కుకున్నారు. ముఖ్యంగా రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయాన్ని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా ప్రకటించడంతో ఇప్పుడు అందరి దృష్టి దానిపైనే పడింది.
 
 రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న వ్యవసాయ, బంగారు నగల తాకట్టుపై రుణాలను ఎంతవరకు మాఫీ చేస్తారనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. రైతులకు సంబంధించిన అన్ని రకాల రుణాలు మాఫీ చేస్తారా? లేక చిన్న, సన్నకారు రైతుల రుణాలేనా?.. రూ.లక్ష లోపున్న రుణాలు రద్దు చేస్తారా? లేదా గతేడాది రెన్యువల్ చేసుకున్న రుణాలు మాత్రమే మాఫీ చేస్తారా?... ఈ తరహా ప్రశ్నలు ప్రతి రైతులోనూ తలెత్తుతున్నాయి. ఖరీఫ్ పంట రుణాల రెన్యువల్, కొత్త రుణాలు తీసుకునే సమయం ఆసన్నం కావడంతో రైతుల్లో  రోజురోజుకూ ఉత్కంఠ పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా 33 ప్రిన్సిపల్ బ్యాంకులు ఉన్నాయి. వాటి పరిధిలోని 404 బ్యాంకు శాఖల్లో రైతుల ఖాతాలు ఉన్నాయి.
 
 కేవలం పంట రుణాల కింద 8,37,780 మంది రైతుల ఖాతాలు ఉండగా.. రూ.5,277 కోట్ల రుణాలు తీసుకున్నారు. ఇందులో మొండిబకాయిలు (ఓవర్‌డ్యూ) 76,341 ఖాతాల కింద రూ.598.32 కోట్లు ఉన్నాయి.  అలాగే 2,12,057 మంది రైతులు పట్టాదారు పాసు పుస్తకం ఆధారంగా బంగారు నగలను తాకట్టు పెట్టి రూ.1,851 కోట్ల రుణాలు తీసుకున్నారు. ఇందులో 12,461 మంది రైతులు ఓవర్‌డ్యూ ఉన్నారు. వారు చెల్లించాల్సిన మొత్తం రూ.275 కోట్లు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ), స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), సిండికేట్, కెనరా, ఆంధ్రా, జిల్లా  సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) తదితర బ్యాంకుల్లో ఎక్కువగా రైతుల రుణాలు ఉన్నాయి. మొత్తమ్మీద వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించి 10,24,577 మంది రైతులు రూ.6,817 కోట్ల బ్యాంకు రుణాలు తీసుకున్నారు. 1,19,182 మంది రూ.951.15  కోట్ల ఓవర్‌డ్యూ ఉన్నారు.
 
 పూర్తి ధరతో వేరుశనగపై రైతుల అనాసక్తి
 ఏటా ఖరీఫ్‌లో రైతులకు అవసరమైన విత్తనాలను రాయితీతో పంపిణీ చేస్తూ వచ్చారు. ఈ సారి మాత్రం తొలుత పూర్తి ధరతో కొనుగోలు చేస్తే తరువాత రాయితీ జమ చేస్తామని మెలికపెట్టారు. వరుస పంట నష్టాలతో ఆర్థికంగా చితికిపోయిన తాము పూర్తి ధర పెట్టి విత్తనకాయలు కొనలేమంటూ రైతుల ఆనాసక్తి ప్రదర్శిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో క్వింటా వేరుశనగ ధర కాస్త అటూ ఇటుగా రూ.3,500 ఉంది. ప్రభుత్వం మాత్రం రూ.4,600 నిర్ణయించింది. క్వింటాపై రూ.1,500 రాయితీ ప్రకటించినా... తొలుత పూర్తి ధరతో కొనాలని చెప్పడంతో రైతులు మండిపడుతున్నారు.
 
 విత్తన పంపిణీకి మంగళం పాడేందుకే ఇలాంటి నిబంధనలు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. జిల్లాకు 3.50 లక్షల క్వింటాళ్ల విత్తన వేరుశనగ కేటాయించారు. సేకరణ సంస్థలు మాత్రం నామమాత్రంగా సరఫరా చేసే పరిస్థితి ఉంది. ఇక ఎరువుల ధరలు అందుబాటులో లేకపోవడంతో ఇటీవల రైతుల కొనుగోలు శక్తి బాగా తగ్గిపోయింది. మూడు బస్తాలు వాడేచోట ఒక బస్తా ఎరువుతో సరిపెడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement