ఏపీలో పోలీసుల హైఅలర్ట్‌

Coronavirus: High alert of police in AP - Sakshi

ఢిల్లీకి వెళ్లొచ్చిన వారిని గుర్తించే పనిలో పోలీసులు

స్వచ్ఛందంగా క్వారంటైన్‌కు రాకుంటే పోలీసులే తీసుకొచ్చేలా ఏర్పాట్లు

కోవిడ్‌ పాజిటివ్‌ కేసులున్న చోట మరిన్ని కఠిన చర్యలు

అవసరమైతే కర్ఫ్యూ  

సాక్షి, అమరావతి: విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే ప్రధానంగా కోవిడ్‌ వ్యాపిస్తోందని వారిని కట్టడి చేసిన తరుణంలో ఊహించని విధంగా ఢిల్లీ నుంచి వచ్చిన వారి నుంచి ప్రమాదం ముంచుకు రావడంతో మంగళవారం పోలీసులు అలర్ట్‌ అయ్యారు. దీని తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. 

ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో మార్చి 13 నుంచి 16 వరకు ప్రార్థనలు నిర్వహించారు. వీటికి మన రాష్ట్రం నుంచి వందల సంఖ్యలో వెళ్లారు. వీరు 17, 18, 19 తేదీల్లో తిరిగి స్వస్థలాలకు చేరుకున్నారు. 
ఆంధ్రప్రదేశ్‌లో నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో అత్యధికం ఢిల్లీ వెళ్లొచ్చిన వారేనని నిర్ధారణ కావడంతో నష్టనివారణ చర్యలు ఊపందుకున్నాయి. 
ఇప్పటికే వారంతా రోజుల తరబడి కుటుంబ సభ్యులతో ఉండటం, బయట ప్రజల్లోనూ తిరగడంతో వారికి కూడా వైరస్‌ సోకే ప్రమాదం ఉందని అధికారులు గుర్తించారు. 
ఇందులో భాగంగా ముందు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిని గుర్తించి.. వారికి వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు వారితో ఎవరెవరు కలిశారో గుర్తించి వారికి కూడా పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
ఢిల్లీ వెళ్లి వచ్చినవారితోపాటు వారి కుటుంబ సభ్యులకు కూడా కోవిడ్‌ సోకినట్టు నిర్ధారణ కావడంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులు హైఅలర్ట్‌ ప్రకటించి అవసరమైన చర్యలు చేపట్టారు.
ఇప్పటికే కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన ప్రాంతాలతోపాటు అనుమానితులు, ఢిల్లీ వెళ్లి వచ్చినవారు ఉన్న ప్రాంతాల్లో రెవెన్యూ, వైద్య ఆరోగ్య సిబ్బందితో పోలీసులు జల్లెడ పడుతున్నారు. 
కోవిడ్‌ సోకిందని అనుమానించే వారంతా స్వచ్ఛందంగా క్వారంటైన్‌కు రావాలని అధికారులు కోరుతున్నారు. అలా రానివారిని నిర్బంధంగా క్వారంటైన్‌కు తరలించే ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ రహస్యంగా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తే పోలీసు కేసులు పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. 
ఇప్పటికే రాష్ట్రమంతటా లాక్‌డౌన్‌ అమలవుతుండగా కొన్ని చోట్ల 144 సెక్షన్‌ విధించారు. కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు ఉన్న చోట లాక్‌డౌన్‌ను సడలించకుండా కఠినంగా అమలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. అవసరమైతే కర్ఫ్యూ పెట్టే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top