సాయంపాలెంలో మానని గాయం

couple committed suicide with Dominant war - Sakshi

తప్పెవరిదైనా.. ముగ్గురికి శిక్ష..!

అగ్నికి ఆజ్యంపోస్తున్న ఆధిపత్య పోరు

నిందలు భరించలేక దంపతుల మానసిక క్షోభ

 పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం

‘‘వాళ్లు తప్పుచేయలేదు... 
కానీ శిక్ష అనుభవిస్తున్నారు.

అకారణంగా ఒకరిని చెట్టుకు కట్టేసి కొడితే, మనస్తాపంతో ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మరొకరు మేనకోడలి కోసం పోలీస్‌స్టేషన్‌లో బాధను అనుభవిస్తుంటే.. ఇంకొకరు భార్యపై నిందతో మానసిక వేదనను భరించలేక ఆత్మహత్యే శరణ్యమని పురుగుమందు తాగారు. 
వాస్తవానికి ఈ ముగ్గురూ చేసిన తప్పేమీ లేదు. మరో ఇద్దరు వ్యక్తుల కారణంగా నలిగిపోతున్నారు. కుటుంబాలు సైతం విచ్ఛిన్నం అయ్యే దారుణస్థితి ఏర్పడింది. వాస్తవాలు మరుగుచేసినా... రెండు కుటుంబాల్లోని ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ వారిని వెంటాడుతోంది. క్షణికమైన ఆవేశాలతో తీసుకునే నిర్ణయాలకు భారీ మూల్యం తప్పదనే అనుభవాన్ని కాలం వారికి నేర్పుతోంది. కొడుకు తప్పునకు తండ్రి... మేనకోడలి తప్పునకు మేనమామ, భర్త తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు.’’ 

ఏలూరు టౌన్‌/టి.నర్సాపురం : టి.నరసాపురం మండలం సాయంపాలెం గ్రామంలో ఒక వ్యక్తిని చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన తీవ్ర సంచలనంగా మారింది. కొడుకు నాగేంద్ర ఒక వివాహిత మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఆమె బంధువులు తండ్రి ఆడమిల్లి సంజీవరావుపై తమ అక్కసు తీర్చుకున్నారు. ఇదే ఘటనలో కీలక వ్యక్తిగా వ్యవహరించిన మహిళ మేనమామను పోలీసులు అరెస్టు చేశారు. ఇక భార్య కారణంగా పరువుపోయిందనే మానసిక వేదనతో భర్త నాగేంద్రప్రసాద్‌ శుక్రవారం అర్ధరాత్రి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భర్త పురుగుల మందు తాగాడని తెలియటంతో తానెందుకు మిగలాలంటూ వివాహిత కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసింది. 

వరుసగా మూడు రోజులుగా సాయంపాలెంలో చోటుచేసుకుంటున్న సంఘటనలు ఇరువర్గాలను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. మొత్తానికి గ్రామంలో ఇరు కుటుంబాలు, వారి బంధువుల మధ్య సంబంధాలు పూర్తిగా విచ్ఛిన్నమై ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసే ప్రమాదం నెలకొంది. కేవలం ఇద్దరు వ్యక్తుల అనాలోచిత, అవాంఛనీయ చర్య గ్రామంలో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. వైరి వర్గాలుగా మారి కేసులు, ప్రతికేసులతో ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు అడ్డదారులు తొక్కేందుకు వెనుకాడడంలేదు. కేవలం ఇద్దరు వ్యక్తులే సాయంపాలెంను ‘హేయం’పాలెంగా మార్చేయటంలో కీలకపాత్రధారులుగా ఉన్నారు. 

పోలీస్‌స్టేషన్‌కు వెళ్లరు : సాయంపాలెం గ్రామస్తులు ‘సాయం’ కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లరు. ఏది జరిగినా గ్రామంలోని కులపెద్దలు పంచాయితీ పెట్టి వారే తీర్పు చెబుతారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఆనవాయితీని ప్రస్తుత సంఘటన బ్రేక్‌ చేసింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ప్రజలే ఇక్కడ జీవిస్తున్నా... వైరి వర్గంలా మారి ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం పోరాటాలు చేసుకోవటం పరిపాటిగా మారింది. ఒకే వర్గంలో పెత్తనం కోసం పరితపించే పెద్ద మనుషులు ఐక్యతను కాకుండా వైషమ్యాలను నూరిపోస్తున్నారు. 

ఫోన్‌ రికార్డింగ్‌లున్నాయని బెదిరింపులు:
గ్రామంలోని కొందరు యువకులు తమ వద్ద ఫోన్‌లో రికార్డు చేసిన మాటలు ఉన్నాయని మీరు తమను ఏమీ చేయలేరని బెదిరించడంతోపాటు అసభ్యంగా మాట్లాడుతూ వివాహిత భర్తను బెదిరించారు. తీవ్ర మానసిక వేదనకు గురైన అతను శుక్రవారం అర్ధరాత్రి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భర్త పురుగుల మందు తాగటంతో భార్య  కూడా పురుగుల మందు తాగి బలవన్మరణానికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో ఆమె తన భర్తను కొందరు యువకులు బెదిరిస్తున్నట్లు వాంగ్మూలం ఇచ్చింది. ఇక తన మేనమామను వెంటనే అరెస్టు చేసిన పోలీసులు తనను చేయిపట్టుకుని వేధించిన ఆడమిల్లి నాగేంద్ర అనే వ్యక్తిని మాత్రం ఇంతవరకూ పట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్యాభర్తలను జంగారెడ్డిగూడెం డీఎస్పీ సీహెచ్‌ మురళీకృష్ణ శనివారం పరామర్శించి న్యాయం చేస్తానని చెప్పారు. నాగేంద్రప్రసాద్‌ పరిస్థితి విషమంగా ఉందని, రెండు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించాల్సి ఉంటుందని బంధువులు తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top