కరోనా అలర్ట్‌: ‘24 కేసుల్లో 20 నెగెటివ్‌ అని తేలింది’

Covid 19 If You Find Virus Symptoms Dial 104 Says AP Government - Sakshi

సాక్షి, అమరావతి: కరోన వైరస్‌ (కోవిడ్‌-19) వ్యాప్తిపై ఎవరూ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఎవరికీ సోకలేదని వెల్లడించారు. మరో నాలుగు కేసుల విషయంలో కరోనా ఉందో లేదో పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. ఏపీలో కరోనా వైరస్‌ కేసులపై శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తిరుపతిలో కరోన అనుమానిత కేసు నెగెటివ్‌ వచ్చిందని గుర్తు చేశారు.
(చదవండి: కరోనా: హృదయ విదారక చిత్రం..)

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు మూడు గంటలు పాటు కరోన వైరస్‌పై సమీక్షించారని అన్నారు. అన్ని ఆస్పత్రుల్లో మందులు, మాస్కులు అందుబాటులో ఉన్నాయని, అధిక ధరలకు మాస్కులు అమ్ముతున్న వారిపై నిన్న ఉదయం నుంచి అధికారులు దాడులు  చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. కరోనా లక్షణాలుగా భావించిన 24 కేసుల్లో 20 కేసులు కరోన కాదని తేలిందని చెప్పారు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్రం ఇచ్చే ప్రత్యేక శిక్షణకు ఏపీ నుంచి అధికారులను పంపామని తెలిపారు. వైరస్‌ వ్యాప్తిపై సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మొద్దని మంత్రి స్పష్టం చేశారు.
(చదవండి: కోవిడ్‌ను జయించిన శతాధిక వృద్ధుడు)

వదంతులు నమ్మొద్దు..
కరోన వైరస్‌పై ముఖ్యమంత్రి వైస్‌ జగన్‌ ప్రతిరోజు రివ్యూ చేస్తున్నారని సీఎం ప్రత్యేక కార్యదర్శి పీవీ రమేశ్‌ తెలిపారు. ఈ వైరస్‌ను ఎదుర్కోనేందుకు రాష్ట్ర యంత్రాంగం అన్ని విధాలా సంసిద్ధంగా ఉందని అన్నారు. కరోన సోకితే జ్వరం, దగ్గు, రొంప, ఒళ్లు నొప్పులు వస్తాయని, వైరస్‌ బారిన పడిన వ్యక్తి మన రాష్ట్రానికి వస్తే అతని ద్వారా ఇతరులకు వ్యాపించే అవకాశం ఉందని తెలిపారు. చికెన్ సహా ఇతర మాంసాహరాల ద్వారా కరోనా వ్యాపిస్తుందనే వదంతులు నమొద్దని చెప్పారు. విదేశాలకు వెళ్లిన వారికి ఈ వ్యాధిని సంక్రమిస్తే.. ఊపిరిత్తులు, గొంతు ఇన్ఫెక్షన్లు వస్తాయని తెలిపారు. వైరస్‌ సోకిన వారికి జలుబు చాలా తక్కువ ఉంటుందని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ముఖ్యంగా ఫిబ్రవరి 10 తరువాత రాష్ట్రానికి వచ్చినవారు 104 కు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవాలని, కనీసం 14 నుంచి 28 రోజులు ఇంట్లోనే ఉండాలని సూచించారు.

104కు సమాచారం ఇవ్వండి..
పీపీ రమేశ్‌ మాట్లాడుతూ.. ‘మీ ఇంటివద్ద నుంచే రక్త నమూనాలను తీసుకుని  పంపిస్తాం. తుమ్మడం, దగ్గడం వల్ల కరోన వైరస్‌ వ్యాపించవచ్చు. రోగి చేతులు వేసిన బల్లపై చేతులు వేయడం.. వాటిని ముఖానికి తాకించుకోవడంతో వైరస్‌ సోకుతుంది. డోర్ నోబ్స్‌, ఎస్కలేటర్‌ వంటివి వ్యాధి సోకిన వారు ముట్టుకోవద్దు. అంబులెన్స్‌ను కూడా పూర్తిగా డిస్‌ఇన్‌ఫెక్ట్‌ చేసి మరో రోగిని తీసుకురావడానికి వాడుతున్నాం. మీడియా, సోషల్ మీడియా వాస్తవాలనే రిపోర్టు చేయాలి. పేషంట్‌ పేరు, ఫోటోలు, వారి ఊరు పేర్లు వెల్లడించకూడదు. విపరీతమైన దగ్గు,  జ్వరం, ఒళ్లు నొప్పులు ఉన్నవారు 104 కి కాల్ చేసి సమాచారం ఇవ్వండి’అని పేర్కొన్నారు.
(చదవండి: కరోనా అలర్ట్‌: కేంద్ర సిబ్బంది శాఖ కీలక నిర్ణయం!)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top